సమంత కోసమే ఆ మూవీ చేశా
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమాకు గోపీ సుందర్ సాంగ్స్ ఇవ్వగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 March 2025 12:00 AM ISTవరుస సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం చాలా బిజిగా ఉన్నాడు. మొన్న సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్ నుంచి తర్వాత రాజా సాబ్ మూవీ రానుంది. రీసెంట్ గా తమన్ ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మజిలీ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమాకు గోపీ సుందర్ సాంగ్స్ ఇవ్వగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ శివ తనకు చెప్పాడని, తర్వాత సమంత ఫోన్ చేసి చైతూతో పెళ్లి అయ్యాక మా కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా అని, ఇది కచ్ఛితంగా హిట్ అవ్వాలని, మీరే దీనికి మ్యూజిక్ చేయాలి, నేను, చైతూ మీ దగ్గరకు రావాలనుకుంటున్నామని చెప్పిందని అన్నాడు.
దానికి తాను మీరు వచ్చే పన్లేదని, నన్ను నమ్మి కాల్ చేశారు కాబట్టి నేను చేస్తానని చెప్పానన్నాడు. అయితే తనకు మార్చి 23న సినిమా వచ్చిందట, ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ అప్పటికే లాక్ అయిపోయింది. బీజీఎంకు తనకు ఎంతలేదన్నా 10 రోజులు పడుతుందని చెప్పాడట తమన్. వెంటనే సమంత ఫోన్ చేసి తక్కువ టైమే ఉందని అడిగిందని తమన్ అన్నాడు.
సాంగ్స్ తాను చేయకపోవడం వల్ల బీజీఎం ఎలా ఇవ్వాలని ఎంతో ఆలోచించి, సాంగ్స్ ను చాలా సార్లు లూప్ లో విని ఆ మ్యూజిక్ మోడ్ లోకి వెళ్లి పని చేశానని, మొత్తం 90 మంది ఆర్కెస్ట్రాతో అన్నపూర్ణ స్టూడియోస్ లోని అన్ని రూమ్స్ ను తీసుకుని వర్క్ చేశానని, మార్చి 23 తనకు సినిమా ఇస్తే 30న ఫైనల్ బీజీఎం ఇచ్చానని, రెండు రోజుల్లో మూవీ మొత్తాన్ని మిక్స్ చేసి ఏప్రిల్ 1న ఫుల్ అవుట్‌పుట్ ఇచ్చినట్టు తమన్ తెలిపాడు.
ఏప్రిల్ 5న రిలీజైన మజిలీ బీజీఎంకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, మజిలీకి తాను వారం రోజుల్లో మొత్తం వర్క్ ను పూర్తి చేశానని, ఆ వారం రోజుల పాటూ అన్ని పనుల్ని పక్కన పెట్టి మరీ దాని మీదే వర్క్ చేసినట్టు తమన్ తెలిపాడు. మజిలీ తనకు మ్యాజిక్ లాంటి ఫీల్ ను కలిగించిందని చెప్పిన తమన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.