సిద్ధార్థ గాడికి, నాకు అసలు పడేది కాదు: తమన్
ప్రస్తుతం సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా చలామణి అవుతున్నాడు తమన్.
By: Tupaki Desk | 3 March 2025 10:34 AM ISTప్రస్తుతం సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా చలామణి అవుతున్నాడు తమన్. మణిశర్మ దగ్గర శిష్యరికం చేసి, అప్పట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కీ బోర్డు ప్లేయర్ గా వర్క్ చేసిన తమన్, రవితేజ- సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన కిక్ సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
మొదటి సినిమా కిక్ బ్లాక్ బస్టర్ అవడంతో పాటూ ఆ సినిమాకు తమన్ ఇచ్చిన పాటలు, బీజీఎం అందరినీ ఆకట్టుకోవడంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అయింది. తమన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఖాళీ లేనంత బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా తమన్ సంగీతం అందించిన శబ్ధం మూవీ థియేటర్లలో రన్ అవుతుంది.
ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ శబ్ధం మూవీ ప్రమోషన్స్ లో తమన్ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో బాయ్స్ మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన పలు విషయాలను తమన్ గుర్తు చేసుకున్నాడు. బాయ్స్ షూటింగ్ టైమ్ లో తాను చేసిన రచ్చ, గొడవ అంతా ఇంతా కాదని, అందరినీ టార్చర్ చేసినట్టు చెప్పుకొచ్చాడు తమన్.
ఆ సినిమా షూటింగ్ టైమ్ లో తనకు, సిద్ధార్థ్ కు అసలు పడేది కాదని, సిద్ధార్థ్ తన దగ్గరకొచ్చి నేను హీరోని అనేవాడని, నువ్వు హీరో అయితే ఏంటి? ఏదైతే ఏంటి? అందరికంటే ఎక్కువ పెయిడ్ ఇక్కడ నేనే అని చెప్పేవాడినని, సెట్స్ లో ప్రతి ఒక్కరూ తనను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాళ్లని, ఆఖరికి సాక్స్ విషయంలో కూడా తమకు గొడవలొచ్చేవని చెప్పాడు తమన్.
సిద్ధార్థ్ కు నైకి సాక్స్ ఇస్తే, తనకు నైలాన్ సాక్స్ ఇచ్చేవారని, ఆ సాక్స్ ను తీసుకెళ్లి నిర్మాత రత్నం టేబుల్ మీద వేసి ఇద్దరం డ్యాన్స్ చేసేది ఒకటే. సిద్ధార్థ్‌కి మంచి సాక్స్ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇచ్చారని కంప్లైంట్ చేశానని చెప్పుకొచ్చాడు తమన్.
అంతేకాదు, సెట్స్ లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ కి గాజు గ్లాస్ లో మూత పెట్టి మరీ జ్యూస్ ఇవ్వడం చూసి తను కూడా జ్యూస్ అడిగానని, కానీ తనకు, తన గ్యాంగ్ కు మాత్రం స్టీల్ గ్లాస్ లో అన్నీ ఒలికిపోయేట్టు తెచ్చి త్వరగా తాగిచ్చేయన్నాడని చెప్పడంతో వెళ్లి గాజు గ్లాస్ లో తీసుకునిరా లేకపోతే రత్నం గారికి చెప్తానని బెదిరించి తెప్పించుకున్నానని, పది రూపాయల జ్యూస్ గొడవను కూడా నిర్మాత దగ్గరకు తీసుకెళ్లానని, అవన్నీ ఇప్పుడు తలచుకుంటేనే చాలా నవ్వొస్తుందని తమన్ చెప్పాడు. శంకర్ ఈ గొడవలన్నీ తెలుసుకుని ఇంత చీప్ గా గొడవ పడుతున్నారేంటి అని అనుకునేవాడని తెలిపాడు తమన్.