22 ఏళ్ళ తరువాత నటుడిగా థమన్.. టీజర్ చూశారా?
"వరల్డ్ లోనే ఫస్ట్ ఎమోషన్ లవ్” అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్‌లో థమన్ డాక్టర్‌గా కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 14 Feb 2025 2:39 PM GMTసూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ మళ్ళీ 22 ఏళ్ల తర్వాత యాక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న థమన్, ఈసారి వెండితెరపై నటుడిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. 2003లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాయ్స్' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత పూర్తిగా మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో బిజీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తన నటనా ప్రయాణాన్ని తమిళ చిత్రం ‘ఇదయమ్ మురళి’తో ప్రారంభించబోతున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా 'ఇదయమ్ మురళి' ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో అథర్వ మురళి హీరోగా నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు 'గద్దల కొండ గణేష్' సినిమా ద్వారా దగ్గరైన అథర్వతో కలిసి థమన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. థమన్ ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో స్పందిస్తూ, "ఇది నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. అథర్వతో కలిసి సాలిడ్ ఎంటర్‌టైనర్ ఇవ్వబోతున్నాం" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
'ఇదయమ్ మురళి' టీజర్ ఎమోషనల్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంటోంది. “వరల్డ్ లోనే ఫస్ట్ ఎమోషన్ లవ్” అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్‌లో థమన్ డాక్టర్‌గా కనిపిస్తున్నారు. 2012లో వాలెంటైన్స్ డే రోజున అథర్వ సాయం తో థమన్ ఓ అమ్మాయిని ప్రేమలోకి లాగడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం, ఆ క్షణానికే చర్చ్ ఫాదర్‌ను పిలిపించి పెళ్లి చేయాలనుకోవడం వంటి సరదా సన్నివేశాలు కనిపించాయి. ఆ తర్వాత కథ నేరుగా 2025 న్యూయార్క్‌కి షిఫ్ట్ అవ్వడం ద్వారా ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని స్పష్టమవుతోంది.
అలాగే, టీజర్‌లో థమన్ యాక్టింగ్ విశేషంగా ఆకట్టుకుంది. 22 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా యంగ్ లుక్‌లో కనిపించిన ఆయన, పర్ఫెక్ట్ గా డైలాగ్‌లు చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన ముద్రవేసిన థమన్, ఈ సినిమాకు సంగీతం కూడా అందించడం విశేషం. టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థమన్ స్వరపరచిన ఈ ఎమోషనల్ సాంగ్స్ సినిమా హైలైట్ అవుతాయని భావిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీతి ముకుందన్ ‘ఓం భీమ్ బుష్’ ‘కన్నప్ప’ సినిమాల్లో కనిపించగా, కయాదు లోహర్ ‘అల్లూరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో ఆకాష్ భాస్కరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ఇదయమ్ మురళి’ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మనసులను తాకనుందని మేకర్స్ చెబుతున్నారు. టీజర్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి థమన్ రీఎంట్రీతో ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి.