గేమ్ చేంజర్.. కొరియోగ్రాఫర్లదే తప్పన్న తమన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడంటే మొదట్లో మెగా అభిమానులు ఎంత ఎగ్జైట్ అయ్యారో.
By: Tupaki Desk | 19 March 2025 4:00 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడంటే మొదట్లో మెగా అభిమానులు ఎంత ఎగ్జైట్ అయ్యారో. కానీ చివరికి శంకర్‌తో చరణ్ ఎందుకు సినిమా చేశాడో అని తలలు పట్టుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర అంత దారుణమైన ఫలితాన్నందుకుందీ చిత్రం. ఈ సినిమాకు ఏదీ సరిగా కుదరలేదనే అభిప్రాయం అభిమానుల నుంచి వినిపించింది.
మ్యూజిక్ విషయంలో కూడా కొంతమేర విమర్శలు తప్పలేదు. తమన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడనే కామెంట్లు వినిపించాయి. ఐతే ఈ సినిమాకు పాటలు అందించే విషయంలో తాను చేయాల్సిందల్లా చేశానని.. అవి జనాలకు కనెక్ట్ కాకపోవడానికి కొరియోగ్రాఫర్ల లోపమే కారణమని తమన్ ఓ ఇంటర్వ్యూలో తేల్చేశాడు.
‘‘ఒక పాట అంటే కేవలం సంగీతం మాత్రమే కాదు. నేను చేసిన పాటకు 25 మిలియన్ వ్యూస్ రావచ్చు. మంచి మెలోడీ పాట చేస్తే 50 మిలియన్ వ్యూస్ కూడా వస్తాయి. కానీ తర్వాత ఆ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాల్సింది కొరియోగ్రాఫర్. డ్యాన్స్ మాస్టర్లు సరైన స్టెప్స్ కంపోజ్ చేయాలి. కానీ గేమ్ చేంజర్ సినిమాలో ఏ పాటకూ సరైన హుక్ స్టెప్ పడలేదు.
జరగండి, రా మచ్చా రా, నానా హైరానా.. ఈ పాటల్లో దేనికీ స్టెప్స్ కుదరలేదు. ‘అల వైకుంఠపురములో’ సినిమా చూడండి. అందులో ప్రతి పాటకూ హుక్ స్టెప్ కుదిరింది. ‘గేమ్ చేంజర్’ విషయంలో అది జరగలేదు. ఒక పాటకు డ్యాన్స్ బాగుండేలా చూసుకోవడం కొరియోగ్రాఫర్, హీరో బాధ్యత. సరైన హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే ‘గేమ్ చేంజర్’ పాటలతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారన్నది నా అభిప్రాయం’’ అని తమన్ తెలిపాడు.