భవిష్యత్తులో వృద్ధాశ్రమం నిర్మించాలనుంది: తమన్
తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 Feb 2025 5:21 PM GMTతలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కాన్సర్ట్ ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా బాధితులకి, సమాజ సేవకే వెళ్తుందని ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించింది.
ఈ కాన్సర్ట్ లో టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన గ్రూప్ తో పాటూ పాల్గొని మ్యూజిక్ లవర్స్ ను ఎంటర్టైన్ చేయనున్నాడు. అయితే ఈ కాన్సర్ట్ కోసం తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. తమన్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ షో చేస్తున్నాడు. ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది.
ఇవాళ ఈ షో కు సంబంధించిన ప్రెస్ మీట్ జరగ్గా అందులో తమన్ కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. ఈ షో చాలా గొప్ప ఆలోచనతో మొదలైందని, తలసేమియా బాధితులకు సహాయం కోసం ఓ షో చేయాలని చెప్పగానే తాను వెంటనే ఒప్పుకున్నట్టు చెప్పాడు. తనను నమ్మి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన చేతిలో పెట్టడం గౌరవంగా భావిస్తున్నట్టు తమన్ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ కోవిడ్19 తర్వాత తనలో సామాజిక స్పృహ పెరిగిందని, సమాజానికి ఏదైనా చేయాలనిపిస్తుందని, చాలా మంచి ఆలోచనలొస్తున్నాయని, ఫ్యూచర్ లో వృద్ధాశ్రమం నిర్మించాలనే ఆలోచన కూడా ఉందని తమన్ వెల్లడించాడు. అయితే చేసిన మంచి ఎప్పుడూ చెప్పుకోకూడదని అందుకే తానేం చేసినా బయటకు చెప్పొద్దని తన టీమ్ కు కూడా చెప్తుంటానని తమన్ ఈ సందర్భంగా తెలిపాడు.
ఫిబ్రవరి 15న జరగనున్న ఈ కాన్సర్ట్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఇలా ఫ్రీ గా షో చేయడం అతని మంచి మనసుకు నిదర్శనంగా నిలుస్తోంది.