తమన్ గొప్ప ముందు చూపు..!
చిన్న వయసులోనే తమన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాలు చేయాలని తమన్ మొదటి నుంచి కోరుకున్నాడట.
By: Tupaki Desk | 28 Feb 2025 5:41 AM GMTసినిమా ఇండస్ట్రీలో దర్శకులు కావాలని వచ్చిన వారు హీరోలుగా, హీరోలు కావాలని వచ్చిన వారు దర్శకులుగా, సినిమాటోగ్రఫర్‌గా వచ్చిన వారు దర్శకులుగా ఇలా ఒక రంగంపై ఆసక్తితో వచ్చిన వారు మరో రంగంలో సెటిల్ అయిన వారు ఉంటారు. కెరీర్ ఆరంభంలో ఏదో ఒకటి అనుకుని ఒప్పుకున్న వారు కొన్ని కారణాల వల్ల అదే రంగంలో సెటిల్ కావాల్సి వస్తుంది. అయితే కొద్ది మంది మాత్రమే తాము కావాలి అనుకున్న అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. మధ్యలో ఇబ్బందులు వచ్చినా, ఇతర ఆఫర్లు వచ్చినా పట్టించుకోకుండా తమ గోల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో తమన్ ఒకడు అనడంలో సందేహం లేదు.
చిన్న వయసులోనే తమన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాలు చేయాలని తమన్ మొదటి నుంచి కోరుకున్నాడట. అనుకున్నట్లుగానే మెల్ల మెల్లగా సంగీత దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే మధ్యలో శంకర్ దర్శకత్వంలో బాయ్స్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శంకర్ బాయ్స్ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్న సమయంలో సహాయ దర్శకుడిగా చేస్తున్న సిద్దార్థ్, మ్యూజిక్ టీం లో ఉన్న తమన్‌లు ఆయన దృష్టిని ఆకర్షించారు. సిద్దార్థ్, తమన్‌లు అప్పటి వరకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ శంకర్ అడగడంతో నో చెప్పలేక పోయారు.
బాయ్స్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సిద్దార్థ్ పెద్ద హీరోగా మారాడు. తమన్ కి సైతం పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయట. 7/జీ బృందావన్ కాలనీ సినిమాలో కీలక పాత్రకు గాను సంప్రదించారట. అంతే కాకుండా విజయ్, సూర్య ఇంకా చాలా మంది పెద్ద హీరోల సినిమాల్లోనూ నటించే అవకాశాలు వచ్చాయట. కానీ తమన్ వాటన్నింటికి నో చెప్పాడట. ఆ విషయం తెలిసిన దర్శకుడు శంకర్ ఒకసారి తమన్‌ను పిలిచి బాయ్స్‌తో మంచి క్రేజ్ వస్తే ఎందుకు సినిమాల్లో నటించడం లేదు అని తిట్టాడట. 25 ఏళ్ల వయసుకు సంగీత దర్శకుడిగా సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తాను నటిస్తే ఆ లక్ష్యంను చేరలేను అనుకున్నాడట. అందుకే పెద్ద ఆఫర్లు వచ్చినా తిరష్కరించినట్లు తమన్ ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో తమన్ వస్తున్న ఆఫర్లకు టెంమ్ట్ అయి నటనలో బిజీ అయితే కచ్చితంగా ఈ స్థాయిలో సంగీత దర్శకుడిగా గుర్తింపు దక్కించుకునే వాడు కాదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస సినిమాలు చేస్తున్న తమన్ మరో వైపు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలకు వర్క్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఒకడిగా తమన్ నిలిచాడు. తమన్ ముందు చూపు వల్లే ఇది సాధ్యం అయింది. ఒక టార్గెట్ పెట్టుకుంటే దాన్ని సాధించేందుకు కష్టపడితే కచ్చితంగా ఫలితం దక్కుతుందని తమన్ ని చూస్తే అర్థం అవుతుంది. ఎంతో మందికి తమన్ ఆదర్శం అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.