తమన్ మళ్లీ దొరికిపోయాడు!
అంత పెద్ద కొరియోగ్రాఫర్ల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి అని కొందరు అంటుంటే.. నిజంగానే సినిమాలో కొరియోగ్రఫీ బాలేదన్న అభిప్రాయాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు
By: Tupaki Desk | 20 March 2025 8:00 AM ISTటాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కొత్తేమీ కాదు. ట్యూన్లు రిపీట్ చేస్తుంటాడని.. కాపీ కొడతాడని అతడి మీద నెటిజన్లు తరచూ ఆరోపణలు చేస్తుంటారు. తన పాటలు రిలీజైనపుడు ట్రోల్ చేస్తుంటారు. ఐతే తాజాగా 'గేమ్ చేంజర్' సినిమాలో పాటల కొరియోగ్రఫీపై తమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
తాను సినిమాకు మంచి పాటలు అందించినప్పటికీ.. కొరియోగ్రఫీ సరిగా చేయకపోవడం, ముఖ్యంగా హుక్ స్టెప్స్ లేకపోవడం వల్ల ఈ సినిమాలో పాటలు అనుకున్నంత పెద్ద హిట్ కాలేదని తమన్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. 'గేమ్ చేంజర్' సినిమా కోసం ప్రభుదేవా, గణేష్ ఆచార్య లాంటి లెజెండరీ కొరియోగ్రాఫర్లు పని చేసిన నేపథ్యంలో తమన్ వ్యాఖ్యల మీద పెద్ద చర్చే జరుగుతోంది.
అంత పెద్ద కొరియోగ్రాఫర్ల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి అని కొందరు అంటుంటే.. నిజంగానే సినిమాలో కొరియోగ్రఫీ బాలేదన్న అభిప్రాయాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రిలీజ్ తర్వాత ఇలా మాట్లాడుతున్న తమన్.. విడుదలకు ముందు పాటల్లో విజువల్స్, కొరియోగ్రఫీ గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చిన వీడియోలను నెటిజన్లు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు.
ఒక మ్యూజిక్ షోకు అతిథిగా వచ్చిన తమన్.. 'జరగండి' పాట గురించి మాట్లాడాడు. తెర మీద ఈ పాట చూస్తే గూస్ బంప్స్ వస్తుందని.. డ్యాన్స్ అదిరిపోతుందని.. ఇందులో ఒక హుక్ స్టెప్‌ను టీం కావాలనే దాచి పెట్టిందని వ్యాఖ్యానించాడు. 'జరగండి', 'దోప్' పాటల్లో విజువల్స్, కొరియోగ్రఫీ గురించి వేరే సందర్భాల్లో కూడా తమన్ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. ఐతే ఇప్పుడు మాత్రం కొరియోగ్రాఫర్లదే తప్పు అంటున్నాడంటూ అతణ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఐతే తమన్ మాట మారిస్తే మార్చి ఉండొచ్చు కానీ.. 'గేమ్ చేంజర్' సినిమాలో కొరియోగ్రఫీ బాలేదన్నదే మెజారిటీ నెటిజన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.