Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజర్' 'నానా హైరానా'.. అసలు గుట్టు విప్పిన థమన్

విడుదల సందర్భంగా చిత్రబృందం టెక్నికల్ కారణాల వల్లే ఈ పాట తొలగించామని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   14 Jan 2025 6:33 AM GMT
గేమ్ ఛేంజర్ నానా హైరానా.. అసలు గుట్టు విప్పిన థమన్
X

గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు నుంచే పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ‘నానా హైరానా’ అనే పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావించారు. అయితే సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదల అయ్యేసరికి, ఈ పాట తప్పించబడటం ప్రేక్షకుల్లో సందేహాలకు కారణమైంది. విడుదల సందర్భంగా చిత్రబృందం టెక్నికల్ కారణాల వల్లే ఈ పాట తొలగించామని ప్రకటించారు.

ఈ పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీతో చిత్రీకరించడంతో, దాని ప్రాసెసింగ్‌కు సమయం కావాలనే కారణంగా పాటను విడుదలకు ముందు తొలగించినట్లు వెల్లడించారు. అయితే జనవరి 14 తర్వాత ఈ పాటను చేర్చుతామని మొదట ప్రకటించినప్పటికీ, విడుదలైన వెంటనే వచ్చే నెగెటివ్ టాక్‌ను ఎదుర్కోవడంతో, మేకర్స్ ఈ పాటను రెండవ రోజే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

పాటను వెంటనే చేర్చడంతో అభిమానులు, ప్రేక్షకులు అసలు కారణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. టెక్నికల్ ఇష్యూలు కారణమైతే, రెండు రోజుల్లోనే పాటను ఎలా చేర్చగలిగారు? అని ప్రశ్నలు పెరిగాయి. ఈ నేపథ్యంలో, సంగీత దర్శకుడు తమన్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

తమన్ మాట్లాడుతూ, ‘‘సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ ట్రాక్ సరైన బలాన్ని సాధించలేకపోయింది. ఆ సందర్భంలో ‘నానా హైరానా’ పాట అనవసరంగా అనిపించింది. ఇదే పాటను రెండవ భాగంలో చేర్చితే కూడా నెరేషన్‌కు సరిపోకుండా ఉంటుందని భావించాము’’ అని వివరించారు.

తమన్ చెప్పిన వివరాల ప్రకారం, సినిమా ఫ్లోలో ఈ పాట పర్ఫెక్ట్ గా సెట్టవ్వదని భావించి, విడుదలకు ముందు దీనిని తొలగించేందుకు టీమ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, నెగటివ్ టాక్‌ను తగ్గించేందుకు పాటను తర్వాతి రోజే చేర్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల గేమ్ ఛేంజర్ టాక్‌లో పెద్దగా మార్పు రాకపోయినా, ప్రేక్షకులు పాటను ఎంజాయ్ చేస్తుండడం విశేషం. తమన్ ఈ వివరణతో అభిమానుల్లో ఉన్న సందేహాలకు ఒక విధమైన సమాధానం ఇచ్చారని చెప్పవచ్చు.