Begin typing your search above and press return to search.

నయనతార ఫోన్‌ కాల్‌ వల్లే ఆత్మహత్య మానుకున్నా..!

ఒక ఇంటర్వ్యూలో తంబి రామయ్య మాట్లాడుతూ... నా తల్లి చనిపోయిన సమయంలో డిప్రెషన్‌లో ఉన్నాను. ఆ సమయంలో నాకు ఆత్మహత్య గురించిన ఆలోచన వచ్చింది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 5:30 PM GMT
నయనతార ఫోన్‌ కాల్‌ వల్లే ఆత్మహత్య మానుకున్నా..!
X

నయనతార, విఘ్నేష్ శివన్‌ల డాక్యుమెంటరీ 'నయనతార : బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా తాను నిర్మించిన నానుమ్‌ రౌడీ థానే సినిమాలోని విజువల్స్‌ను వినియోగించారు అంటూ కాపీరైట్‌ యాక్ట్‌ కింద కేసు వేయడం జరిగింది. వెంటనే తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. మొదట నోటీసులతోనే ఈ వివాదం చల్లారుతుందని అంతా భావించారు. కానీ నయనతార చాలా సీరియస్‌గా ధనుష్ గురించి వ్యాఖ్యలు చేయడంతో వివాదం చాలా పెద్దదిగా మారింది.

ధనుష్‌ను నయనతార వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి విమర్శలు చేయడంతో చాలా మంది ఆమె తీరును తప్పుబడుతున్నారు. కొందరు ఆమెను సమర్ధించినా ఎక్కువ శాతం ధనుష్ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర పదజాలతో నయనతారను విమర్శిస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో నయనతార, ధనుష్‌లకు సంబంధించిన వివాదం వైరల్‌ అవుతూ ఉంది. ఈ సమయంలో నయనతార గురించి నటుడు తంబి రామయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పుడు నయనతార అభిమానులు, కొందరు నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తూ ఉన్నారు.

ఒక ఇంటర్వ్యూలో తంబి రామయ్య మాట్లాడుతూ... నా తల్లి చనిపోయిన సమయంలో డిప్రెషన్‌లో ఉన్నాను. ఆ సమయంలో నాకు ఆత్మహత్య గురించిన ఆలోచన వచ్చింది. తల్లి సర్వస్వం అనుకున్న నాకు ఆమె మరణంతో ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆ సమయంలో నా పిల్లల గురించి ఆలోచన ఉన్నా ఆత్మహత్య గురించే ఎక్కువగా మానసిక సంఘర్షణ జరిగేది. నా కుమార్తె వివాహం మాత్రమే జరిగింది, కొడుకు పెళ్లి కావాల్సి ఉంది. ఆ విషయాలు నాకు పట్టడం లేదు. నేను డిప్రెషన్‌లో ఉండి చనిపోవడం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నయనతార నుంచి కాల్‌ వచ్చింది.

అమ్మ చనిపోయిన సమయంలో తాను మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉన్నాను. అందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న డోర సినిమా ఒకటి. షూటింగ్‌కి వెళ్లక పోడంతో విషయం తెలుసుకున్న నయనతార గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ రోజు నాకు చాలా విషయాలు అర్థం అయ్యాయి. జీవితంలో బలంగా ఉండటం ఎలా, కొన్ని విషయాలను మరచి పోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఏంటి అని తెలుసుకున్నాను. జీవితం ఇంకా ముందు చాలా ఉంది, మన వల్ల ఇంకా చాలా మంది సంతోషంగా ఉండాల్సి ఉందని నయనతార గారు చెప్పిన మాటలు ఆ రోజు నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి ఎప్పుడూ ఆత్మహత్య గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఆ ఫోన్‌ కాల్‌ రాకుండా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడినేమో అంటూ తంబి రామయ్య అన్నారు.