తండేల్ కు మరో వారం కలిసొచ్చిందిగా!
ఇదిలా ఉంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ తండేల్ సినిమాకు మరో అంశం బాగా కలిసొస్తుంది.
By: Tupaki Desk | 15 Feb 2025 4:43 AM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు తండేల్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్వరం గ్రామానికి చెందిన కొందరి మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. రూ.100 కోట్ల మార్క్ దిశగా పరుగులెడుతున్న తండేల్ సినిమాకు పోటీ ఏమీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి రన్ తో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ తండేల్ సినిమాకు మరో అంశం బాగా కలిసొస్తుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న తెలుగులో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి బ్రహ్మ ఆనందం మరియు విశ్వక్ సేన్ లైలా సినిమాలు. అయితే ఈ రెండు సినిమాలకూ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రాలేదు. బ్రహ్మా ఆనందం యావరేజ్ అంటుంటే, లైలాను మాత్రం డిజాస్టర్ గా తేల్చేశారు. దీంతో ఈ అంశం తండేల్ కు కలిసిరానుంది.
బాలీవుడ్ నుంచి ఛావా రిలీజైనప్పటికీ ఆ ఎఫెక్ట్ టాలీవుడ్ లో పెద్దగా ఉండదు. ఎలాగూ తెలుగు ఆడియన్స్ సపరేట్ గా ఉంటారు కాబట్టి బాలేని సినిమాలైన బ్రహ్మా ఆనందం, లైలా సినిమాలకు వెళ్లడం కంటే అవసరమైతే మరోసారైనా తండేల్ సినిమాకే వెళ్తారు. మొత్తానికి ఈ రెండు సినిమాలకు మంచి టాక్ రాకపోవడంతో క్రమంగా తండేల్ కు టికెట్ సేల్స్ పెరుగుతున్నాయి.
నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించింది. తండేల్ లో రాజు, సత్య పాత్రలకు ఫిదా అవని వారుండరనే రీతిలో వీరిద్దరూ ఇందులో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. మొత్తానికి ఈ సినిమాతో నాగ చైతన్య సాలిడ్ హిట్ అందుకున్నాడు.