Begin typing your search above and press return to search.

చిరుతో చైతూ ఢీ?

ఐతే తాజాగా నిర్మాత దిల్ రాజు.. తండేల్ టీంకు గేమ్ చేంజ‌ర్ క్రిస్మ‌స్‌కు రావ‌డంపై క్లారిటీ ఇచ్చేసిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 3:30 AM GMT
చిరుతో చైతూ ఢీ?
X

అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం.. తండేల్. కార్తికేయ‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి రూపొందిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ పెద్ద బ‌డ్జెట్లో తెర‌కెక్కిస్తోంది. టీజ‌ర్‌తో బాగా ఇంప్రెస్ చేసిన ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చైతూ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి న‌టించ‌డం, వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తీర్చిదిద్దుకున్న‌ క‌థాంశం ఎగ్జైటింగ్‌గా ఉండ‌డం సినిమా మీద అంచ‌నాల‌ను పెంచుతోంది. ఈ సినిమా టీజ‌ర్ లాంచ్ చేసిన‌పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌రు 20న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ క్రిస్మ‌స్ రేసులోకి వేరే సినిమాలు రావ‌డంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ సినిమా గేమ్ చేంజ‌ర్ క్రిస్మ‌స్‌ను టార్గెట్ చేయ‌డంతో తండేల్ డేట్ మార్చాల‌ని చూస్తున్నారు. ఐతే గేమ్ చేంజ‌ర్ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసేవ‌ర‌కు వేచి చూడాల‌ని అనుకుంటున్నారు.

ఐతే తాజాగా నిర్మాత దిల్ రాజు.. తండేల్ టీంకు గేమ్ చేంజ‌ర్ క్రిస్మ‌స్‌కు రావ‌డంపై క్లారిటీ ఇచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కొత్త డేట్ మీద తండేల్ దృష్టిసారించింది. క్రిస్మ‌స్ మిస్స‌యితే సంక్రాంతికి రావాలి. లేదంటే స‌మ్మ‌ర్ వ‌ర‌కు వేచి చూడాలి. సినిమా ఆల్మోస్ట్ పూర్తయ్యే ద‌శ‌లో ఉన్న నేప‌థ్యంలో వేస‌వి వ‌ర‌కు వేచి చూడాల‌ని అనుకోవ‌ట్ల‌ద‌ట చిత్ర బృందం. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ.. ప్రేక్ష‌కాద‌ర‌ణ బాగుంటుంద‌నే ఉద్దేశంతో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. జ‌న‌వ‌రి 10న చిరంజీవి సినిమా విశ్వంభ‌ర రానుండ‌గా.. మూడు రోజుల గ్యాప్‌లో జ‌న‌వ‌రి 13న తండేల్‌ను రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఐతే సంక్రాంతికి చైతూ మావ‌య్య వెంక‌టేష్ కొత్త చిత్రం.. అలాగే బాల‌య్య సినిమా కూడా రేసులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. కానీ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. అవి కూడా రేసులో ఉంటే తండేల్‌కు కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా స‌రే కంటెంట్ మీద న‌మ్మ‌కంతో సంక్రాంతికి రిలీజ్ చేసేద్దామ‌నే టీం అనుకుంటోంద‌ట‌.