Begin typing your search above and press return to search.

'తండేల్' మూవీ రివ్యూ

'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య-సాయిపల్లవి కలయికలో తెరకెక్కిన చిత్రం.. తండేల్. గీతా ఆర్ట్స్ బేనర్లో చందూ మొండేటి ఈ చిత్రాన్ని రూపొందించాడు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 7:12 AM GMT
తండేల్ మూవీ రివ్యూ
X

'తండేల్' మూవీ రివ్యూ

నటీనటులు: నాగచైతన్య-సాయిపల్లవి-దివ్య పిళ్లై-ఆడుగలం నరేన్-కరుణాకరన్-పృథ్వీ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: శ్యామ్ దత్

కథ: కార్తీక్

నిర్మాత: బన్నీ వాసు

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందూ మొండేటి

'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య-సాయిపల్లవి కలయికలో తెరకెక్కిన చిత్రం.. తండేల్. గీతా ఆర్ట్స్ బేనర్లో చందూ మొండేటి ఈ చిత్రాన్ని రూపొందించాడు. మంచి పాటలు.. చక్కటి ప్రోమోలతో విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకున్న చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రాజు (నాగచైతన్య) శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కుర్రాడు. సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అతడి కుటుంబానికి తరతరాలుగా వస్తున్న వృత్తి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అతనూ అదే పని చేస్తాడు. ఈ క్రమంలో జాలరుల బృందానికి నాయకుడైన తండేల్ అవుతాడు. అతడికి సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. ఆమెకూ అతనంటే అంతే ఇష్టం. కానీ సముద్రంలో వేటకు వెళ్లే వాళ్ల ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో రాజును ఆ పని మానేయమని అడుగుతుంది సత్య. కానీ అందుకతను ఒప్పుకోడు. ఓ సందర్భంలో సత్య ఎంత పట్టుబట్టినా వినకుండా వేటకు వెళ్తాడు. ఈ క్రమంలో అతను.. తన బృందం పాకిస్థాన్ అధికారులకు చిక్కుతారు. మరి అక్కడి నుంచి రాజు బృందం తప్పించుకుందా లేదా.. అతణ్ని బయటికి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలేంటి.. చివరికి రాజు-సత్య కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: చూడ్డానికి చక్కగా అనిపించే ప్రేమ జంట.. నిజంగా వీళ్లిద్దరూ ప్రేమికులా అనిపించేలా వారి మధ్య పండిన కెమిస్ట్రీ.. మంచి ఫీల్ ఉన్న ప్రేమ సన్నివేశాలు.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు.. అందమైన విజువల్స్.. ప్రేమికుల మధ్య బలమైన సంఘర్షణకు దారి తీసే ఒక సమస్య.. దాని చుట్టూ ఒక డ్రామా.. ఒక ప్రేమకథ పండడానికి ఇంతకంటే ఏం కావాలి? 'తండేల్'లో ఇవన్నీ ఉన్నాయి. 'తండేల్' గురించి చిత్ర బృందం చెప్పింది ఏదీ అతిశయోక్తి కాదనిపించేలా సాగే ప్రథమార్ధం.. ఈ చిత్రాన్ని బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలబెట్టడానికి బలమైన పునాది వేసేట్లే కనిపిస్తుంది. కానీ ఈ ప్రేమకథకు దేశభక్తి కోణం జోడించి దీని రీచ్ పెంచడానికి చేసిన ప్రయత్నం అందుకు ఉపయోగకపడకపోగా.. లవ్ స్టోరీలో ఉన్న ఫీల్ ను కొంచెం దెబ్బ తీసి 'తండేల్' స్థాయిని తగ్గిస్తుంది. సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అనుకున్న పాకిస్థాన్ ఎపిసోడ్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడం 'తండేల్'కు మైనస్. అయినా సరే.. దాన్ని మరిపించే ప్లస్సులు ఈ సినిమాలో ఉన్నాయి.

'తండేల్' నిజంగా జరిగిన కథకు కొంచెం డ్రామా జోడించి తీసిన సినిమా. చందూ మొండేటి బృందం ఈ సినిమా తీయడానికి ప్రేరేపించిన అంశం.. పాకిస్థాన్‌ జలాల్లోకి వెళ్లిపోయి ఆ దేశంలో రెండేళ్ల పాటు చిక్కుకుపోయిన శ్రీకాకుళం జాలర్ల బృందం ఎన్నో ప్రయత్నాల తర్వాత స్వస్థలానికి చేరడంలో ఉన్న డ్రామానే. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే విషయమిది. ఈ రియల్ ఎపిసోడ్ చుట్టూ ఓ ఊహాజనిత ప్రేమకథను అల్లి సినిమాగా మలిచింది చిత్ర బృందం. ఐతే అందరి దృష్టినీ ఆకర్షించిన వాస్తవ కథ కంటే.. చందూ అండ్ టీం అల్లిన ప్రేమకథ ఇందులో హైలైట్ కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు చూశాం కానీ.. సముద్ర తీరంలో చేపలు పట్టుకుని బతికే కుటుంబాలకు చెందిన ఓ అబ్బాయి-అమ్మాయి మధ్య తీర్చిదిద్దిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ఎప్పుడూ చూసే ప్రేమ సన్నివేశాలే ఈ బ్యాక్ డ్రాప్ వల్ల భిన్నంగా అనిపిస్తాయి. పాటల్లో.. నేపథ్య సంగీతంలో.. విజువల్స్ లో లవ్ ఫీల్ ఉప్పొంగుతుండగా.. లీడ్ పెయిర్ మధ్య చక్కటి కెమిస్ట్రీ కూడా వర్కవుటై 'తండేల్' ప్రేమకథ ప్రేక్షకులను అలరిస్తుంది. తాను చేసే వృత్తిని ఎంతో ఇష్టపడే హీరో.. ప్రమాదకరమైన ఆ వృత్తి వల్ల అతడికి ఏమవుతుందో అన్న భయంతో ఆ పనిని వదిలేయమనే హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సంఘర్షణతో డ్రామా రక్తి కడుతుంది. ఈ సంఘర్షణ ఇలా సాగుతుండగా.. హీరో పాకిస్థాన్లో చిక్కుకోవడంతో కథ మరింత రసకందాయంలో పడ్డట్లవుతుంది.

పాకిస్థాన్ ఎపిసోడ్ ను కొంచెం సెన్సిబుల్ గా డీల్ చేసి ఉంటే.. 'తండేల్' స్థాయే వేరుగా ఉండేది. కానీ అక్కడ హీరోయిజం ఎలివేట్ చేయడానికి.. దేశభక్తి యాంగిల్ హైలైట్ చేయడానికి ప్రయత్నించడంతో 'తండేల్' రూటే మారిపోయింది. అప్పటిదాకా ఎంతో సున్నితంగా.. వాస్తవికంగా సాగుతున్న కథన శైలిలో ఓవర్ ద టాప్ స్టయిల్లో సాగే పాకిస్థాన్ ఎపిసోడ్ ఇమడలేకపోయింది. ఇంటర్వెల్ నుంచి వేరే సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అటు పాకిస్థాన్లో.. ఇక్కడ ఇండియాలో జరిగే విషయాలేవీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించవు. పనిగట్టుకుని 'తండేల్'ను చెడగొడుతున్న ఫీల్ కలుగుతుంది. పాకిస్థాన్ ఎపిసోడ్ ను డీల్ చేసిన తీరు చూస్తే.. మాస్ కు నచ్చేలా సినిమా రీచ్ పెంచడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది. కానీ అది అంతగా వర్కవుట్ కాలేదు. పాకిస్థాన్ సమస్య రావడానికి ముందే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సంఘర్షణలో ఉన్న బలమైన ఎమోషన్.. ఆ తర్వాత అంత పెద్ద సమస్య వచ్చినపుడు మిస్ కావడం 'తండేల్' సరైన దారిలో నడవట్లేదనడానికి సూచిక. ఎడబాటులో హీరో హీరోయిన్ల వేదనకు అద్దం పట్టేలా బలమైన ఎమోషనల్ సీన్లు లేకపోవడం ఇంకో మైనస్. అవతల సాయిపల్లవి లాంటి పెర్ఫామర్ ఉండగా.. మంచి ఎమోషనల్ సీన్లు పడి ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కేవి. ఈ అవకాశాన్ని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. ఐతే పాకిస్థాన్ ఎపిసోడ్ ముగింపు దశ నుంచి సినిమా మళ్లీ దారిలో వస్తుంది. హీరో బృందం రిలీజవుతున్న దశలో వచ్చే ఒక మలుపు దగ్గర్నుంచి మళ్లీ డ్రామాను రక్తి కట్టించడానికి ప్రయత్నించారు. ముగింపు సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. చివరికొచ్చేసరికి.. సగం వరకు సాగిన ప్రేమకథే.. మధ్యలో బ్రేకుల్లేకుండా చివరి వరకు సాగిపోయి ఉంటే బాగుండన్న భావన కలుగుతుంది. ఐతే కొన్ని ప్రతికూలతలున్నప్పటికీ ప్రేమకథలను ఇష్టపడేవారికి 'తండేల్' మంచి ఛాయిసే. ఈ మధ్య వచ్చిన భిన్నమైన ప్రేమకథల్లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు.

నటీనటులు: అనుకున్నట్లే 'తండేల్'కు నాగచైతన్య-సాయిపల్లవి జోడీ ప్రధాన ఆకర్షణగా మారింది. ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనలేం. వీళ్లిద్దరినీ విడి విడిగా కూడా చూడలేం. అంత బాగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. చైతూ జాలరిగా మేకోవర్ అయిన తీరు చాలా బాగుంది. కేవలం అవతారం మార్చుకోవడమే కాదు.. బాడీ లాంగ్వేజ్.. యాస.. అన్నింట్లోనూ మార్పు చూపించాడు. ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా కొలిచినట్లు నటించాడు. సాయిపల్లవి గురించి చెప్పేదేముంది.. ఆమె ప్రేమిస్తుంటే పులకింతకు గురవుతాం. బాధ పడుతుంటే.. కదిలిపోతాం. తన భావోద్వేగాలన్నింటినీ ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయగలిగింది. పాత్ర తాలూకు మానసిక సంఘర్షణను హావభావాలతో చూపించిన తీరు అద్భుతం. కానీ ద్వితీయార్ధంలో ఆ పాత్ర నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. సినిమాలో కీలక పాత్రల్లో నటించిన తమిళ ఆర్టిస్టులు ఆడుగలం నరేన్.. కరుణాకరన్ బాగా చేశారు. పృథ్వీ కూడా ఓకే. 'మంగళవారం' ఫేమ్ దివ్య పిళ్లై కూడా ఆకట్టుకుంది. జబర్దస్త్ మహేష్.. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం: దేవిశ్రీ ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత సంగీత దర్శకుడిగా వంద శాతం ఔట్ పుట్ ఇచ్చిన సినిమాగా 'తండేల్'ను చెప్పొచ్చు. ఈ కథ విని అతను చాలా ఎగ్జైట్ చేసిన పాటల్లాగా అనిపిస్తాయి 'బుజ్జితల్లీ'.. 'హైలెస్సో'.. ఈ రెండు పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ఈ పాటల థీమ్స్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం కూడా వాడుకుని ప్రేమ సన్నివేశాల్లో మంచి ఫీల్ తీసుకొచ్చాడు దేవి. పాటలు.. నేపథ్య సంగీతం విషయంలో వేలెత్తి చూపడానికి లేదు. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. ఆర్ట్ వర్క్.. వీఎఫెక్స్ కూడా ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. కార్తీక్ అందించిన కథలో బలం ఉంది. దానికి చందూ మొండేటి ఆసక్తకిరమైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. శ్రీకాకుళం నేపథ్యంలో అథెంటిగ్గా ఈ కథను నరేట్ చేశాడు. యాస దగ్గర్నుంచి అన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టిన విషయం తెరపై కనిపిస్తుంది. చైతూ-సాయిపల్లవి జంట నుంచి చందూ బెస్ట్ ఔట్ పుట్ రాబట్టుకున్నాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలా చాలా బాగా డీల్ చేశాడు. ఒక్క పాకిస్థాన్ ఎపిసోడ్ విషయంలో మాత్రం అతను డిఫరెంట్ అప్రోచ్ తో వెళ్లాల్సిందనిపిస్తుంది. ద్వితీయార్ధం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే.. 'తండేల్' వేరే స్థాయి సినిమా అయ్యేది.

చివరగా: తండేల్.. చూడదగ్గ ప్రేమకథ

రేటింగ్-2.75/5