బుజ్జితల్లిగా సాయి పల్లవినే ఎందుకంటే..!
నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ వసూళ్లు సాధించబోతున్న సినిమాగా కూడా తండేల్ నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 6 Feb 2025 5:35 AM GMTమరికొన్ని గంటల్లో 'తండేల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా మేకర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా చైతూకు ఈ సినిమా చాలా స్పెషల్‌గా నిలిచి పోనుంది అంటూ అల్లు అరవింద్ చాలా సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ వసూళ్లు సాధించబోతున్న సినిమాగా కూడా తండేల్ నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులు ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాలో బుజ్జితల్లి పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడం వెనుక కారణం వివరించారు. తండేల్ సినిమా కథ మొదట నాగ చైతన్య కంటే ముందే సాయి పల్లవి వద్దకు వెళ్లిందని తెలుస్తోంది. కథ గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వచ్చిన సమయంలో సాయి పల్లవి అయితే బాగుంటుందని అల్లు అరవింద్ అనుకున్నారట. ఈ పాత్ర కోసం ముంబై నుంచి వైట్ స్కిన్ అమ్మాయిలను తీసుకు వచ్చే అవకాశం లేదు. ఎన్నో భావోద్వేగంతో కూడిన పాత్ర బుజ్జితల్లి పాత్ర. అందుకే నిజాయితీగా చేసే వారు ఈ పాత్రకి అవసరం. అందుకే సాయి పల్లవి అయితే కచ్చితంగా న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది.
బుజ్జితల్లి పాత్రకు సాయి పల్లవి అయితే వంద శాతం న్యాయం చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఆమె ఒక అద్భుతమైన నటి, అందుకే ఈ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశాం. కచ్చితంగా కమర్షియల్ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆమె ఉంటే పాత్రకు న్యాయం జరగడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయని బలంగా నమ్మాము. అందుకే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. తాము అనుకున్నట్లుగానే బుజ్జితల్లి పాత్రకు ప్రాణం పోసింది. ఆమె నటన గురించి, డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో సాయి పల్లవిని చూడకుండా ప్రతి ఒక్కరూ బుజ్జితల్లిని చూస్తారు, ఆమెతో ట్రావెల్ చేస్తారని అన్నారు.
నాగ చైతన్య మొదటి సారి మత్స్యకారుడి పాత్రలో నటించడంతో పాటు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రెడీ అయిన కథ కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన మత్స్య కారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌లకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత ఎలా వచ్చారు అనే అంశాలను తీసుకుని ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందించారు. దాదాపు ఏడాది పాటు గ్రౌండ్ వర్క్ చేసి, రీసెర్చ్ చేసిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టినట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు.
సినిమా భారీ ఎత్తున బడ్జెట్ అవుతున్నా వెనకాడకుండా షూటింగ్ పూర్తి చేశామని, కొన్ని సన్నివేశాలు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తాయని మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఈ ఏడాదిలో మరో హిట్‌గా తండేల్ నిలుస్తుందని అల్లు అరవింద్ నమ్మకంగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సినిమాలోని మూడు పాటలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.