ఆర్టీసీ బస్‌లో 'తండేల్'... బన్నీ వాసు సీరియస్
ఇలాంటి సమయంలో తండేల్ సినిమా హెచ్‌డి ప్రింట్ పైరసీ కావడం చర్చనీయాంశం అయ్యింది. విడుదలైన మొదటి రోజే సినిమా పైరసీ కావడంతో కలెక్షన్స్‌పై దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 10 Feb 2025 7:17 AM GMTనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన 'తండేల్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి మూడు రోజుల్లో రూ. 62.37 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా తండేల్ నిలిచింది. లాంగ్ రన్‌లో తండేల్ సినిమా వంద కోట్ల వసూళ్లను టచ్ చేయడం కన్ఫర్మ్ అని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వర్గాల వారు సైతం వంద కోట్ల మూవీ అంటూ తండేల్‌ను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలో తండేల్ సినిమా హెచ్‌డి ప్రింట్ పైరసీ కావడం చర్చనీయాంశం అయ్యింది. విడుదలైన మొదటి రోజే సినిమా పైరసీ కావడంతో కలెక్షన్స్‌పై దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి.
ఆ మధ్య గేమ్ ఛేంజర్ సినిమాను కేబుల్ టీవీలో ప్రసారం చేసిన విషయం తెల్సిందే. ఆ వివాదం మరచి పోకుండానే తండేల్ సినిమాను ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం జరిగింది. బస్సులో సినిమా ప్రదర్శన గురించి తెలుసుకున్న నిర్మాత బన్నీ వాసు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఇలా బస్సులో ప్రదర్శిస్తే నిర్మాతల పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీ మనుగడ ఎలా సాధ్యం అంటూ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాత బన్నీ వాసు ఎక్స్ ద్వారా స్పందిస్తూ... ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించిన విషయం మాకు తెలిసింది. పైరేటెడ్ వర్షన్‌ను బస్సులో ప్లే చేయడం అనేది దారుణమైన విషయం. ఇది చట్టవిరుద్ధం అని తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉండదు. సినిమా కోసం మేము ప్రాణాలను సైతం పెట్టి కష్టపడుతాం. విశ్రాంతి అనేది లేకుండా వందలాది మంది కష్టపడి చేసిన సినిమాను అవమానించడమే ఇది. బస్సులో సినిమా ప్రదర్శించడంపై ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు గారు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ బన్నీ వాసు విజ్ఞప్తి చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైన వెంటనే హెచ్‌డీ ప్రింట్ ను లోకల్ టీవీలో టెలికాస్ట్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. ఆ కేసు మరవక ముందే ఎవరు ఏం అంటారులే అనుకుని బస్సులో సినిమాను ప్రసారం చేయడం దారుణం. కచ్చితంగా బస్సు డ్రైవర్ తో పాటు బాధ్యులు అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ తండేల్ మేకర్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ సంస్థ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే నాగ చైతన్య అభిమానులు పెద్ద ఎత్తున ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.