'శివ శక్తి' అప్డేట్.. శివ పార్వతులుగా చైతన్య, సాయి పల్లవి..!
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ''తండేల్''. యువ సామ్రాట్ నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ఇది
By: Tupaki Desk | 18 Dec 2024 7:03 AM GMTఅక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ''తండేల్''. యువ సామ్రాట్ నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ఇది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే వాలెంటైన్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చింది. చైతూ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన 'బుజ్జి తల్లి' పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
'తండేల్' సినిమా నుంచి ''శివ శక్తి'' అనే గీతాన్ని డిసెంబర్ 22వ తేదీన కాశీలోని డివైన్ ఘాట్స్ వద్ద గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. శివుడు, శక్తి కలిసి వస్తున్న ఈ పాటను మీతో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నానని నాగ చైతన్య ట్వీట్ చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ గీతం డివైన్ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను పంచుకున్నారు.
ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ శివ తాండవం చేస్తుండటం ఆకట్టుకుంటోంది. శివపార్వతులే వచ్చి నృత్యం చేస్తున్నారనే విధంగా ఈ జంట కనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ లో అర్థనారీశ్వర రూపంలో శివుడి విగ్రహం, నాట్యం చేస్తున్న డ్యాన్సర్లను మనం చూడొచ్చు. సెటప్ చూస్తుంటే విజువల్ గ్రాండ్ గా ''శివ శక్తి'' పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇది శివ పార్వతులకు మ్యూజికల్ ట్రీట్ గా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది.
'తండేల్' సినిమాని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళంలో శ్రీ ముఖలింగ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో తెలిసిందే. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవాలయంలో ప్రతీ ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ సినిమాలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగానే 'శివ శక్తి' సాంగ్ వస్తుందనే టాక్ వినిపిస్తోంది. భారీ సెట్టింగ్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 1000 మంది డ్యాన్సర్స్ తో ఈ పాటను షూట్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే 'బుజ్జి తల్లి' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 31 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ''శివ శక్తి'' పాట అంతకుమించి ఉంటుందని అనుకుంటున్నారు. శివనామ స్మరణతో మారుమ్రోగే ఈ అద్భుతమైన పాట చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని చిత్ర బృందం చెబుతోంది. 'బుజ్జి తల్లి పాటను తెలుగులోనే రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు 'శివ శక్తి' పాటను మాత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తుండటం గమనార్హం.
''తండేల్'' సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల దీనికి ఆర్ట్ డైరెక్టర్. 2025 ఫిబ్రవరి 7వ తేదీన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. 'లవ్ స్టోరీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగచైతన్య - సాయి పల్లవి కాంబోలో రాబోతున్న ఈ లవ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.