Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : తంగలాన్

తమిళంలో కమల్ హాసన్ తర్వాత అంతటి వైవిధ్యమైన నటుడిగా పేరు సంపాదించిన విక్రమ్.. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లాడు. కానీ అంత ప్రతిభావంతుడైన నటుడికి సరైన విజయం దక్కి చాలా కాలమైంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 10:39 AM GMT
మూవీ రివ్యూ : తంగలాన్
X

'తంగలాన్' మూవీ రివ్యూ

నటీనటులు: విక్రమ్-పార్వతి-మాళవిక మోహనన్-పశుపతి తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: కిషోర్ కుమార్

నిర్మాత: జ్ఞానవేల్ రాజా

రచన-దర్శకత్వం: పా.రంజిత్

తమిళంలో కమల్ హాసన్ తర్వాత అంతటి వైవిధ్యమైన నటుడిగా పేరు సంపాదించిన విక్రమ్.. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లాడు. కానీ అంత ప్రతిభావంతుడైన నటుడికి సరైన విజయం దక్కి చాలా కాలమైంది. అయినా అతను ప్రయోగాలు.. పాత్రల కోసం కష్టపడడం మానలేదు. ఇప్పుడు అతను ఎంతో తపనతో చేసిన సినిమా 'తంగలాన్'. ఎగ్జైటింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కబాలి' దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ఈ చిత్రమైనా విక్రమ్ కు ఆశించిన ఫలితాన్నిచ్చేలా ఉందేమో తెలుసుకుందాం పదండి.

కథ:

తంగలాన్ (విక్రమ్) స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశం బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న కాలంలో ఒక గిరిజన తెగకు చెందిన రైతు. ఐతే ఎంత కష్టపడి పంటను పండించినా.. అదంతా శిస్తులకే పోతుండడంతో ఆ పంటను తినే భాగ్యం లేక తన గూడెం ప్రజలందరూ నానా అవస్థలు పడుతుంటారు. ఒక ఏడాది పంట అంతా కాలిపోవడంతో శిస్తు కట్టలేక తన భూమిని కోల్పోతాడు తంగలాన్. అలాంటి సమయంలోనే ఒక బ్రిటిష్ దొర.. కూలి ఆశ చూపి ప్రమాదకరమైన ప్రాంతంలో బంగారు గనులు తవ్వే పనికి గూడెం జనాన్ని పిలుస్తాడు. అది ప్రమాదమని తెలిసినా.. తమ బతుకులు మారడానికి ఇదే మంచి అవకాశమని భావించి తనతో పాటు కొందరిని వెంటబెట్టుకుని బంగారం వేటకు వెళ్తాడు తంగలాన్. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని దాటి తంగలాన్ బంగారం వెలికి తీయగలిగాడా.. అది చివరికి ఎవరి సొంతమైంది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'తంగలాన్' ఎప్పుడూ మనం చూసే తరహా సినిమా కాదు. ఈ కథ నేపథ్యం.. కథా గమనం.. కనిపించే పాత్రలు.. అవి మాట్లాడే మాటలు.. అన్నీ కూడా భిన్నంగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి రెండున్నర గంటల పాటు విహరింపజేస్తాడు దర్శకుడు పా.రంజిత్. విక్రమ్ సహా ప్రతి నటుడి అభినయం అద్భుతం.. విజువల్స్ అదరహో.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్.. కానీ ఇన్ని ఆకర్షణలు ఉన్నా కూడా ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టలేకపోయింది 'తంగలాన్'. అందుక్కారణం.. పా.రంజిత్ గజిబిజి నరేషన్. కథలో విషయం ఉన్నా.. ఎంతో శ్రమకు ఓర్చి ఈ సినిమా తీసిన విషయం ప్రతి సన్నివేశంలోనూ అర్థమవుతున్నా.. నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రాణం పెట్టి పని చేసినా.. కథలో విపరీతమైన గందరగోళం.. కుదురైన కథనం లేకపోవడం.. కంటిన్యుటీ లేని సన్నివేశాల వల్ల 'తంగలాన్' ప్రేక్షకులను సంతృప్తిపరచలేకపోయింది.

'బాహుబలి' తర్వాత వెండితెరపై ఎన్నో భారీ ప్రయత్నాలు జరిగాయి. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రేక్షకులను విహరింపజేయడం ద్వారా బాక్సాఫీస్ సక్సెస్ అందుకోవాలని చాలామంది ప్రయత్నించారు. కానీ రాజమౌళిలో క్రిస్టల్ క్లియర్ గా ఈ కథలను చెప్పలేకపోవడమే ఆయన్ని మిగతా వారి ముందు భిన్నంగా నిలబెడుతోంది. 'ఆర్ఆర్ఆర్' లాంటి అతకని.. కృత్రిమమైన కథను కూడా ప్రేక్షకులతో ఒప్పించేంత క్లారిటీ.. కథన నైపుణ్యం రాజమౌళికి ఉంది. కానీ కథను అర్థమయ్యేలా చెబితే.. స్ట్రెయిట్ గా నరేట్ చేస్తే తమ స్థాయి తగ్గిపోతుందని అనుకుంటారో ఏమో కానీ.. ఎంతో బుర్రపెట్టి ఆలోచిస్తే తప్ప అర్థం కాని విధంగా తయారు చేసి పెడుతుంటారు కొందరు దర్శకులు. పా.రంజిత్ కూడా అలాగే చేశాడు 'తంగలాన్'లో. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి పంచాలని భిన్నమైన కథను ఎంచుకుని.. విక్రమ్ లాంటి మేటి నటుడిని ఎంచుకుని తన కోసం ఒక గొప్ప పాత్రను రాసి.. తన నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోగలిగాడు కానీ.. ఆసక్తికరంగా.. అర్థమయ్యేలా ఈ కథను చెప్పడంలో మాత్రం అతను విఫలమయ్యాడు. విజువల్స్.. నటీనటుల అభినయం.. సాంకేతిక నిపుణుల పనితనం వల్ల మనమేదో అద్భుతం చూస్తున్నాం అనే భావన కలుగుతుంటుంది కానీ.. ఈ కథను ఆకళింపు చేసుకోలేని గందరగోళం వల్ల 'తంగలాన్'ను పూర్తి ఆస్వాదించలేని పరిస్థితి తలెత్తుతుంది.

పరిచయ సన్నివేశంతో మొదలు.. విక్రమ్ తెర మీద కనిపిస్తుంటే అలా నోరెళ్లబెట్టి చూస్తుంటాం. తన ఆహార్యం.. అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఎన్నో గొప్ప.. వైవిధ్యమైన పాత్రలు చేశాడు కానీ.. 'తంగలాన్' క్యారెక్టర్ వేరే లెవెల్ అని చెప్పాలి. కథను మించి తన వల్ల 'తంగలాన్' చాలా వరకు ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. విక్రమ్ అలా తెరపై కనిపిస్తుంటే నోరెళ్లబెట్టి చూస్తుంటాం. అంత గొప్పగా తన పాత్రను పోషించాడీ మేటి నటుడు. దీనికి ఆసక్తికర కథనం తోడై ఉంటే 'తంగలాన్' స్థాయే వేరుగా ఉండేది. ఒక సన్నివేశం బాగుందే అనుకునేలోపే.. దానికొక ముగింపు ఇవ్వకుండా.. దాన్ని అర్ధంతరంగా ముగించేయడం.. కంటిన్యుటీ లేకపోవడం.. సంబంధం లేని సంభాషణలతో ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు దర్శకుడు. ఏ పాత్ర ఏంటో అర్థం కాని అయోమయం ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది. మాళవిక మోహనన్ పాత్రతో ఏదో అద్భుతం చేస్తున్నట్లు దర్శకుడు భావించి ఉండొచ్చు కానీ.. అది అత్యంత గందరగోళంగా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. చివర్లో ఆ పాత్ర బ్యాక్ స్టోరీ ఏదో చూపించి క్లారిటీ ఇవ్వాలని చూసినా అది కూడా గందరగోళంగానే అనిపిస్తుంది. విజువల్ గా చాలా సన్నివేశాలు బాగున్నా.. సినిమా కొత్త అనుభూతిని పంచినా.. గజిబిజిగా సాగే నరేషన్ 'తంగలాన్'కు ప్రతికూలంగా మారింది. మొదట్నుంచి ఈ గందరగోళం ఉన్నప్పటికీ.. ప్రథమార్ధం ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం కన్ఫ్యూజన్ బాగా పెరిగిపోయి ఇబ్బంది అంతకంతకూ పెరుగుతుంది. ఐతే ప్రతికూలతలు ఉన్నా సరే.. విక్రమ్ నటన.. కథలోని వైవిధ్యం.. కొన్ని ఎపిసోడ్లు.. విజువల్స్ కోసం 'తంగలాన్'ను ఒకసారి చూడొచ్చు.

నటీనటులు:

విక్రమ్ గురించి ఏం చెప్పాలి? ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా.. అతను ప్రయోగాలు మానట్లేదు. పాత్రల కోసం ప్రాణం పెట్టడం ఆపట్లేదు. తంగలాన్ పాత్రలో విక్రమ్ ను చూస్తే ఇలా ఇంకెవ్వరూ చేయలేరనిపిస్తుంది. పాత్ర పరిచయ సన్నివేశంతోనే అక్కడున్నది విక్రమ్ అని మరిచిపోతాం. ఒక కొత్త వ్యక్తిని చూస్తున్న భావన కలుగుతుంది. అదే భావనతో సినిమా అంతా చూస్తాం. తన నటన కూడా అద్భుతం. కేవలం విక్రమ్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. 'తంగలాన్'కు విక్రమ్ జాతీయ అవార్డు అందుకుంటే ఆశ్చర్యేమీ లేదు. సినిమాలో మిగతా నటీనటులందరూ కూడా గొప్పగా చేశారు. విక్రమ్ భార్యగా పార్వతి గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. ప్రతి సన్నివేశంలోనూ సహజంగా.. అద్భుతంగా నటించింది. మాళవిక మోహనన్ హారతి అనే ఆశ్చర్యకర పాత్రలో కనిపించింది. తన పాత్ర పిచ్చి పిచ్చిగా అనిపించినా.. తన నటన బాగానే సాగింది. పశుపతితో పాటు మిగతా ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. అతను ఎంతో తపనతో ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాడు. ప్రేక్షకులను మొదట్నుంచి ఒక డిఫరెంట్ మూడ్ లోకి తీసుకెళ్లేలా ఇంటెన్స్ గా సాగుతుంది అతడి బ్యాగ్రౌండ్ స్కోర్. సినిమాలో పాటలకు ప్రాధాన్యం తక్కువే కానీ.. అవి కూడా బాగానే సాగాయి. కిషోర్ కుమార్ ఛాయాగ్రహణం కూడా ఉన్నతంగా సాగింది. విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువల విషయంలో జ్ఞానవేల్ రాజా ఏమాత్రం రాజీ పడలేదు. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. పా.రంజిత్ దర్శకుడిగా తన విలక్షణతను మరోసారి చాటాడు. అతను ఎంచుకున్న కథ.. విక్రమ్ సహా నటీనటులను ప్రెజెంట్ చేసిన తీరు.. సాంకేతికంగా సినిమాను మలిచిన విధానం అన్నీ బాగున్నాయి. కానీ అతడి నరేషన్ మాత్రం ప్రేక్షకులను బాగా తికమక పెడుతుంది. ఈ విషయంపై అతను దృష్టిపెట్టి ఉంటే.. దర్శకుడి తన కష్టానికి ఇంకా మంచి ఫలితం దక్కేది.

చివరగా: తంగలాన్.. గజిబిజి కథలో విక్రమ్ విశ్వరూపం

రేటింగ్- 2.75/5