Begin typing your search above and press return to search.

ఆ సినిమాకి 111 ఏళ్లు? రిలీజ్ ఎప్పుడంటే!

అందువల్లనే ఫాల్కే భారతీయ చలన చిత్ర పితామహుడుగా పేరుపొందారు.

By:  Tupaki Desk   |   22 April 2024 11:06 AM GMT
ఆ సినిమాకి 111 ఏళ్లు?  రిలీజ్ ఎప్పుడంటే!
X

భారతీయ సినిమా చ‌రిత్ర అంటే 100 ఏళ్లు కింద‌కు వెళ్లాల్సిందే. అంత గొప్ప చరిత్ర భార‌తీయ సినిమా సొంతం. మొట్ట‌మొద‌టి భార‌తీయ చిత్రం ఏది? అంటే అంద‌రికీ గుర్తొచ్చేది `రాజాహ‌రిశ్చంద్ర‌`. దాదాసాహెబ్ ఫాల్కే దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా విడుద‌లై 2024 తో 111 ఏళ్లు పూర్తవుతుంది. మొట్ట మొద‌టి మూకీ చిత్రం కూడా ఇదే. ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన దూండీరాజ్ ఫాల్కేకి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలోచనే భారతయ సినిమాకి మూలం. అందువల్లనే ఫాల్కే భారతీయ చలన చిత్ర పితామహుడుగా పేరుపొందారు.

సినిమాపై ఆస‌క్తితో జర్మనీ వెళ్లి సినిమా టెక్నాలజీ నేర్చుకొచ్చి భార‌తీయ సినిమాకి ఓనమాలు దిద్దారు. అనుభవం లేని ఆర్టిస్టులు- ఆడ వేషానికి మగ‌ వేషానికీ రెండిటికీ మ‌గవారే. కెమెరా దృష్టిలో పెట్టుకోని నటించడం.. డైలాగులు పలకడం తెలియని రోజులవి. ఇలా అష్టకష్టాలు పడుతూ, సడలని ఆత్మవిశ్వాసంతో తొలి భారత సినిమాని సృష్టించాడు ఫాల్కే. భార‌తీయ సినిమాకి మూల‌స్థంబంగా నిలిచిన ఫాల్కే సేవ‌ల‌కు గుర్తింపుగానే ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పింది. సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే.

అయితే వాస్త‌వానికి భార‌త‌దేశ‌పు తొలి సినిమా `శ్రీ పుండలిక్`. 112 సంవత్సరాల క్రితం 1912 మే 18న విడుదలైంది.

22 నిమిషాల నిడివితో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇది నిశ్శబ్ద చలన చిత్రం. మరాఠీ భాష‌లో రూపొందించారు.

ఈ చిత్రానికి దాదాసాహెబ్ టోర్నే దర్శకత్వం వహించారు. అయితే తొలి సినిమా శ్రీ పుండ‌లిక్ - రాజాహ‌రిశ్చంద్ర అన్న దానిపై వివాదం ఉంది. `శ్రీ పుండలిక్` కి విదేశీ కెమెరా మెన్లు ప‌నిచేసారు.

దీంతో ఈ సినిమాని భార‌తీయ చిత్రంగా కొంద‌రు ప‌రిగ‌ణించలేదు. అదే వివాదం. అప్ప‌టి నుంచి భార‌తీయ తొలి చిత్రం ఏది అంటే? అంతా రాజాహ‌రిశ్చంద్ర పేరు చెబుతారు. దీనిని 1913 మే 3న విడుదల చేశారు. వివాదాలు ఏమైనప్పటికీ శ్రీ పాండులిక్ చిత్రం రాజా హరిశ్చంద్రకు ఒక సంవత్సరం ముందు భారతదేశంలో విడుదలైంది.