దేవిశ్రీ లేకపోతే సుక్కూ లేడు.. సుక్కూ లేకపోతే దేవిశ్రీ లేడు..!
దేవీ సైతం ఎప్పుడూ దర్శకుడి నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
By: Tupaki Desk | 8 Nov 2024 3:38 AM GMTటాలీవుడ్ లో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ లది సక్సెస్ ఫుల్ 'డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్' కాంబినేషన్. ఇప్పటి వరకూ సుక్కూ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకూ దేవినే సంగీతం సమకూర్చారు. ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రాలకు కూడా డీఎస్పీనే కంపోజర్ గా తీసుకున్నారు. ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది పట్టించుకోకుండా, అతన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. దేవీ సైతం ఎప్పుడూ దర్శకుడి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సినిమా రిజల్ట్ అటు ఇటు అయినా, మ్యూజిక్ విషయంలో మాత్రం ఎప్పుడూ డిజప్పాయింట్ చెయ్యలేదు.
మరోవైపు అల్లు అర్జున్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ కొడతాడనే పేరుంది. ఇప్పటిదాకా 10 చిత్రాలకు సంగీతం సమకూరిస్తే, ప్రతీది చార్ట్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది. ఇక బన్నీ - సుక్కూ - డీఎస్పీ కాంబోలో వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2', 'పుష్ప' ఆల్బమ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకు దేవిశ్రీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని ఆల్రెడీ బయటకి వచ్చిన రెండు పాటలు వింటే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు బీజీఎం విషయంలో ఈ ముగ్గురి మధ్య సింక్ కుదరట్లేదని రూమర్లు వినిపిస్తున్నాయి.
'పుష్ప 2: ది రూల్' సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చకపోవడంతో, సుకుమార్ ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో వర్క్ చేయిస్తున్నారనే ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. దేవి స్థానంలో థమన్, అజనీష్ లోక్ నాథ్, సామ్ సీఎస్ లాంటి ముగ్గురు సంగీత దర్శకులతో బీజీఎమ్ వర్క్ చేపిస్తున్నట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
'పుష్ప 2' సినిమాకు డీఎస్పీ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నచ్చకనే సుకుమార్ అండ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న టైముకి కంప్లీట్ అవ్వకపోవడం, దేవిశ్రీ ఆల్రెడీ కమిటైన 'కంగువ' లాంటి ఇతర ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చెయ్యాల్సి రావడం, 'పుష్ప 2' రిలీజ్ డేట్ దగ్గర పడటం వంటి కారణాలతోనే ఇలా చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. మేకర్స్ సైడ్ నుంచి దీనిపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఇంతలోనే అనేక కథనాలు వండి వారిస్తున్నారు. సుకుమార్ - దేవిశ్రీ మధ్య విబేధాలు వచ్చాయనే అనే రేంజ్ లో వార్తలు ప్రచారం చేస్తున్నారు.
సుకుమార్ - దేవీల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ''డీఎస్పీ.. నా ఆత్మ. దేవీ లేకపోతే నేను లేను. నేను లేకపోతే దేవి లేడు. నా ఆత్మకు రూపం సంగీతం అయితే, దాని పేరే దేవి. సినిమా చేయడానికి కథ అక్కర్లేదు.. డీఎస్పీ ఉంటే చాలు. నాకు మ్యూజిక్ అంటే దేవి, దేవి అంటే మ్యూజిక్. నా ఎమోషన్ ను, ఫీలింగ్ ను కంటిన్యూ చెయ్యాలంటే దేవీ పక్కనే ఉండాలి. ఆయన లేకపోతే నేనేమీ చేయలేను".. 'రంగస్థలం' టైంలో సుక్కూ అన్న మాటలివి.
దేవిశ్రీ ప్రసాద్ సైతం అనేక సందర్భాల్లో సుకుమార్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఏదో జరుగుతోందని, మున్ముందు వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారో లేదో అనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే సుక్కు - దేవి మధ్య సాన్నిహిత్యం గురించి తెలిసినవారు ఎవరూ ఈ రూమర్స్ ను నమ్మడం లేదు. ఒకవేళ అది నిజమే అయినా, వారిద్దరి మధ్య బాండింగ్ ఎప్పటిలాగే అలానే కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదని నమ్మే దర్శకులలో సుకుమార్ ముందు వరుసలో ఉంటారు. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవీశ్రీ ప్రసాద్ ఒకరిగా నిలుస్తారు. ఇద్దరూ అవుట్ ఫుట్ బాగుండాలని ఆలోచించే వ్యక్తులే. సో నిజంగానే 'పుష్ప: ది రూల్' బీజీఎం వేరే వాళ్ళతో చేయించాలని సుక్కు అనుకుంటే, కచ్ఛితంగా దేవీశ్రీ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. లేదా విడుదల తేదీ దగ్గర పడింది కనుక, వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి వర్క్ ను ఇతర సంగీత దర్శకులతో పంచుకొని ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పనిచేసిన సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సుక్కునో లేదా దేవిశ్రీనో నిందించడం సరికాదు.