'ది ఢిల్లీ ఫైల్స్' టీజర్: బయటి ప్రపంచానికి తెలియని బెంగాళ్ స్టోరి
ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ లాంటి ఒరిజినల్ సినిమాలతో వివేక్ అగ్నిహోత్రి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
By: Tupaki Desk | 26 Jan 2025 10:41 AM GMTది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ లాంటి ఒరిజినల్ సినిమాలతో వివేక్ అగ్నిహోత్రి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఒరిజినల్ నిజ కథలతో సినిమాలు తీయడం అతడి ప్రత్యేకత. చరిత్ర ఆధారంగా నిజ ఘటనల్ని రియలిస్టిక్ ఎప్రోచ్ తో కల్ట్ సినిమాలను తెరకెక్కిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
అతడి నుంచి ఇప్పుడు `ది ఢిల్లీ ఫైల్స్` అభిమానులను అలరించడానికి వస్తోంది. తాజాగా `ది ఢిల్లీ ఫైల్స్` టీజర్ విడుదలైంది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ క్లిప్‌లో మిథున్ చక్రవర్తి తీవ్రమైన సమస్య లో ఉన్న ఒక నడి వయస్కుడిగా కనిపించాడు. టీజర్ లో అతడు రగ్డ్ లుక్ లో కనిపించాడు. తెల్లటి గడ్డం మీసం పెరిగిన జుత్తు తో ఉన్న మిథున్ నిర్జన ప్రదేశంలోని ఒక కారిడార్‌లో భారత రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తూ వస్తున్నాడు. దురదృష్టవశాత్తూ కాలిన నాలుకతో అతడు పదాలను పలకలేకపోతున్నాడు. బాగా అలసిసొలసి తడబడుతూ కుంటుతూ గొణుగుతూ చివరకు గోడకు ఆనుకుని సొమ్మసిల్లిపడిపోయాడు.
`ది ఢిల్లీ ఫైల్స్` చిత్రంతో భారత దేశ చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని టచ్ చేయడానికి వివేక్ అగ్నిహోత్రి ప్రయత్నిస్తున్నాడు. భారత ప్రజలందరికీ అంతగా తెలియని అత్యంత బాధాకరమైన బెంగాల్ విషాదాన్ని తెరపై చూపిస్తున్నాడు. గొప్ప ఎమోషన్, ఉత్కంఠభరితమైన విజువల్స్, అద్భుత నట ప్రదర్శనలతో ఆలోచింపజేసే గొప్ప కథను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
`ది ఢిల్లీ ఫైల్స్: ది బెంగాల్ చాప్టర్`ను అభిషేక్ అగర్వాల్ - పల్లవి జోషి నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ - ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 15 ఆగస్టు 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ది ఢిల్లీ ఫైల్స్‌లో అనుపమ్ ఖేర్ మరోసారి వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేస్తున్నారని సమాచారం. అతడు కుటుంబంలో ఒక భాగం అని, అద్భుత నటుడితో పని చేయడం సంతోషంగా ఉంటుందని అగ్నిహోత్రి అన్నారు.