Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

గత కొన్నేళ్లలో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ నటుడు విజయ్. గత ఏడాది 'లియో'తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (గోట్) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 8:01 AM GMT
మూవీ రివ్యూ : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
X

'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్-స్నేహ-మీనాక్షి చౌదరి-ప్రభుదేవా-జయరాం-ప్రశాంత్-మోహన్-వైభవ్- ప్రేమ్ జీ అమరన్-అమీర్ అజ్మల్-లైలా తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం: సిద్దార్థ్ మణి

నిర్మాతలు: కల్పత్తి అఘోరం-కల్పత్తి గణేష్-కల్పత్తి సురేష్

రచన-దర్శకత్వం: వెంకట్ ప్రభు

గత కొన్నేళ్లలో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ నటుడు విజయ్. గత ఏడాది 'లియో'తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (గోట్) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గాంధీ (విజయ్) బయటి ప్రపంచానికి ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు కనిపించినా.. తెర వెనుక సీక్రెట్ ఏజెంట్. ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ టీంలో అతను సభ్యుడు. ఈ విషయం భార్యకు కూడా తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఒక మిషన్లో భాగంగా థాయిలాండ్ కు వెళ్లాల్సిన సమయంలో భార్య తనను అనుమానించడంతో టూర్ పేరు చెప్పి గర్భవతిగా ఉన్న తనతో పాటు కొడుకునూ తీసుకుని థాయిలాండ్ వెళ్తాడు గాంధీ. అక్కడ భార్యకు తెలియకుండా మిషన్లో పాల్గొంటాడు. కానీ గాంధీ వల్ల దెబ్బ తిన్న టెర్రరిస్ట్ గ్యాంగ్ తన ఫ్యామిలీ మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలో పిల్లాడైన గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు. అదే సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య.. గాంధీని అసహ్యించుకుని దూరమవుతుంది. అలాగే ఏళ్లు గడిచిపోతాయి. సీక్రెట్ ఏజెంట్ గా తన వృత్తిని కొనసాగిస్తున్న గాంధీ.. ఒక మిషన్లో భాగంగా యూరప్ వెళ్తే అక్కడ తన పోలికలతో ఉన్న కుర్రాడు ఎదురవుతాడు. అతనే తన కొడుకు జీవన్ అని తెలుసుకుని ఇంటికి తీసుకొస్తాడు గాంధీ. కానీ ఇక్కడి నుంచే అసలు సమస్యలు మొదలవుతాయి. ఇంతకీ ఇన్నేళ్లు జీవన్ ఎక్కడున్నాడు.. ఏం చేశాడు.. తన వల్ల గాంధీకి వచ్చిన వచ్చిన ఇబ్బందులేంటి.. వాటిని గాంధీ ఎలా అధిగమించాడు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఒక చెన్నై-28.. ఒక సరోజ.. ఒక గోవా.. ఇలా ఒకప్పుడు తమిళంలో థ్రిల్లర్ కథలను ఎంతో ఎంటర్టైనింగ్ గా తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న దర్శకుడు వెంకట్ ప్రభు. కానీ ఎలాంటి దర్శకుడైనా ఏదో ఒక దశలో లయ కోల్పోయి ప్రేక్షకులను నిరాశపరచడం మామూలే. నాగచైతన్యతో తీసిన 'కస్టడీ' చూస్తేనే వెంకట్ ప్రభు ప్రభ కోల్పోయాడని అర్థమైంది. ఐతే ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ తో సినిమా చేస్తున్నాడంటే వెంకట్ మళ్లీ పునరుజ్జీవం పొందుతాడని.. ఒకప్పట్లా మెరుపులు మెరిపిస్తాడని ఆశిస్తే.. ఒకసారి కోల్పోయిన టచ్ అంత సులువగా మళ్లీ తిరిగి రాదని చాటి చెప్పాడు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (గోట్)తో. కేవలం పేరు 'గ్రేటెస్ట్' అని పెట్టుకున్నంత మాత్రాన గొప్ప సినిమాలు వచ్చేయవని రుజువు చేస్తుందీ చిత్రం. హాలీవుడ్ మూవీ 'జెమిని మ్యాన్' నుంచి లేపేసిన ఐడియాకు కమర్షియల్ మసాలాలు అద్ది ప్రేక్షకులను అలరించాలని వెంకట్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. హాలీవుడ్ మూవీలో ఉన్న థ్రిల్లూ లేక.. వెంకట్ అద్దిన కమర్షియల్ మసాలాలూ సరిగా పట్టక.. 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఎటూ కాని సినిమాగా తయారైంది. కొన్నేళ్లుగా తన సినిమాలకు తమిళంలోనే కాక తెలుగులోనూ క్రేజ్ తీసుకురాగలుగుతున్న విజయ్.. కంటెంట్ విషయంలో మాత్రం మరోసారి నిరాశపరిచాడు.

'గోట్'లో హీరో ఒక పేరున్న సీక్రెట్ ఏజెంట్. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పెద్ద మిషన్లు అలవోకగా పూర్తి చేసి వస్తుంటాడు. అలాంటి హీరో.. తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసి చంపేసినట్లు ప్రొజెక్ట్ చేస్తే.. కనీసం చనిపోయింది తన కొడుకునే కాదా అని సరిగ్గా రూఢి చేసుకోడు. కాలిపోయిన ఒక పిల్లాడి శవం.. తన కొడుకు బ్యాగ్.. తనాడుకునే ఓ బొమ్మ అక్కడ కనిపించాయని చనిపోయింది తన కొడుకే అని ఫిక్సయిపోతాడు. తనతో పాటు ఉన్న అధికారులు కూడా అంతే. ఇదే హీరో చాలా ఏళ్ల తర్వాత ఆ కొడుకు బతికొచ్చి తనకు కనిపిస్తే ఇంటికి తీసుకొస్తాడే తప్ప.. అసలు తను అన్నేళ్లు ఏం చేశాడు.. తన నేపథ్యమేంటి.. ఇప్పుడెలా తన కళ్ల ముందుకు వచ్చాడు.. ఇంతకుముందు తన కొడుకు చనిపోయాడనే భ్రమ కల్పించిందెవరు.. దాని వెనుక కుట్ర ఏంటి అని ఆలోచించడు? హీరోను 'గోట్' సీక్రెట్ ఏజెంట్ గా చూపిస్తూ బేసిక్ స్టోరీని.. ప్రధాన పాత్రను ఇంత ఇల్లాజికల్ గా.. పేలవంగా తీర్చిదిద్దుకున్నాక సినిమాలో బ్రిలియన్స్ ఉంటుందని ఎలా ఆశిస్తాం? ఇలా ఆరంభంలోనే సిల్లీ సీన్లతో 'గోట్' నీరుగారిపోయాక ఏ దశలోనూ పైకి లేవదు. ఓల్డ్ హీరో గ్యాంగులో కీలకమైన వ్యక్తి చనిపోయిన వెంటనే యంగ్ హీరో డ్యూయెట్ వేసుకోవడం.. అదే యంగ్ హీరోను ప్రేమించిన అమ్మాయి తన చేతుల్లోనే హత్యకు గురయ్యాక అతను ఐటెం సాంగ్ లోకి వెళ్లడం లాంటివి చూస్తే.. ప్రేక్షకుల ఎమోషన్ తో దర్శకుడికి పని లేదా.. లేక ఆయా సీన్లతో ప్రేక్షకుల్లో ఎలాగూ ఎమోషన్ తీసుకురాలేకపోయామని ఫిక్సయే ఇలాంటివి ప్లేస్ చేశారా అనే అనుమానం కలుగుతుంది. అసలు చిన్నపుడే తల్లిదండ్రులకు దూరమై విలన్ చేతిలో పడ్డ హీరో.. తన కన్నతండ్రి మీద పగబట్టడం.. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తిగా మారడం వెనుక బలమైన కారణమే కనిపించదు. అది అన్ కన్విన్సింగ్ గా అనిపించడం వల్ల తండ్రీ కొడుకుల పోరు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు.

హీరో పైకి ఏదో ఒక మామూలు ఉద్యోగం చేస్తున్నట్లు నటిస్తూ.. తెర వెనుక సీక్రెట్ ఏజెంట్ గా పని చేసే పాత్రలు కథలు భారతీయ భాషల్లో అనేకం చూశాం. మళ్లీ అదే సెటప్ తో సినిమాను నడిపించాడు వెంకట్ ప్రభు ఇందులో. హీరో చేపట్టే ఓ మిషన్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఘట్టాలతో సినిమా ఆరంభం బాగానే అనిపిస్తుంది. కానీ యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వైపు కథ మళ్లాక నీరసం మొదలవుతుంది. చాలా బోరింగ్ గా సాగే ఫ్యామిలీ సీన్లలో ఇటు కామెడీ పండలేదు. అటు ఎమోషనూ వర్కవుట్ కాలేదు. హీరో కొడుకు చనిపోవడంతో కథ మలుపు తిరిగే దగ్గర సినిమా కాస్త ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది. కానీ ఆ చనిపోయిన కొడుకు తిరిగొచ్చే సీన్లు చాలా పేలవంగా తయారవడంతో మళ్లీ ఆసక్తి చచ్చిపోతుంది. ఐతే ఆ కొడుకు మామూలోడు కాదు.. తిరిగి రావడంలో తన ఉద్దేశాలు వేరు అని తెలిసే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. ఇద్దరు హీరోల మధ్య పోరాటం ఎలా ఉంటుందనే ఆసక్తితో ద్వితీయార్ధాన్ని చూస్తాం. కానీ ఉత్కంఠగా సాగుతుందనుకున్న సెకండాఫ్ మెరుపుల్లేకుండా మామూలుగా నడిచిపోతుంది. తండ్రీ కొడుకుల పోరును రసవత్తరంగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. విజయ్ ని కుర్రాడిగా చూపించడానికి చేసిన ప్రయత్నం ఏమంత ఆకట్టుకోకపోవడం.. ఆ పాత్ర చిత్రణ కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ద్వితీయార్ధం కూడా అంతంతమాత్రంగానే సాగుతుంది. మీనాక్షి చౌదరి పాత్రను ముగించిన తీరు.. ప్రభుదేవా పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ పేలవంగా తయారై 'గోట్' మీద పూర్తిగా ఆశలు కోల్పోయేలా చేస్తాయి. పైన చెప్పుకున్నట్లే ఎమోషనల్ ఎపిసోడ్ల తర్వాత అసందర్భోచితంగా వచ్చి పడే పాటలు.. బోరింగ్ సీన్లు 'గోట్'ను నీరుగార్చేశాయి. సీఎస్కే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంలో సాగే క్లైమాక్స్ కొంత పర్వాలేదనిపిస్తుంది కానీ.. అది కూడా సుదీర్ఘంగా సాగడం ప్రతికూలమే. మొత్తంగా త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగబోతున్న విజయ్ నుంచి ఈ దశలో రావాల్సిన సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఎంతమాత్రం కాదు. ఇందులో విజయ్ మార్కు మాస్ అంశాలూ లేవు. అలాగే వెంకట్ ప్రభు శైలి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంటూ మిస్ అయింది.

నటీనటులు:

విజయ్ ఎప్పట్లాగే స్టైల్ గా కనిపించాడు. నటన కూడా అలాగే సాగింది. పెర్ఫామెన్స్ సూపర్ అనిపించే సన్నివేశాలేమీ సినిమాలో లేవు. ఎమోషనల్ సీన్లలో విజయ్ బాగానే చేశాడు. ద్విపాత్రాభినయంలో కొంత వైవిధ్యం చూపించగలిగాడు. యంగ్ విజయ్ పాత్ర కోసం డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి ఏదో ట్రై చేశారు కానీ.. తెర మీద అదంత ఎఫెక్టివ్ గా ఏమీ కనిపించలేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ ఓకే అనిపించాడు. యంగ్ విజయ్ పాత్ర ప్రవేశం తర్వాత వయసు మళ్లిన పాత్రలోనే విజయ్ బాగున్నాడు అనిపిస్తాడు. పెద్ద విజయ్ భార్య పాత్రలో స్నేహ బాగా కుదిరింది. తన నటన ఓకే. మీనాక్షి చౌదరి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఈ సినిమాలో ఆమె ఉంది అంటే ఉంది అనుకోవాలి. తనతో పోలిస్తే విజయ్ కూతురి పాత్రలో చేసిన అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బెటర్. ఒక పాట కోసమే మీనాక్షిని పెట్టుకున్నట్లున్నారు. అది కూడా సరిగా రాలేదు. ప్రభుదేవా కాస్త భిన్నమైన పాత్ర చేశాడు కానీ.. అది తేలిపోయింది. ప్రశాంత్.. జయరాం.. అమీర్ అజ్మల్.. వైభవ్.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో ఓకే అనిపించారు. విలన్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాడు. తన లుక్.. నటన ఏవీ ఆకట్టుకోవు.

సాంకేతిక వర్గం:

విజయ్ గత కొన్నేళ్లలో నటించిన మాస్టర్.. బీస్ట్.. లియో సినిమాలు సరిగా ఆడకపోయినా.. వాటిలో పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఊపే వేరు. ఈ చిత్రాల్లో అనిరుధ్ తన సంగీతంతో ఒక ఊపు ఊపేశాడు ప్రేక్షకులను. విజయ్ సినిమాల్లో తన పాటలు.. నేపథ్య సంగీతానికి అలవాటు పడ్డ ప్రేక్షకులను 'గోట్'లో యువన్ శంకర్ రాజా నీరసించిపోయేలా చేశాడు. యువన్ ఒకప్పటి సినిమాల స్థాయికి 'గోట్' ఏమాత్రం సరితూగదు. పాటల్లో ఒక్కటీ వినసొంపుగా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఉత్సాహాన్నిచ్చేలా సాగలేదు. సన్నివేశాల్లోనే బలం లేకపోగా.. బీజీఎం కూడా అంతంతమాత్రం కావడంతో సినిమా మొత్తంలో ఎక్కడా హై అనేదే కనిపించదు. సిద్దార్థ్ మణి ఛాయాగ్రహణం ఓకే. విజువల్ గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుకు విజయ్ లాంటి టాప్ స్టార్ దొరికినపుడు అందుకు తగ్గ కథాకథనాలు సిద్ధం చేసుకోవడంలో విఫలమయ్యాడు. అజిత్ తో 'మన్కాతా' తీసింది ఈ డైరెక్టరేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. రేసీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేలకు పెట్టింది పేరైన వెంకట్.. ఇప్పుడు టచ్ కోల్పోయాడని 'కస్టడీ'లోనే రుజువైంది. ఇప్పుడు 'గోట్'తో మరోసారి ఆ విషయం స్పష్టమైంది. 'జెమిని మ్యాన్' నుంచి తీసుకున్న ఐడియాను మన కమర్షియల్ సినిమాల స్టయిల్లో విజయ్ కి ఎడాప్ట్ చేయాలని అతను చేసిన ప్రయత్నం ఫలించలేదు. క్లైమాక్సుని సీఎస్కే క్రికెట్ మ్యాచ్ తో కనెక్ట్ చేయడంలో తప్పితే వెంకట్ ప్రభు ముద్ర ఎక్కడా కనిపించదు.

చివరగా: గోట్.. గ్రేట్ కాదు బ్యాడ్

రేటింగ్- 2.25/5