మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పై వెబ్ సిరీస్
ఇప్పుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసత్వంపై వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
By: Tupaki Desk | 16 Jan 2025 8:30 AM GMTచరిత్ర ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. పలువురు యోధుల కథల్ని మన దర్శకనిర్మాతలు సృజించారు. అద్భుతమైన కళాఖండాల్ని అందించారు. కొన్ని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాగా, మరికొన్ని ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఇప్పుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసత్వంపై వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
`ముంజ్య` భారీ విజయం తర్వాత దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఈ సిరీస్ ని ప్రారంభించాడు. ఛత్రపతి కథను ట్రావెల్ చేస్తూనే, ట్రెజర్ హంట్ ఆధారిత సిరీస్ `ది సీక్రెట్ ఆఫ్ ది షిలేదార్స్`ను అతడు తెరపైకి తెస్తున్నాడు. రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమంహర్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ షో ఆద్యంతం శౌర్యం, విధేయత, కర్తవ్యం నేపథ్యంలో అలుపెరుగని నిబద్ధత కథను ఆవిష్కరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
`ది సీక్రెట్ ఆఫ్ ది షిలేదార్స్` నిర్మాతలు, నటుడు రాజీవ్ ఖండేల్వాల్ ఇటీవల మొదటి గ్లింప్‌ను ఇన్‌స్టాలో విడుదల చేశారు. గ్లింప్‌ను షేర్ చేస్తూ డిస్నీ+ హాట్‌స్టార్ లో ఈ సిరీస్ 31 జనవరి 2025న విడుదలవుతుందని తెలిపారు. ఈ షో అన్ని ఎపిసోడ్‌లు ఒకే రోజున ప్రసారం అవుతాయి. వెబ్ సిరీస్‌లో భిన్నమైన పాత్రను పోషించడంపై తనకు సందేహాలున్నాయని, అయితే దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ ప్రతిదీ సులభం చేసారని ప్రధాన నటుడు రాజీవ్ ఖండేల్వాల్ ప్రశంసించారు. ఆదిత్య స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను మంత్రముగ్ధుడినయ్యానని అన్నారు. మరాఠాలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని తెరపరిచే వెబ్ సిరీస్ లో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని నటుడు సాయి తమహంకర్ ఉత్సాహం వ్యక్తం చేశారు.