కళ్లు మూసుకోకుండా ఈ సినిమా చూడగలరా?
ఇప్పుడు అలాంటి స్ఫూర్తి నింపే ఓ సినిమా ఓటీటీలోకి వస్తోంది. వృద్ధాప్యం నుంచి టీనేజీకి షిఫ్టయ్యే ఒక మహిళ కథతో రూపొందించిన `ది సబ్‌స్టాన్స్` OTTలో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
By: Tupaki Desk | 31 Oct 2024 1:30 PM GMTఏదైనా ఊహాతీతమైన కంటెంట్ ని తెరకెక్కించడం దానిని బ్లాక్ బస్టర్ చేయడంలో హాలీవుడ్ పనిమంతుల (క్రియేటివ్ రైటర్లు డైరెక్టర్లు) గురించి ఎంత చెప్పినా తక్కువ. రొటీనిటీకి మించి ఆలోచించడం, ప్రయోగాలు చేయడంలో తొలి నుంచి అక్కడ పంథానే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలో సినిమాలు తీసినా హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందకుండా ఎవరూ ఉండరు. దానికి కారణం అక్కడ ఉన్న ప్రయోగాత్మకత. అప్పటికే హాలీవుడ్ లో వచ్చిన ప్రయోగాలు చూసి భారతదేశంలో చాలామంది దిగ్గజ దర్శకరచయితలు సినిమాలు తీస్తున్నారన్నది కాదనలేని నిజం.
ఇప్పుడు అలాంటి స్ఫూర్తి నింపే ఓ సినిమా ఓటీటీలోకి వస్తోంది. వృద్ధాప్యం నుంచి టీనేజీకి షిఫ్టయ్యే ఒక మహిళ కథతో రూపొందించిన `ది సబ్‌స్టాన్స్` OTTలో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించింది. ఈ సినిమా కథ, కథనం, నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఇది అక్టోబర్ 31న MUBI ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి థియేట్రికల్ గా మంచి స్పందన రావడంతో డిజిటల్ రిలీజ్ పైనా అంచనాలున్నాయి. ఈ సినిమాని ఎలాగైనా ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఉన్న అభిమానుల శాతం పెరుగుతోంది. ఈ క్రేజీ బాడీ షేప్ హారర్ చిత్రంలో డెమీ మూర్ ప్రధాన పాత్రను పోషించగా, మార్గరెట్ క్వాలీ , డెన్నిస్ క్వాయిడ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.
అయితే ఇలాంటి సినిమాలు చూడాలంటే ఆడియెన్ ముందస్తుగా సన్నద్ధతతో ఉండాలి. ఇది ప్రయోగాత్మక చిత్రం
ది సబ్‌స్టాన్స్ అనే ఫార్ములా ద్వారా తన యవ్వనాన్ని, కీర్తిని తిరిగి పొందడానికి ప్రయత్నించే ఎలిజబెత్ అనే హాలీవుడ్ నటి కథతో రూపొందింది. ఒక వృద్ధ కథానాయిక `స్యూ` అనే పేరుగల క్లోన్ గా మారాక ఏం జరిగిందన్నది తెరపై ఆద్యంతం రక్తి కట్టించేలా తెరకెక్కించారని ట్రైలర్ చెబుతోంది. ఎలిజబెత్ తన భాగస్వామ్య జీవితంపై నియంత్రణను కలిగి ఉండటానికి ప్రతి ఏడు రోజులకు ఒకసారి `స్యూ`తో ప్రత్యామ్నాయంగా ఉండాలి కాబట్టి అది మరింతగా సమస్యలను సృష్టిస్తుంది. ఇందులో తీవ్రమైన హింస, పెచ్చుమీరిన సన్నివేశాలు ఉంటాయి గనుక పిల్లలు చూడకూడదు. గతంలో `ది ఎగ్జార్సిస్ట్`లో హారర్ సీన్లు చూడలేక జనం థియేటర్ల నుంచి బయటకు వెళ్లారు. ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల `టెర్రిఫైయర్ 3` థియేటర్ల నుంచి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కథనాలొచ్చాయి. నెక్ట్స్ అలాంటి పరిస్థితి `ది సబ్ స్టాన్స్` విషయంలో ఉంటుందా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా కళ్లు మూసుకోకుండా సినిమా చూడాలంటే కచ్ఛితంగా ఆడియెన్ కి గట్స్ ఉండాలని ఇప్పటికే టాక్ ఉంది.