Begin typing your search above and press return to search.

శక్తి డిజాస్టర్.. తెర వెనుక కథ

2011 ఏప్రిల్ 1.. ఈ డేట్ తలుచుకుంటే చాలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక రకమైన నిర్వేదం కలుగుతుంది.

By:  Tupaki Desk   |   3 April 2025 12:30 PM
The Untold Story Behind Shakti Movie
X

2011 ఏప్రిల్ 1.. ఈ డేట్ తలుచుకుంటే చాలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక రకమైన నిర్వేదం కలుగుతుంది. తెలుగులో ఇండస్ట్రీ హిట్ అవుతుందన్న అంచనాలు రేపిన ఈ చిత్రం.. టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. 14 ఏళ్ల కిందటే ఈ సినిమా బడ్జెట్ రూ.50 కోట్లు దాటిపోవడం విశేషం. మెహర్ రమేష్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మెగా బడ్జెట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. కాల క్రమంలో ఈ సినిమా సీన్లు ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయాయి. అశ్వినీదత్ కొన్నేళ్లు నిర్మాణం ఆపేయాల్సిన పరిస్థితి కల్పించిన చిత్రమిది. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కెరీర్‌కు కూడా ఇది చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఐతే ఆ సమయానికి ఎన్టీఆర్‌తో తాను చేయాలనుకున్న కథ వేరని.. తర్వాత కథ మారడంతో తేడా కొట్టిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ చెప్పడం తెలిసిన సంగతే.

అసలీ కథను ఎందుకు మార్చాల్సి వచ్చింది.. స్క్రిప్టు తయారీలో ఏం జరిగింది అన్నది ఈ చిత్ర రచయితల్లో ఒకరైన తోట ప్రసాద్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘శక్తి’ సినిమా ఫెయిల్యూర్ విషయంలో తాను చేయని తప్పులకు కూడా మెహర్ రమేష్ బాధ్యత వహించాల్సి వచ్చిందని.. విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారని.. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని తాను చాలా సార్లు అనుకున్నానని.. తను మెహర్ రమేషే వారించాడని తోట ప్రసాద్ తెలిపారు. నిజానికి ‘బిల్లా’ తర్వాత ఎన్టీఆర్‌తో ఒక స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీ చేయడానికి మెహర్ రెడీ అయ్యాడని.. ఆ ఐడియానే ఫారిన్లో తారక్‌కు చెప్పగా అతను ఎగ్జైట్ అయ్యాడని.. తర్వాత అశ్వినీదత్‌కు కూడా కథ నచ్చి సినిమా అనౌన్స్ చేశారని ప్రసాద్ వెల్లడించారు.

ఐతే అప్పుడే ‘మగధీర’ రిలీజ్ కావడంతో దాన్ని మించిన సినిమా చేయాలని భావించిన దత్.. ఇందులో ఫాంటసీ అంశాలు జోడించి పెద్ద స్పాన్‌లో సినిమా చేద్దామని చెప్పారని.. ఆ క్రమంలోనే యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్, భారవి, కన్నన్ లాంటి పేరున్న రైటర్లు ఈ ప్రాజెక్టులోకి వచ్చానని.. వారికి తాను కూడా తోడయ్యానని ప్రసాద్ తెలిపారు. ఐతే ముందు అనుకున్న కథలోకి ఫాంటసీ అంశాలు జోడించగా.. అవి రెండూ సింక్ కాలేదని.. ఈ కథలో లోపం ఉందని తనకు అనిపించి చిత్ర బృందానికి ఆ విషయం చెప్పానని.. కానీ దానికి పరిష్కారం కనుక్కోవడానికి పెద్దగా టైం లేకపోయిందని ఆయన చెప్పారు. సినిమా ఫెయిల్యూర్ అయ్యాక అందరూ మెహర్‌నే నిందించారని.. చేయని తప్పులకు కూడా అతను విమర్శలు ఎదుర్కొన్నాడని... ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో క్లారిటీ ఇవ్వాలని తాను భావించినప్పటికీ.. నిర్మాత కోరింది మనం ఇవ్వలేదు కాబట్టి బాధ్యత మనదే అని చెప్పి తనను చాలాసార్లు మెహర్ వారించాడని ప్రసాద్ చెప్పారు.