అమెరికా రాయబారి నోట టాలీవుడ్ మాట!
ఇంటర్వ్యూయర్ "LAకి హాలీవుడ్ ఉంది. ఇండియాలో బాలీవుడ్ ఉంది` అని అన్నాడు
By: Tupaki Desk | 21 Oct 2023 9:10 AM GMTవిదేశాల్లో సైతం దేశం మీసం తిప్పిన దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి'...'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని వీదేశాలకు తీసుకెళ్లిన దర్శకుడు. ముఖ్యంగా 'ఆర్ ఆర్ ఆర్' గ్లోబల్ స్థాయిలో ఎంతటి సంచలనమైందో తెలిసిందే. తెల్ల దొరల అరాచకపాలనపైనే సినిమా చేసి వాళ్లతోనే చప్పట్లు కొట్టించిన గ్రేట్ మేకింగ్ దిగ్గజం జక్కన్న. 'నాటు నాటు' పాటకి ఆస్కార్ సైతం వరించడంతో ప్రపంచ దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ మరింత ఖ్యాతిని సంపాదించింది.
ఎన్టీఆర్..చరణ్ లకు హాలీవుడ్ లోనే అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీనంతటికీ కారణం జక్కన్న ఒక్కడే. ఆయన అద్భుత సృష్టి వల్లే ఇదంతా సాధ్యమైంది. తాజాగా రాజమౌళి ఎఫెక్ట్‌ను హైలైట్ చేస్తూ యూఎస్ అంబాసిడర్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో మే 11.. 2023 నుండి భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ రాయబారిగా ఉన్న ఒక అమెరికన్ రాజకీయవేత్త మరియు దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి ఓ ఇంటర్వ్యూయర్‌కు ఊహించని సమాధానం ఇచ్చారు.
ఇంటర్వ్యూయర్ "LAకి హాలీవుడ్ ఉంది. ఇండియాలో బాలీవుడ్ ఉంది` అని అన్నాడు. వెంటనే ఎరిక్ `టాలీవుడ్` ని గుర్తు చేసారు. హాలీవుడ్..బాలీవుడ్..టాలీవుడ్ అని బధులిచ్చారు. నేరుగా ఓ అమెరికన్ నోటనే టాలీవుడ్ మాట రావడంతో ఇంటర్వ్యూ యర్ కి సౌండ్ లేదు. ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ అమెరికా రాయబారి తెలుగు సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
దీనిపై నెట్టింట కామెంట్లు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇదంతా రాజమౌళి ప్రతిభతోనే సాధ్యమైంది? అంతకు ముందు ఏ రాయబారి అయినా తెలుగు సినిమా గురించి మాట్లాడారా? ఇలాంటి స్పందన రావడం గొప్ప విషయం అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇండియాలో సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కొంత మంది కళ్లకి కనిపిస్తుంది. ఆ పొరలు కమ్మిన కళ్లకు నేరుగా ఆమెరికా రాయబారే పొరలు తొలగిలే సమాధానం ఇచ్చారు.