ఎన్నికలు ఎండలతో థియేటర్లు ఖాళీ
దానికి తోడు సాయంత్రాలు ఐపీఎల్ వినోదం పుష్కలంగా ఉండటంతో యూత్ థియేటర్ల వైపు చూడటం లేదు.
By: Tupaki Desk | 29 April 2024 5:48 PM GMTఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 11 గం.లకే రోడ్లపై భగభగలకు జనం ఝడుస్తున్నారు. నెత్తి కాల్తుంటే బయటికి వెళ్లాలంటేనే దడ పుడుతోంది. కారణం ఏదైనా కానీ, ఈ మండు వేసవిలో జనం వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లాలంటే చాలా ఆలోచిస్తున్నట్టే కనిపిస్తోంది. దానికి తోడు సాయంత్రాలు ఐపీఎల్ వినోదం పుష్కలంగా ఉండటంతో యూత్ థియేటర్ల వైపు చూడటం లేదు. ఇదంతా అటుంచితే ఇప్పుడు ఎన్నికల ఫీవర్ కూడా జనాల దృష్టిని వినోదం నుంచి కొంత దూరంగా మరల్చిందని చెప్పొచ్చు.
ఎవరికి వారు రాజకీయాల గురించో లేక ఐపీఎల్ లో ఆటగాళ్ల పనితనం గురించో మాట్లాడుకుంటున్నారు తప్ప ఫలానా సినిమా వచ్చింది థియేటర్లకు వెళ్లాలి అన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. ముఖ్యంగా మల్టిపుల్ రీజన్స్ తో టాలీవుడ్ కి గడ్డు కాలం కొనసాగుతోందని చెప్పాలి. ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు డ్రై డేస్. ఈ నెలరోజులు వారు ఆదాయాన్ని ఆశించకుండా థియేటర్లను రన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో ఎలక్షన్ సీజన్ నిజంగానే తంటాలు తెచ్చి పెట్టింది. ప్రతి ఏడాది సమ్మర్ లో ఉండే హంగామా ఇప్పుడు థియేటర్ల వద్ద లేదు.
అయితే రకరకాల విశ్లేషణలతో రిలీజ్ తేదీల విషయంలో కూడా నిర్మాతలు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐపీఎల్ - ఎలక్షన్ లతో పెద్ద సమస్య ఉందని ముందే గ్రహించిన చాలా మంది నిర్మాతలు తమ ప్రొడక్ట్ ని మార్కెట్లోకి వదలకుండా దాచుకున్నారు. అందువల్ల ఈ సీజన్ లో సరైన సినిమా ఏదీ థియేటర్లలో కనిపించడం లేదు. ముఖ్యంగా ఎన్నికల హడావుడి వల్ల ఏపీలో చాలా వరకూ థియేటర్లను మూసివేసారని సమాచారం అందుతోంది. సరిగా జనం లేకపోతే కరెంట్ బిల్లులు కూడా రావు. అందువల్ల థియేటర్లు మూత వేసారట. అయితే ఐపీఎల్ సీజన్ ముగిసిపోయి, ఎన్నికల ఫీవర్ కూడా ముగిస్తే ఆ తర్వాత సినిమాలకు మంచి కాలం మొదలైనట్టు. అప్పటివరకూ అందరూ వేచి చూస్తున్నారు. కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు వస్తే థియేటర్లకు వెళ్లొచ్చని ప్రజలు కూడా వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు. కారణం ఏదైనా కానీ ప్రస్తుతం థియేటర్లు వెలవెలబోతున్నాయి.