కల్కి.. తెలుగుకి తెగులు పట్టిస్తున్నారా?
కల్కి అనేది పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఇతర భాషల ప్రముఖ నటీనటులను భాగం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
By: Tupaki Desk | 29 Jun 2024 3:35 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ మూవీ, హలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి స్టార్ కాస్టింగ్ నటించారు. అయితే వీరంతా తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
కల్కి అనేది పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఇతర భాషల ప్రముఖ నటీనటులను భాగం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే మెయిన్ రోల్స్ లో కనిపించిన వారందరితో మన మాతృభాషలోనే డబ్బింగ్ చెప్పించారు. అమితాబ్ బచ్చన్ నుండి శాశ్వత ఛటర్జీ వరకూ.. అందరూ తెలుగు నేర్చుకుని తమ పాత్రలకు ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారు. అతిథి పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి యాక్టర్స్ కూడా తెలుగులో సొంతంగా సంభాషణలు పలికారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఈ చిత్రంలో కీలకమైన అశ్వత్థామ పాత్రలో నటించారు. 'మనం' 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన నటించిన మూడో సినిమా ఇది. ఇందులో తన పాత్ర కోసం తెలుగు డైలాగులు పలకడం నేర్చుకొని, సొంతంగా డబ్బింగ్ చెప్పినందుకు ఆయన్ను మెచ్చుకోవాలి. తెలుగులో బిగ్ బీ బేస్ వాయిస్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కు ఇది తొలి తెలుగు చిత్రం. దీంట్లో గర్భవతి అయిన ల్యాబ్ సబ్జెక్ట్ SUM-80 పాత్రలో నటించింది. దీని కోసం ఆమె తెలుగు పలకడం నేర్చుకొని, డైలాగులు చెప్పింది.
విశ్వనటుడు నటుడు కమల్ హాసన్ కు తెలుగులో నటించడం కొత్త కాదు. కాకపోతే గతంలో ఆయనకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించేవారు. కానీ కొంతకాలంగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' కోసం మరోసారి గొంతు సవరించుకున్నారు. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ డైలాగులు చెప్పారు. తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకున్న కమల్ కు అది అంత కష్టమేమీ కాదు కానీ, పెద్ద పెద్ద డైలాగులను అన్ని భాషల్లోనూ పలకడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన కాంప్లెక్స్ ను శాసించే సుప్రీమ్ యాస్కిన్ గా నటించారు.
సీనియర్ నటి శోభన చాలా ఏళ్ళ తర్వాత కల్కితో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె శంభాల నాయకురాలు మరియమ్మ పాత్ర పోషించింది. కేరళకు చెందిన శోభన గతంలో అనేక తెలుగు చిత్రాల్లో నటించింది కానీ, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం సొంత గొంతు వినిపించింది. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, తమిళ నటుడు పశుపతి, మలయాళ నటి అన్నా బెన్.. ఇలా ప్రధాన పాత్రధారులందరూ ఓన్ గా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు.
తెలుగు మాట్లాడటం రాని యాక్టర్స్ తో, సొంతంగా డైలాగులు చెప్పించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని మెచ్చుకొని తీరాల్సిందే. అయితే పరభాషా నటులు తెలుగులో సరిగా మాట్లాడలేకపోయారని, వినడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. క్యారక్టర్ ఆర్టిస్టులంతా ఎన్నారైల్లాగా మాట్లాడుతున్నారని, ఫ్యూచర్ లో తెలుగుకి తెగులు పట్టిస్తారని ఈ సినిమాతో చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు.
'కల్కి' కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగే కథ కాబట్టి, భవిష్యత్ లో ప్రజలంతా తెలుగులో ఇలానే మాట్లాడతారని దర్శకుడు ఊహించి తీసి ఉంటారని.. అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా నాగి క్రియేట్ చేసిన 'కల్కి వరల్డ్' కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందులోని పాత్రలు, అతిథి పాత్రలు ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తున్నాయి. గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. తొలి రోజే రూ. 191 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.