మీడియా-వినోద రంగంలో అతిపెద్ద సంస్థ!
ఒప్పందంలో భాగంగా స్టార్ ఇండియాలో వయాకామ్ 18 మీడియా వ్యాపారం విలీనం అవుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.
By: Tupaki Desk | 29 Feb 2024 6:06 AM GMTభారత్ లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాల్ని విలీనం చేస్తున్నట్లు రిలయన్స్- వాల్ట్ డిస్నీ కంపెనీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ రెండు సంస్థల మీడియా వ్యాపారాల విలీనంతో 70 వేల కోట్ల విలువైన సంస్థ అవతరించే అవకాశం ఉంది. పలు భాషల్లో 120 టీవీ ఛానెళ్లు..రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు..దేశ వ్యాప్తంగా 75 కోట్ల మంది వీక్షకుల సంఖ్యతో భారత మీడియా, వినోద రంగంలో అతిపెద్ద సంస్థగా ఇది నిలుస్తుంది.
ఒప్పందంలో భాగంగా స్టార్ ఇండియాలో వయాకామ్ 18 మీడియా వ్యాపారం విలీనం అవుతుందని ఇరు సంస్థలు తెలిపాయి. విలీనానంతరం సంస్థ విలువ 70,352 కోట్లగా ఉండొచ్చని పేర్కొంది. ఈ సంస్థకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ -డిస్నీ మాజి అధికారి చైర్ పర్సన్ గా ఉంటారు.
ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం.. అనుబంధ సంస్థ వయోకామ్ 46.82 శాతం కలిపి మొత్తంగా 63.16 శాతం, డీస్నీకి 36.84 శాతం వాటా ఉంటాయి. అలాగే సోనీ- నెట్ ప్లిక్స్ లాంటి సంస్థలతో పోటీ పడేందుకు విలీనానంతర సంస్థల్లో 11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది. ఈ విలీన ప్రతిపాదనకు నియంత్రణ సంస్థలు..వాటా దార్లతో పాటు ఇతరత్రా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవన్నీ లభిస్తే 2024 చివరి త్రైమాసికంలో లేదా 2025 మొదటి త్రైమాసికంలో ఈ లావాదేవీ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. భారత్ లో ఎలిఫెంటా హౌస్ బ్రాండ్ పై పానీయాల తయారీ-మార్కెటింగ్- పంపిణీ-విక్రయాల నిమిత్తం శ్రీలంక సంస్థ ఎలిఫెంటా హౌస్ తో రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్ ఒప్పందం చేసుకుంది.