Begin typing your search above and press return to search.

ఏఐ తో సంగీత క‌ళాకారుల‌కు ప్ర‌మాద‌మేనా?

ఎఐ దెబ్బతో అభివృద్థి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

By:  Tupaki Desk   |   15 May 2024 6:48 AM GMT
ఏఐ తో సంగీత క‌ళాకారుల‌కు ప్ర‌మాద‌మేనా?
X

కృత్రిమ మేధా(ఎఐ)తో అన్ని రంగాలకు పెను ముప్పు పొంచి ఉందని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు తెర‌పైకి వ‌చ్చేసాయి. భవిష్యత్తులో ఎఐ ఉద్యోగ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడొచ్చని హెచ్చరించారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఎఐ దెబ్బతో అభివృద్థి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఏఐని సరిగ్గా నిర్వహించకుంటే ఆదాయ అసమానతలకూ దారి తీస్తుందని హెచ్చరించారు. మ‌రి ఏఐ ఇంపాక్ట్ సినిమా ఇండ‌స్ట్రీ పై ఎలా ఉండ‌బోతుంది? అన‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. ఇప్ప‌టికే అనివార్య కార‌ణాల‌తో స్టార్ హీరోలు అందుబాటులో లేని ప‌క్షంలో...త‌ప్పని ప‌రిస్థితుల్లో ఏఐ టెక్నాల‌జీతోనే హీరోల్ని పున సృష్టించి షూటింగ్ చేస్తున్నారు. డ‌బ్బింగ్ స‌మ‌యంలో అదే హీరో వాయిస్ తో డ‌బ్బింగ్ సైతం చెప్పిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఇప్ప‌టికే అమ‌లులో ఉంది.

ఇంకా మ‌రికొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌ల్లోనూ అవ‌స‌రాన్ని బ‌ట్టి ఏఐని వినియోగిస్తున్నారు. తాజాగా చాట్ జీపీటీలో వ‌చ్చిన కొత్త వెర్ష‌న్ సంగీత క‌ళాకారుల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాట పాడటానికి - కంపోజ్ చేయగల సామర్థ్యాన్నిఏఐ కలిగి ఉంది. సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సాధించింది. పాడటమే కాకుండా ట్యూన్‌లను సమన్వయం చేయగలదు. దాని సృజనాత్మక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఇదంతా సాధారణ ప్రాంప్ట్‌లో జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇంగ్లీషు -స్పానిష్ భాషలలో మాత్ర‌మే అందుబాటులో ఉంది.

అయితే ఇదే ప్ర‌క్రియ భార‌తీయ భాష‌ల్లోకి అందుబాటులోకి వ‌స్తే అతి పెద్ద ప్ర‌మాద‌మే ఉంటుంది. ఆదిశ‌గా అడుగులు పడుతున్నాయి. త్వరలో చలనచిత్ర నిర్మాతలు తమ సంగీత అవసరాల కోసం చాట్ జీపీటీపై ఆధారపడవచ్చు ఓ నిపుణుడు చెప్పారు. ఇదే జ‌రిగితే సంగీత పరిశ్రమలోని కళాకారులు - సాంకేతిక నిపుణుల కెరీర్‌లు ప్ర‌శ్నార్ద‌క‌మే. సాహిత్యాన్ని పాట‌గా మార్చ‌డంలో గాయకులు, సంగీత స్వరకర్తలు, ప్రోగ్రామర్లు, లైవ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్‌లు , సౌండ్ ఇంజనీర్లు ఇలా ఎంతో మంది ప‌నిచేస్తారు. అదే ప‌ని ఏఐ చేస్తే? వీరంతా ప్రమాదం లో ప‌డ్డ‌ట్లే. సంగీత బృందం ఒక పాట కోస‌మే కొన్ని రోజులు ప‌ని చేస్తుంటుంది. కానీ ఏఐ వందల కొద్దీ ట్యూన్లు ఇవ్వ‌గ‌ల‌దు. త‌ద్వారా స‌మ‌యం ఆదా అవుతుంది. ది బెస్ట్ ఎంపిక చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు.