Begin typing your search above and press return to search.

భారతీయుడు 2.. వయసుతోనే అసలు సమస్య?

సామాజిక ఇతివృత్తాన్ని తీసుకునే సమయంలో స్టొరీలో క్యారెక్టర్ కాని, ఎలిమెంట్స్ కాని రియాలిటీకి దగ్గరగా లేకపోతే సినిమాని వెంటనే తిరస్కరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 8:08 AM GMT
భారతీయుడు 2.. వయసుతోనే అసలు సమస్య?
X

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంట్రో వీడియోని తాజాగా రిలీజ్ చేశారు.

భారతీయుడు తరహాలోనే లంచం, అవినీతి నేపథ్యంలోనే శంకర్ ఈ కథని కూడా చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని ఇంట్రోలోనే క్లారిటీ ఇచ్చేశాడు. అయితే భారతీయుడు మూవీ 27 ఏళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సీక్వెల్ ని శంకర్ తీసుకోస్తున్నాడు. మొదటి పార్ట్ లో కమల్ హాసన్ వయస్సు 70 ఏళ్ళుగా చూపించారు.

ఇంట్రోలో కథ 2023లో నడవబోతోంది అన్నట్లు శంకర్ ప్రెజెంట్ చేశారు. ఈ లెక్కన సేనాపతి వయస్సు 97 ఏళ్ళు ఉంటాయి. అంటే వందేళ్ళకి దగ్గరయ్యే వయస్సులో సేనాపతి పాత్రని ఒకప్పటి తరహాలోనే శంకర్ రిప్రజెంట్ చేశాడు. క్యారెక్టర్ లుక్ లో పెద్దగా వేరియేషన్ చూపించలేదు. మళ్ళీ ఎప్పుడైతే లంచగొండితనం, అవినీతి పెరిగిపోతుందో భారతీయుడు తిరిగొస్తాడు అనే విధంగా చూపించారు.

అంటే మరల 97 ఏళ్ళ వయస్సులో సేనాపతి తిరిగొచ్చి అన్యాయంపై పోరాటం చేస్తాడా అనే క్వశ్చన్ వస్తోంది. శంకర్ అంటేనే యాక్షన్ కు కొదవ ఉండదు. ఇప్పుడు ఓల్డేస్ట్ సేనాపతి తో నిజానికి అది సాధ్యమవుతుందా. లాజికల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. 70 ఏళ్ళ వయస్సులో సేనాపతి పాత్రని ఎలా అయితే చూపించారో అదే లుక్ లో చూపిస్తే ప్రేక్షకులు ఎంత వరకు అడాప్ట్ చేసుకుంటారు అనే సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో సినిమాలు చూసే ఆడియన్స్ ఆలోచనలో మార్పులు వచ్చాయి. సామాజిక ఇతివృత్తాన్ని తీసుకునే సమయంలో స్టొరీలో క్యారెక్టర్ కాని, ఎలిమెంట్స్ కాని రియాలిటీకి దగ్గరగా లేకపోతే సినిమాని వెంటనే తిరస్కరిస్తున్నారు. మరి భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్రని శంకర్ ఎలా కన్విన్స్ అయ్యే విధంగా చెబుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.