భర్త ఆత్మహత్య వెనక శాపం ఉందన్న సీనియర్ నటి
అప్పుల బాధ తట్టుకోలేక ఆయన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారమైంది.
By: Tupaki Desk | 4 March 2024 6:15 AM GMTసహజనటి జయసుధ భర్త, ప్రముఖ నిర్మాత నితిన్ ఆత్మహత్య గురించి కొన్నేళ్లుగా సోషల్ మీడియాల్లో రకరకాలుగా ట్రోలింగ్ జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆయన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారమైంది. అయితే దీనిని జయసుధ పలు సందర్భాల్లో ఖండించారు. సోషల్ మీడియా దుష్ప్రచారం సరికాదని వారించారు.
ఇప్పుడు మరోసారి ప్రముఖ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో జయసుధ తమ కుటుంబానికి ఉన్న శాపం గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ఆ కుటుంబంలో నాలుగు ఆత్మహత్యలకు కారణం అతి పెద్ద శాపం (కర్స్) అని అన్నారు. ఈ శాపం భారి నుంచి తమ పిల్లలు వారి పిల్లలను కాపాడేందుకు దేవుడిని ప్రార్థిస్తున్నానని కూడా జయసుధ అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జయసుధను యాంకర్ ఈ విధంగా ప్రశ్నించారు. ``సినిమాలు తీసి ఆస్తులు కోల్పోయామని మీరు అన్నారు. మీ భర్త, నిర్మాత నితిన్ సినిమాల కోసం అప్పులు చేసి పైనుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారమైంది. మీ కుటుంబంపై ట్రోల్ జరిగింది`` దీనికి మీ వివరణ ఏమిటి? అని ప్రశ్నించారు.
``ఇది నా వ్యక్తిగత విషయం. అప్పులకు మేం భయపడం. అప్పులతో ఆత్మహత్య చేసుకున్నారనేది సరికాదు.. మా కుటుంబానికి చాలా పెద్ద శాపం ఉంది. అది మా పిల్లలు వారి పిల్లలకు రాకూడదని కోరుకుంటున్నాను. నితిన్ గారు మాత్రమే కాదు.. ఆయన సోదరుడు (పెద్దాయన) కూడా ఆత్మహత్యతో చనిపోయారు. ఆ కుటుంబంలో మరో ఇద్దరు ఆడవారు (అత్తగారి తరపు వారు) కూడా అలానే ఆత్మహత్యతో మరణించారు...`` అని జయసుధ తెలిపారు. అప్పులంటే మాకు భయం లేదు. భయపడేంత అప్పులు చేయలేదు. అప్పుల కోసం సూసైడ్ చేసుకునేంత పిరికివాళ్లం కాదు. సోషల్ మీడియాల్లో చెడు మాత్రమే కాదు మంచి విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా విషయాలను సోషల్ మీడియాల్లో చూసి తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ మంచి చెడు రెండూ ప్రచారం అవుతున్నాయి.
నితిన్ గారి గురించి ప్రచారమైంది ఏదీ నిజం కాదు. నితిన్ ఆత్మహత్య ఏదో ఒకరోజు జరుగుతుందని మాకు ముందే తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. పొద్దున్న జరుగుతుందా? సాయంత్రం జరుగుతుందా? ఎలా జరుగుతుంది! అంటూ భయపడ్డాం. సంవత్సరం పాటు ఇది చూశాం. మేము మాత్రమే కాదు నితిన్ ఫ్యామిలీ కూడా దీని గురించి చాలా భయపడింది.
మీ కుటుంబం నాశనం అయిపోవాలి అని శపించడం చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. ఇలాంటి శాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి నాలుక పవర్ గురించి బైబిల్ లో చెబుతుంటారు. నాకు ఒకరు చెప్పారు.. దేవుడు ప్రార్థనలు సరే కానీ, శాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి పుట్టుక చావును మాట్లాడే మాట (నాలుక) పై శాసిస్తుందని బైబిల్ లో ఉంది. అందుకే నేను నా పిల్లల విషయంలో భయపడతాను. ఆ శాపం వాళ్ల విషయంలో నిజం కాకూడదని అనుకుంటాను.. అని అన్నారు. నితిన్ చాలా స్మార్ట్ మ్యాన్.. ఇంటెలిజెంట్.. కానీ అది (ఆత్మహత్య) జరిగింది... అని జయసుధ సుదీర్ఘంగా ఆ ఘటనపై మాట్లాడారు.