Begin typing your search above and press return to search.

నోటి తీట వ్యాఖ్యలు... పాక్ క్రికెట్ కీ ఐశ్వర్యా రాయ్ కి ఏమి సంబంధం?

ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీల్లో ముఖ్యంగా వసీం అక్రం మరింతగా పాక్ క్రికెట్ బోర్డ్ పైనా, ప్లేయర్స్ పైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 3:32 PM GMT
నోటి తీట వ్యాఖ్యలు... పాక్  క్రికెట్ కీ ఐశ్వర్యా రాయ్  కి ఏమి సంబంధం?
X

తాజాగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ - 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిన జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి కచ్చితంగా ఇంగ్లాండ్, పాకిస్తాన్‌, శ్రీలంక జట్లే అని అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. మరి ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. మరి ముఖ్యంగా భారత్ తో ఓటమి అనంతరం ఆ జట్టు తేరుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే వారి ఓటమికి ఎవరిస్థాయిలో వాళ్లు సాకులు వెతుక్కున్నారు. మైదానంలో పాక్ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయలేదని ఒకరంటే.. ఇది ఐసీసీ టోర్నీనా, బీసీసీఐ టోర్నీనా అని వంకర మాటలు మాట్లాడారు! ఈ సమయంలో భారత్ తో మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా పాక్ ఓడిపోయింది. దీంతో పాక్ టీం ఫెర్మార్మెన్స్ పై అభిమానులు ఫైర్ అయ్యారు. ఆన్ లైన్ వేదికగా విరుచుకుపడిపోయారు.

ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీల్లో ముఖ్యంగా వసీం అక్రం మరింతగా పాక్ క్రికెట్ బోర్డ్ పైనా, ప్లేయర్స్ పైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. పాకిస్థాన్ ప్లేయర్లు మటన్ గట్టిగా తింటున్నారని.. ఎవరికీ సరైన ఫిట్ నెస్ లేదని.. ఆటపై శ్రద్ధ లేదని.. దేశానికి ఆడుతున్నామన్న ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలపై తాజాగా అబ్ధుల్ రజాక్ స్పందించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ పేరు ప్రస్థావించి నెటిజన్లతో చివాట్లు తింటున్నాడు!

అవును... వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీం ఫెర్మార్మెన్స్ పై పాక్ మాజీ ప్లేయర్ అబ్ధుల్ రజాక్ స్పందించాడు. తాజాగా కరాచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, సల్మాన్ బట్, మిస్బాఉల్ హక్, మరికొందరితో కలిసి పాల్గొన్నారు. అక్కడే ప్రెస్స్ మీట్ నిర్వహించారు. ఈ సమయంలో పాక్ జట్టు సెమీ ఫైనల్స్ చేరపోవడంపై అబ్దుల్ రజాక్ స్పందించాడు.

ఇందులో భాగంగా... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌ తో ఏ సంబంధం లేని మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ ని మధ్యలోకి లాగాడు. ఐశ్వర్య రాయ్‌ ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే? అని చెప్పుకొచ్చాడు! దీంతో నెటిజన్లు రజాక్ ను ఉతికి ఆరేస్తున్నారు. మహిళలపై ఇలాంటి మాటలు అవసరమా అని ఫైరవుతున్నారు.

ఈ ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సంధికాలంలో ఉన్నట్లు తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించిన రజాక్... కెప్టెన్ అనేవ్యక్తి ఎప్పుడూ జట్టుకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని.. తాను జట్టులో ఆడేటప్పుడు యూనిస్ ఖాన్‌ అలానే ఉండేవాడని, తనను ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయలో తన ఆట తీరుని మరింత మెరుగుపర్చుకోవడానికి యూనిస్ ఖాన్ అనేక సలహాలను ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు అలాంటి వాతావరణం తనకు పాకిస్థాన్ జట్టులో కనిపించట్లేదని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆ విషయంపై పెద్దగా పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించాడు. ఇదె సమయంలో... ఆటగాళ్ల నైపుణ్యాలను, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింప జేయడంతోపాటు దేశం పట్ల, క్రికెట్ పట్ల అంకితభావం ఆడటం నేర్పించాలని అబ్దుల్ రజాక్ అన్నాడు. క్రికెట్‌ పై అంకిత భావం లేకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని పేర్కొన్నాడు.

అనంతరం పాక్ బోర్డుకు సంకల్ప బలమే లేదని.. అలాంటప్పుడు మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయని అన్నాడు. ఈ సందర్భంగా "నేను ఐశ్వర్య రాయ్‌ ని పెళ్లి చేసుకుని మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుంది. అది ఎప్పటికీ జరగదు.. ఇదీ అంతే! క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటే అలాంటి ఫలితాలే వస్తాయి" అని అబ్దుల్ రజాక్ ఉదహరించాడు.

ఈ సమయంలో రజాక్ పక్కనే ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్.. అతని వాగుడును సమర్ధిస్తూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. మరోపక్క రజాక్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. తరాలు మారుతున్నా పాక్ క్రికెటర్లు బుద్ధి మాత్రం మారడం లేదని విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బేషరతుగా ఐశ్వర్య రాయ్‌ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.