సంక్రాంతి రిలీజ్‌లపై తర్జనభర్జన ఫలితమిదీ!
విడుదలైన ప్రతి సినిమా మంచి బిజినెస్ చేసి నిర్మాతకు లాభాలు రావాలనే అభిప్రాయం ఈ వేదికపై వ్యక్తమైంది.
By: Tupaki Desk | 5 Jan 2024 4:31 AM GMTసంక్రాంతి అంటేనే సినిమాల హడావిడి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ రిలీజ్ లకు ప్లాన్ చేయడం కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్ఠిస్తుంది. అయితే సమస్య పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయగా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు చర్చించారు. తాజా సమావేశంలో ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే తెలుగు సినిమాల థియేటర్లు, వ్యాపార సమస్యలపై దృష్టి సారించారు. విడుదలైన ప్రతి సినిమా మంచి బిజినెస్ చేసి నిర్మాతకు లాభాలు రావాలనే అభిప్రాయం ఈ వేదికపై వ్యక్తమైంది.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ``సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు న్యూస్ ఛానెల్‌లు ఎల్లప్పుడూ పరిశ్రమకు మద్దతు ఇస్తాయి. అయితే కొన్నిసార్లు వారికి వచ్చే వార్తల వల్ల వ్యక్తిగత నష్టం జరుగుతుంది. సంక్రాంతి పండుగకు సినిమాల పోటీ ఎప్పుడూ ఉంటుంది.. అయితే 15 రోజుల క్రితం నిర్మాతల సమావేశంలో మేం తీసుకున్న నిర్ణయానికి అంగీకరించడంతో `ఈగిల్` టీమ్ వెనక్కి తగ్గింది. ఛాంబర్ వారు అడగ్గా, విశ్వ ప్రసాద్, వివేక్ , హీరో రవితేజ బరిలో వెనక్కి తగ్గడానికి అంగీకరించారు. మిగిలిన నాలుగు చిత్రాలకు కొన్ని స్క్రీన్‌లు లభించి వ్యాపారం చేసే అవకాశం వచ్చింది. బరిలో నుంచి తప్పుకున్న ఈగిల్ టీమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు`` అన్నారు. నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ-``సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలపై నిర్ణయం తీసుకోవడానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిర్మాతల సమావేశం నిర్వహించాయి. ఆ సమావేశానికి నిర్మాతలందరూ వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈగిల్ మూవీ టీమ్ కి కృతజ్ఞతలు`` అన్నారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ-``ఈ ప్రెస్‌మీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతికి సినిమాలు సజావుగా విడుదల కావడం. ఈసారి కూడా చాలా సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. 15 రోజుల క్రితం ఛాంబర్ తరపున చాలా మంది నిర్మాతలను పిలిపించి గ్రౌండ్ రియాలిటీ .. బిజినెస్ గురించి మాట్లాడారు. ఆ మీటింగ్ లో ఎదుటివారు ఆలోచించి వెనక్కి తగ్గారు.. ఈగిల్ మూవీని వాయిదా వేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ , వివేక్, హీరో రవితేజ కు ధన్యవాదాలు. ఇందులో ఎవరికీ వ్యక్తిగత లాభం లేదని, అందరి సినిమాల మేలు కోసమే ఈ నిర్ణయం`` అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి నుండి అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ-``సంక్రాంతి బరిలోకి దిగిన ఈగిల్ టీం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్‌గారికి, వివేక్‌గారికి, హీరో రవితేజగారికి ధన్యవాదాలు. ఇది మన సినీ పరిశ్రమలోని ఐక్యతను తెలియజేస్తోంది`` అని అన్నారు.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్, నిర్మాతలు నిరంజన్. రెడ్డి, వివేక్ కూచిబొట్ల, చిత్తూరు శ్రీను, వెంకట్ బోయినపల్లి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.