ఆమె రిజెక్ట్ చేసిందంటే.. సినిమా రిజల్ట్ ఇక అంతే!
అదృష్టం కొద్దీ ఆమె అలా తిరస్కరించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
By: Tupaki Desk | 14 Feb 2024 9:30 AM GMTసినిమా ఫలితాన్ని ఎవరూ ముందుగా ఊహించలేరు. ఏ మూవీ హిట్ అవుతుంది.. ఏ సినిమా ప్లాప్ అవుతుందనేది చెప్పలేరు. అయితే కొందరు నటీనటులు మాత్రం స్క్రిప్ట్ విన్నప్పుడే అది వర్కౌట్ అవ్వదని అంచనా వేయగలుగుతారు. టాలీవుడ్ లో స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా వ్యవహరించే హీరోయిన్లలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచీ పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తూ వస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అదృష్టం కొద్దీ ఆమె అలా తిరస్కరించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ 'భోళా శంకర్'. ఇది తమిళ్ లో హిట్టైన 'వేదాళమ్' చిత్రానికి రీమేక్. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మెగా అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇందులో కీర్తి సురేష్ పోషించిన సిస్టర్ రోల్ కోసం మేకర్స్ ముందుగా సాయి పల్లవినే సంప్రదించారు. అయితే రీమేక్ మూవీలో తాను నటించలేనంటూ ఆఫర్ రిజెక్ట్ చేసింది. ఈ విషయాన్ని 'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు. చిరు లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకుందని అప్పట్లో చాలా మంది ట్రొలింగ్ చేసారు కానీ, సినిమా రిలీజైన తర్వాత పల్లవి సరైన నిర్ణయమే తీసుకుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'చంద్రముఖి–2'. ఈ సినిమాలో కంగన పోషించిన పాత్ర కోసం ముందు సాయి పల్లవిని సంప్రదించారు. అయితే కథ నచ్చకపోవడంతో అమ్మడు తిరస్కరించింది. ఈ హారర్ కామెడీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి దారుణమైన పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతకముందు 'వలిమై' చిత్రంలో అజిత్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినా, సున్నితంగా తిరస్కరించిందట. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
గతేడాది విజయ్ హీరోగా నటించిన 'లియో' చిత్రంలో సాయిపల్లవిని నటింపచేసే ప్రయత్నం జరిగిందట. ఆమె నో చెప్పడంతో త్రిష కృష్ణన్ వద్దకు వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది కానీ, అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అలానే 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించే అవకాశాన్ని వదులుకుందనే ప్రచారం జరిగింది. ఇక విజయ్ దేవరకొండ చేసిన 'డియర్ కామ్రేడ్' చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా పల్లవినే సంప్రదించారనే టాక్ వుంది.
ఇలా సాయిపల్లవి తిరస్కరించిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అయినవే ఉన్నాయి. అందుకే ఆమె ఏ ప్రాజెక్ట్ అయినా రిజెక్ట్ చేసింది అంటే.. దాని రిజల్ట్ ఇంక అంతే సంగతులు అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై రకరకాల మీమ్స్ దర్శనమిస్తున్నాయి. మిగతా హీరోయిన్లు కూడా ఎప్పుడూ రెమ్యునరేషన్ గురించి మాత్రమే ఆలోచించకుండా, స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే కెరీర్ కు మంచిదని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.
'ఢీ' డ్యాన్స్ షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి.. 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా మారింది. 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో డ్యాన్సులతో అందరినీ ఫిదా చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. అలానే తన 'లవ్ స్టోరీ' హీరో అక్కినేని నాగచైతన్యకు జోడీగా 'తండేల్' సినిమాలో నటిస్తోంది.