సోగ్గాడికి నిజంగానే అన్ని ఎఫైర్స్ ఉన్నాయా?
ముఖ్యంగా ఆయన ఎఫైర్స్ గురించిన వార్తలు ఇప్పటికీ చక్కర్లు కొడుతుంటాయి.
By: Tupaki Desk | 20 Jun 2024 8:30 AM GMTసోగ్గాడు శోభన్ బాబు గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న దిగ్గజ నటుడాయన. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి సీనియర్ నటులకు ధీటుగా నిలిచిన మొదటి తరం కథానాయకుడు. కుటుంబ కథా చిత్రాలతో టాలీవుడ్ ఫస్ట్ రొమాంటిక్ హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తుండిపోయిన శోభన్ బాబు వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఎఫైర్స్ గురించిన వార్తలు ఇప్పటికీ చక్కర్లు కొడుతుంటాయి.
అగ్ర హీరోగా వెలుగొందుతున్న రోజుల్లో శోభన్ బాబుకు పలువురు హీరోయిన్లతో సంబంధాలు ఉండేవని పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో మీడియా ఈ రేంజ్ లో లేనప్పటికీ కొన్ని సినీ వారపత్రికలలో, మంత్లీ మ్యాగజైన్స్ లో ఆయన ఎఫైర్లకు సంబంధించిన గాసిప్స్ వస్తూ ఉండేవి. నటి జయలలితతో శోభన్ బాబు ప్రేమాయణం సాగించారని ఎక్కువగా ప్రచారం చేయబడింది. 'డాక్టర్ బాబు' సినిమా అప్పటి నుంచే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, వీరి ప్రేమకు గుర్తుగా ఒక కూతురు కూడా పుట్టిందని, ఆమెను బయటి ప్రపంచానికి పరిచయం చేయకుండా పెంచారంటూ రకరకాల రూమర్లు వినిపించాయి. శోభన్ బాబుకు అప్పటికే శాంతకుమారితో వివాహమై ఉండటంతో, జయలలితను పెళ్ళి చేసుకోలేదని అంటుంటారు.
నిజానికి శోభన్ బాబు సోలో హీరోగా నిలదొక్కుకుంటున్నప్పటికే, జయలలిత స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమెతో ఒక్క సినిమాలో అయినా కలిసి నటించాలని కోరుకున్న శోభన్.. 'డాక్టర్ బాబు' చిత్రంతో తొలిసారి అలాంటి అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే జయ తన తల్లిని కోల్పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఆ సమయంలో శోభన్ ఆమెకు సపోర్టుగా నిలిచి కోలుకునేలా చేశారని, ఈ విషయాలను ఆయన తన డైరీలో ప్రస్తావించారని వార్తలు ఉన్నాయి. అయితే వారిద్దరి మధ్య బంధం స్నేహంతో ఆగిపోలేదని, అది ప్రేమగా మారిందని గాసిప్స్ వచ్చాయి. అందులో నిజమెంతనేది తెలియదు కానీ, పలు సినీ పత్రికల్లో వీళ్ళ రిలేషన్ కు సంబంధించి ఎన్నో కథనాలు వచ్చేవి.
రియల్ లైఫ్ లోనూ శోభన్ బాబును చాలా మంది హీరోయిన్స్ ఇష్టపడేవారట. మంచి అందగాడు కావడంతో ఈయనపై అందరికీ క్రష్ ఉండేదట. కానీ ఆయన మాత్రం ఎంతసేపూ సినిమాలు వ్యాపారాల గురించే ఆలోచించేవారని, ప్రచారంలో ఉన్నట్లుగా ఏ హీరోయిన్ తోనూ సంబంధాలు లేవని కొందరు సన్నిహితులు చెబుతుంటారు. కొన్ని గాసిప్ మ్యాగమైన్లు మాత్రం శోభన్ బాబుకు ఒకరిద్దరు హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లుగా వార్తలు రాస్తూ వచ్చేవి. జయలలితను శోభన్ పెళ్లి చేసుకుందామనుకున్నాడు కానీ సాధ్యపడలేదని, ఎందుకంటే ఆయన తన భార్యను మోసం చేయదలచుకోలేదని ప్రముఖ సినీ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి ఓ ఇంటర్వూలో చెప్పడం అప్పట్లో వైరల్ అయింది.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘డాక్టర్ బాబు’ సినిమా విషయంలో శోభన్ బాబు, జయలలితలను ఫస్ట్ టైం కలిపింది తానేనని చెప్పారు. వాళ్ల మధ్య రిలేషన్ గురించి తనకు తెలియదు కానీ.. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందని, పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుందని, ప్రతిదాన్ని నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమెకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్లు కలిసి ఉన్నారని, అది దేశం మొత్తానికి తెలిసినదేనన్నారు. కానీ వాళ్లకి పిల్లలు ఉన్నారని, వారిని దాచిపెట్టారనే వార్తల్లో మాత్రం నిజం లేదని తమ్మారెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే జయలలితకు తానే అసలైన వారసురాలినని జె.జయలక్ష్మి అనే మహిళ చెప్పడం అప్పట్లో సంచలనం అయింది. దివంగత సినీ నటుడు శోభన్ బాబు తన తండ్రి అని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమని ఆమె చెప్పింది. ఎన్నో కారణాల వల్ల తాను వాళ్ళ కూతురునని చెప్పలేకపోయానని.. జయలలిత మరణం తర్వాత, గత ఎన్నికలకు ముందు జయలక్ష్మి మీడియా ముఖంగా వెల్లడించడంపై సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
ఇలా శోభన్ బాబు వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఎఫైర్ల గురించి అనేక వార్తలు ఉన్నాయి. వాటిల్లో నిజమెంత, అబద్ధమెంత అనేది పక్కన పెడితే.. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే గొప్ప నటులలో ఆయననొకరు. ఆంధ్రుల అందగాడుగా, సోగ్గాడుగా ఆయన ఇప్పటికీ సినీ అభిమానుల హృదయాల్లో ఉండిపోయారు. తనదైన డైలాగ్ డెలివరీతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే అదంతా శోభన్ బాబు గొప్పదనమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా, సినిమాల రూపంలో ఎప్పటికీ సజీవంగానే ఉండిపోతారు.