Begin typing your search above and press return to search.

తండ్రి పాత్రల్లో ఆయన ముద్రే వేరు

ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా హీరోగా చేస్తున్నపుడే అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారాయన.

By:  Tupaki Desk   |   11 Nov 2023 9:17 AM GMT
తండ్రి పాత్రల్లో ఆయన ముద్రే వేరు
X

తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి అనేక విజయాలను సొంతం చేసుకున్న చంద్రమోహన్ శనివారం అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు కాగా.. ఇందులో 50 ఏళ్లకు పైగా ఆయన జీవితం సినిమాలతోనే ముడిపడి ఉంది. కొంచెమైనా కృత్రిమత్వం లేకుండా ఎంతో సహజంగా తన పాత్రలను పండిస్తారని చంద్రమోహన్‌కు పేరుంది. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా హీరోగా చేస్తున్నపుడే అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. ఐతే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన మిగతా పాత్రలన్నీ ఒకెత్తు. కెరీర్లో లేటు వయసులో ఆయన చేసిన తండ్రి పాత్రలన్నీ మరో ఎత్తు.

చంద్రమోహన్ చేసిన తండ్రి పాత్రల గురించి ఆయా సినిమాలు రిలీజైనపుడు జనాలు పెద్దగా మాట్లాడుకుని ఉండరు. బేసిగ్గానే మన సినిమాల్లో హీరో హీరోయిన్లు, విలన్ల గురించి మాట్లాడుకున్నంతగా క్యారెక్టర్ రోల్స్ చేసిన నటుల గురించి అంత చర్చ ఉండదు. కానీ ఒకసారి చంద్రమోహన్ చేసిన తండ్రి పాత్రలు ఒక్కోటి ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆయన ఎంత గొప్పగా ఆ పాత్రలను పండించారో అర్థమవుతుంది. 90వ దశకం నుంచి ఆయన తండ్రి పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ‘గులాబి’ సినిమాలో జేడీ చక్రవర్తి తండ్రి పాత్రలో ఆయన వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఆ తర్వాత ఇలాంటి మంచి తండ్రి పాత్రలు ఎన్నో చేశారు. త్రివిక్రమ్ రచయితగా చంద్రమోహన్ కోసం కొన్ని అద్భుతమైన తండ్రి పాత్రలు రాశారు. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్లో చంద్రమోహన్ చేసిన తండ్రి పాత్రలు గుండెకు హత్తుకుంటాయి. తక్కువ నిడివిలోనే తనదైన ముద్ర వేశారాయన. ఇక ‘7/జి బృందావన కాలనీ’లో చంద్రమోహన్ చేసిన తండ్రి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా చంద్రమోహన్ బలమైన ముద్ర వేసిన తండ్రి పాత్రలు ఎన్నెన్నో.