ఒంటరితనం అపచారం కాదు: టబు
50 ప్లస్ వయసులో టబు ఎంతో గ్లామరస్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 60కోట్లు వసూలు చేసింది.
By: Tupaki Desk | 10 April 2024 12:30 AM GMTఇటీవల 'క్రూ' విజయాన్ని ఆస్వాధిస్తోంది టబు. 50 ప్లస్ వయసులో టబు ఎంతో గ్లామరస్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 60కోట్లు వసూలు చేసింది. వయసుతో సంబంధం లేకుండా గ్లామరస్ పాత్రలో నటించి మెప్పించింది టబు. ఇటీవల వరస ఫోటోషూట్లతోను దుమ్ము లేపుతోంది. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ ప్రఖ్యాత వోగ్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది.
మనం తెలుసుకున్న ఎనిగ్మా కంటే టబు (@టాబుటిఫుల్) ఎవరు? మా ఏప్రిల్ డిజిటల్ కవర్ కోసం సీనియర్ నటి తన వోన్ సౌందర్య నియమాలను కొన్నింటిని ఉల్లంఘిస్తూ తన అంతర్గత ప్రపంచంలోకి మమ్మల్ని ఆహ్వానించింది. బయోలోని లింక్‌లో పూర్తి కవర్ స్టోరీని చదవండి.. అంటూ వోగ్ ఇండియా ఈ ఫోటోషూట్ ని షేర్ చేసింది. టబు గురించి తెలుసుకోవాల్సిన చాలా సంగతులు ఇక్కడ ఉన్నాయి.
వయస్సుతో పని లేని అందం, తబస్సుమ్ ఫాతిమా హష్మీ అకా టబు (ఆమె రంగస్థల పేరు). ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన మహిళ. 4 నవంబర్ 1979న ప్రముఖ తార షబానా అజ్మీ మేనకోడలు జమాల్ అలీ హష్మీ- రిజ్వానా దంపతులకు జన్మించిన టబు `హమ్ నౌజవాన్` సినిమాలో బాలనటిగా తొలిసారి కనిపించింది, అప్పటి నుంచి సినీనటిగా కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు.
ఇతరులతో టబును వేరుగా ఉంచేది ఆమె ప్రతిభ మాత్రమే కాదు.. తన బలమైన వ్యక్తిత్వం. టబు 1985లో హమ్ నౌజవాన్‌తో బాలనటిగా అరంగేట్రం చేసినప్పుడు తాను పెద్ద స్టార్ అవుతానని ఊహించి ఉండదు. టబు స్టార్ అయింది. బాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలలో నటించింది. మాచిస్, కాలాపానీ, అస్తిత్వ, చాందినీ బార్, మక్బూల్, చీనీ కమ్, హైదర్, దృశ్యం మరెన్నో అద్భుతమైన చిత్రాలలో టబు విమర్శకుల ప్రశంసలు పొందిన పాత్రలతో అలరించింది. హెడ్‌స్ట్రాంగ్ పోలీసుగా, సెడక్టివ్ బార్ డ్యాన్సర్‌గా, శ్రద్ధగల తల్లిగా.. బలమైన స్త్రీ నటించి మెప్పించింది.
90వ దశకంలో టబు తన ప్రేక్షకులకు పెహ్లా పెహ్లా ప్యార్‌గా మారింది. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో ఆ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. పంజాబీ వీరేంద్ర (వీరన్), మాచిస్‌లో సిక్కు తిరుగుబాటు బాధితురాలు, సాధారణ పల్లెటూరి అమ్మాయి, విరాసత్‌లో గెహ్నా, ఆత్మవిశ్వాసం కలిగిన భార్య, అస్తిత్వలో అదితి పండిట్, చాందిని బార్‌లో బార్ డ్యాన్సర్ ముంతాజ్, డాన్‌ల ఒంటరి సతీమణి, నిమ్మి మక్బూల్‌లో, అంధాధున్‌లోని విలక్షణమైన విలన్ సిమి ఇలా ఎన్నో ప్రయోగాలు చేసింది. తాను పోషించిన ప్రతి బహుముఖ పాత్రకు న్యాయం చేసింది. భారతీయ సినిమా పరిశ్రమలో కళాత్మక నటిగా, కమర్షియల్ చిత్రాల క్వీన్ గా సమతుల్యతను సాధించింది.
టబు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ప్రతి పాత్రతోను తానేంటో చూపించింది. డార్క్ కామెడీ, వ్యంగ్యం, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, రొమాన్స్, మరేదైనా చిత్ర శైలి లో స్క్రిప్ట్‌ల ఎంపికతో టబు స్థిరంగా మూస పద్ధతులను ధిక్కరించింది. తన పరిపక్వత, యుక్తి, తనదైన దృక్పథంతో చాలా వరకూ ఉన్నత స్థాయిని అందుకుంది.
టబు మ్యాజిక్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే అంతర్జాతీయంగా కూడా పని చేసింది. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషలలో సినిమాలు చేయడం ద్వారా అన్నిచోట్లా పరిచయమైంది. మీరా నాయర్ డ్రామా `ది నేమ్‌సేక్`లో టబు ప్రధాన పాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టబుకు జాతీయ అవార్డు సహా దక్కిన అవార్డుల జాబితా అనంతం.
టబు ఎప్పుడూ పార్టీ పర్సనాలిటీ కాదు. సెట్లో తన పనిని పూర్తి చేసి ఇంటికి తిరిగి వెళుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఎవరైనా ఆమెతో కనెక్ట్ అయ్యారా? అంటే.. అంతగా పార్టీ క్రౌడ్ లో తిరగని అజయ్ దేవగన్ తనకు సన్నిహితుడయ్యారు. ఫరా ఖాన్ తనకు మంచి స్నేహితురాలు. ఫరా ఇంట్లో తాను చాలా సౌకర్యంగా ఉంటానని టబు చెప్పింది.
అజయ్ దేవగన్‌తో టబు చాలా ప్రత్యేకమైన బంధాన్ని పంచుకుంది. వారు ఒకే పరిసరాల్లో కలిసి పెరిగారు. అతడు తనతో మాట్లాడే ఏ వ్యక్తినైనా వేధించేవాడు.. కాబట్టి తాను ఒంటరిగా ఉండటానికి కారకుడైనందుకు అతడిని నిందించింది. అలాగే నిన్నే పెళ్లాడుతా, ఆయనా మా ఆయనే లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో జంటగా నటించిన క్రమంలో నాగార్జునతోను టబు లవ్ లో పడిందని కథనాలొచ్చాయి. కానీ ఈ ప్రేమాయణాలను టబు ఏనాడూ అంగీకరించలేదు.
టబు- 52 ఏళ్ల వయసులో ఒంటరిగా సంతోషంగా..!
తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రైవేట్‌గా మీడియా నుండి దూరంగా ఉంచేందుకు టబు ఇష్టపడుతుంది. టబు తరచుగా తన ఇంటర్వ్యూలలో ప్రేమ, వివాహం, సంబంధాల గురించి మాట్లాడుతుంది. సింగిల్ అనేది చెడ్డ పదం కాదని టబు నమ్ముతుంది. తన ప్రేమ పాఠాలను చాలా కష్టపడి నేర్చుకున్నానని అంగీకరిస్తుంది. ``సింగిల్ అనేది చెడ్డ పదం అని నేను అనుకోను. గతంలో ఒంటరిగా ఉండటాన్ని కళంకంగా భావించి ఉండవచ్చు.. కానీ ఇప్పుడు కాదు. మీ ఆనందం మీ సంబంధం.. స్థితితో సంబంధం లేని అనేక విషయాల నుండి వస్తుంది. మీకు మీరుగా స్వతంత్య్రంగా స్వంతంగా ఉండొచ్చు మీ ఒంటరితనంతో.. కానీ తప్పుడు భాగస్వామితో ప్రయాణం ఏ విధమైన ఒంటరితనంతో పోల్చినా ఘోరంగా ఉంటుంది... అని టబు అన్నారు.
స్త్రీ-పురుషుల సంబంధం ఒక సంక్లిష్టమైన విషయం. మనం చిన్న వయస్సులో ఉన్నప్పుడు మనకు ప్రేమ ఆలోచన ఉంటుంది. అప్పుడు మనం పెరుగుతాము.. కొత్త అనుభవాలను పొందుతాము.. స్వతంత్రంగా ఉంటాము.. కొన్ని విషయాలను అధిగమిస్తాము.. అని చెప్పింది. ఈ ప్రపంచాన్ని నేనే స్వయంగా చూడాలనుకున్నాను. నేను అన్నింటినీ వదులుకొని ఉంటే అది నాకు నా సామర్థ్యానికి అపచారం అయ్యేది. ఇద్దరు వ్యక్తులు ఒకరి జీవితాల్లో మరొకరు ఉండటం ద్వారా ఎదగడం ఆదర్శవంతమైన సంబంధం. సంబంధాలు విముక్తి కోసం ఉద్దేశించినవి.. అణచివేయడం కాదు. నా ఆలోచన కొంచెం భిన్నంగా ఉంటుందని నాకు తెలుసు. ఉదాహరణకు సంబంధంలో పురుషులు - స్త్రీలను నేను ఎప్పుడూ భిన్నంగా భావించలేదు... అని అన్నారు.