'99' ఆఫర్ ఆ మూడు సినిమాలకు లేదే!
కేవలం చెన్నై, బెంగుళూరు, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న స్క్రీన్లకే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 30 May 2024 3:24 PMమే 31 సినీ లవర్స్ డే ని పురస్కరించుకుని 99రూలకే టికెట్ ధరను ఒక్కరోజు పాటు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు వేలకు పైగా ఇండియా వైడ్ స్క్రీన్లలో 99కే టికెట్ విక్రయించనున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్నీ మల్టిప్లెక్స్ ల్లోనూ ఈ సెలబ్రేషన్ జరుగుతోంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రం వర్తించదు. కేవలం చెన్నై, బెంగుళూరు, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న స్క్రీన్లకే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
శుక్రవారం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...'గంగం గణేషా'..' భజే వాయువేగం' లాంటి యువ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నా సినీ ప్రేక్షకుడికి మాత్రం ఇక్కడ బాదుడు తప్పడం లేదు. ఈ మూడు సినిమాలకు యధావిధిగా పాత ధరల ప్రకారమే అమ్మకం జరుగుతుంది. హైదరాబాద్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి గరిష్ట ధర 295 కాగా పలు మల్టీప్లెక్సుల్లో 250 ఉంది. సింగల్ స్క్రీన్ 150 నుంచి 175 మధ్యలో ఉంది.
భజే వాయు వేగం, గంగం గణేశాలు కొంచెం తక్కువ పెట్టాయి. కానీ అవి కూడా రెండు వందల దాకా వెళ్లాయి. ఏపీలో 177 రూపాయల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఈ ధరల్లో సినీ లవర్స్ డే సందర్భంగా కొంత మార్పు ఉంటే బాగుండేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కరోజు ఆఫర్ కాబట్టి 99కే టికెట్ ధర పెడితే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉండేది. కొన్ని రోజులుగా కొత్త రిలీజ్ లు లేక ప్రేక్షకులు అల్లాడిపోతున్నారు.
కొత్త రిలీజ్ ఎప్పుడు ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూసే సెక్షన్ అభిమానులు కొందరున్నారు. వాళ్లతో పాటు ఆఫర్ ఇక్కడా కూడా వర్తించి ఉంటే థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ అయ్యేవి. పాత ధరలే తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండటంతో బుకింగ్స్ కూడా వీక్ గానే కనిపిస్తున్నాయి. సినిమా టాక్ ని బట్టి వెళ్దాంలే అన్న ఆలోచనలోనే చాలా మంది సినీ ప్రేక్షకులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.