ఎగ్జిబిటర్ల కోసం దేవుడే దిగి రావాలి!
అయితే తిరిగి థియేటర్లను తెరిపించాలంటే ఎలాంటి సినిమా రావాలి? అన్న చర్చా వేడెక్కిస్తోంది.
By: Tupaki Desk | 20 May 2024 3:21 PM GMTటాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఏడాదికి 400 సినిమాల్ని రిలీజ్ కి తెస్తున్నా కానీ థియేటర్లు నిండటం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బోసిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం మూడు నాలుగు సినిమాల రిలీజ్‌లతో థియేటర్ల కోసం కొట్లాడిన రోజులు ఉండేవి. కానీ ఈ వేసవి సెలవుల సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసి వేయడం విడ్డూరంగా మారింది. సరైన సినిమాల్లేక థియటర్లను మూసి వేస్తున్నామని ఎగ్జిబిటర్లు ఇంతకుముందు ప్రకటించారు. అయితే తిరిగి థియేటర్లను తెరిపించాలంటే ఎలాంటి సినిమా రావాలి? అన్న చర్చా వేడెక్కిస్తోంది.
నిజానికి ఎగ్జిబిటర్లలో ఉత్సాహం రావాలంటే సరైన భారీ చిత్రం విడుదలకు రావాల్సి ఉంటుంది. ఆ కోవలో చూస్తే సాధ్యమైనంత తొందరగా విడుదలకు వచ్చే భారీ చిత్రం ఏది? అంటే... భారతీయుడు 2 లేదా కల్కి 2898 AD మాత్రమేనని థియేటర్ యజమానులు భావిస్తున్నారట. ఆ రెండు సినిమాలకు ప్రజల్లో చాలా బజ్ ఉంది. శంకర్ - కమల్ హాసన్ ఫ్యాక్టర్ తో భారతీయుడు 2 భారీ ఓపెనింగులు సాధించే వీలుంది. శంకర్ ఫార్ములా వర్కవుటైతే భారతీయుడు 2 బంపర్ హిట్ అయ్యే ఛాన్సుంది. భారీ వీఎఫ్ఎక్స్ సహా విజువల్ గ్రాండియారిటీతో తెరకెక్కిన ఈ సినిమా కోసం లైకా- సన్ పిక్చర్స్ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది. అందువల్ల ప్రజలు భారతీయుడు 2 కోసం వేచి చూస్తున్నారు.
మరోవైపు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఎడి కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేసిన ఈ చిత్రం విజువల్ గా కొత్త లోకంలోకి తీసుకెళుతుందన్న ప్రచారం నడుమ ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. ఇది భారీ మల్టీస్టారర్. ప్రభాస్, దీపిక, అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరంతా ఒకరితో ఒకరు పోటీపడి నటించేవారే. దీనివల్ల కచ్ఛితంగా స్పెషల్ ట్రీట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు, అద్భుతమైన కాస్ట్యూమ్స్, భారీతనం నిండిన సెట్లలో పాటల్ని తెరకెక్కించడంతో విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించి, పాన్ ఇండియాలో విడుదల చేస్తోంది. ప్రజల్ని థియేట్లకు రిపీటెడ్ గా రప్పించే సత్తా ఉన్న సినిమాల కోసమే ఈ వెయిటింగ్. అంతగా క్రేజ్ లేని సినిమాలు వచ్చినా కానీ జనం థియేటర్ల వైపు అడుగులు వేయడం లేదు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా అంటూ ఇంట్లోనే బోలెడంత వినోదం లభిస్తున్నప్పుడు ఎగ్జిబిషన్ రంగం నిజంగా క్రైసిస్ లోకి వెళుతోందనే ఆందోళన ఎలానూ ఉంది.