ఆస్కార్ లైబ్రరీలో 'ది వ్యాక్సిన్ వార్'.. ఏలా?
ఆస్కార్ లైబ్రరీ ద్వారా 'అకాడెమీ కలెక్షన్స్'లో 'ది వ్యాక్సిన్ వార్' స్క్రిప్ట్‌ను ఆహ్వానించి, అంగీకరించినట్లు ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
By: Tupaki Desk | 12 Oct 2023 3:53 PM GMTకశ్మీర్ ఫైల్స్ ఫేమ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'ది వ్యాక్సిన్ వార్'. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓ ఘనతను అందుకుంది. ఆస్కార్ లైబ్రరీ ద్వారా 'అకాడెమీ కలెక్షన్స్'లో 'ది వ్యాక్సిన్ వార్' చోటు దక్కిందుకుంది.
వివరాళ్లోకి వెళితే.. ది కశ్మీర్ ఫైల్స్‌తో బాక్సాఫీసుకు సెన్సేషనల్ విజయాన్ని అందించారు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. దీంతో ఆయన తాజా చిత్రం ది వ్యాక్సిన్ వార్‌పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో నానా పటేకర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలలో నటించారు. రైమా సేన్, అనుపమ్ ఖేర్ , సప్తమి గౌడ, గిరిజా ఓక్ కూడా ఇతర సహాయక పాత్రల్లో నటించారు.
భారతీయ శాస్త్రవేత్తల నిజమైన కథ ఆధారంగా సినిమాను రూపొందించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఇండియన్ సైంటిస్ట్‌ల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అయితే సెప్టెంబర్ 28న రిలీజైన ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు.
కానీ ఈ చిత్రం ప్రశంసలను బాగా అందుకుంది. ప్రధానీ మోదీ కూడా రీసెంట్గా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం ఓ ఘనతను అందుకుంది. ఆస్కార్ లైబ్రరీ ద్వారా 'అకాడెమీ కలెక్షన్స్'లో 'ది వ్యాక్సిన్ వార్' స్క్రిప్ట్‌ను ఆహ్వానించి, అంగీకరించినట్లు ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సంతోషం కూడా వ్యక్తం చేశారు. 'ఇండియన్ సూపర్ హీరోల ఈ గొప్ప కథను చదవడానికి అందుబాటులో ఉంటడం నాకు సంతోషంగా ఉంది' అని వివేక్ రంజన్ రాసుకొచ్చారు.
ఇకపోతే ఈ వ్యాక్సిన్ వార్ సినిమాను జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా(అక్టోబర్ 13) రూ.99కే చూసేలా ఆఫర్‌ను ప్రకటించారు. కాగా, అభిషేక్ అగర్వాల్ నుంచి త్వరలోనే దిల్లీ ఫైల్స్ అనే సినిమా కూడా రాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో...