1000 కోట్ల సంపద సృష్టించిన క్రేజీ ఫ్రాంఛైజీ
దీనికి ఓటీటీ హక్కులు, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ అదనం. వీటన్నిటితో అతడు ఇప్పటికే 800 నుంచి 1000 కోట్లు ఆర్జించాడన్న చర్చ మీడియాలో ఉంది.
By: Tupaki Desk | 5 Dec 2023 4:35 AM GMTఒక్కో సినిమాకి 100 నుంచి 150కోట్ల బడ్జెట్లు పెట్టి, ఒకే ఫ్రాంచైజీలో ఇప్పటికి నాలుగు సినిమాలను నిర్మించాడు సదరు నిర్మాత. ఒక్కో సినిమాపై 250 కోట్లు పైగా బిజినెస్ చేసాడు. దీనికి ఓటీటీ హక్కులు, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ అదనం. వీటన్నిటితో అతడు ఇప్పటికే 800 నుంచి 1000 కోట్లు ఆర్జించాడన్న చర్చ మీడియాలో ఉంది. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో ఐదో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఫ్రాంఛైజీ - హౌస్ ఫుల్. భారతదేశంలో మొదటి కామిక్ ఫ్రాంచైజీ నిర్మాతగా సాజిద్ నడియావాలా పేరు మార్మోగింది. దీనిలో ఐదో భాగం - హౌస్ ఫుల్ 5 ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఖిలాడీ అక్షయ్ కుమార్ తో మనస్ఫర్థలను తొలగించుకుని సాజిద్ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాకి పెట్టుబడులు సమకూరుస్తున్నారని సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఏడాది జూన్‌లో తన హిట్ కామెడీ ఫ్రాంచైజీ 'హౌస్‌ఫుల్' ఐదవ భాగాన్ని ప్రకటించారు. తొలి రెండు భాగాలకు నిర్మాత సాజిద్ స్వయంగా దర్శకుడు కూడా. ఆ తర్వాత దర్శకులు మారుతూ వచ్చారు. ఇప్పుడు ఐదో చిత్రానికి తరుణ్ మన్సుఖాని దర్శకుడు. ముందుగా 2024 దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే వస్తుందని, 2025 జూన్ 6న విడుదల చేస్తామని మేకర్స్ ధృవీకరించారు. హౌస్‌ఫుల్ 5 వాయిదాకు కారణాలనే నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి టాప్ క్వాలిటీ VFX అవసరం. అందుకే వాయిదా వేసామని నిర్మాతలు తెలిపారు. డిసెంబరు 4 సోమవారం నాడు అక్షయ్ కుమార్, సాజిద్ నదియాడ్‌వాలా సంయుక్తంగా అధికారిక ప్రకటనను వెలువరించారు. ది హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీ.. భారీ విజయాన్ని కట్టబెట్టే ప్రేక్షకులకు రుణపడి ఉంది. హౌస్‌ఫుల్ 5కి అదే విధమైన ఆదరణ లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. మా బృందం పూర్తిగా మనస్సును కేంద్రీకరించి ఈ సినిమాని రూపొందించింది. అత్యున్నత స్థాయి విఎఫ్‌ఎక్స్‌ని డిమాండ్ చేసే కథనం ఉండటం వల్ల రిలీజ్ ఆలస్యమవుతోంది. గొప్ప సినిమా అనుభవంతో ఐదు రెట్లు వినోదాన్ని అందించడం కోసం మేము విడుదల కోసం మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. హౌస్‌ఫుల్ 5 ఇప్పుడు జూన్ 6, 2025న విడుదల కానుంది.. అని తెలిపారు.
హౌస్‌ఫుల్ మొదటి భాగం 2010 సంవత్సరంలో విడుదలైంది. ఇందులో అక్షయ్, రితీష్ దేశ్‌ముఖ్, లారా దత్తా, దీపికా పదుకొనే, అర్జున్ రాంపాల్, బోమన్ ఇరానీ నటించారు. దీని తర్వాత 2012 సంవత్సరంలో విడుదలైన మరో హిట్ సీక్వెల్ హౌస్‌ఫుల్ 2. ఇందులో అక్షయ్, రితీష్, జాన్ అబ్రహం, శ్రేయాస్ తల్పాడే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రిషి కపూర్, రణధీర్ కపూర్, మిథున్ చక్రవర్తి ,అసిన్ ఉన్నారు. ఈ రెండు భాగాలకు సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించాడు. మూడవ భాగంలో అక్షయ్, అభిషేక్ బచ్చన్, రితీష్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ, లీసా హేడన్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్ కనిపించారు. నాల్గవ భాగంలో అక్షయ్, రితీష్, బాబీ డియోల్, కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్బందా ప్రధాన పాత్రలు పోషించారు.
మరోవైపు ఖిలాడీ అక్షయ్ కుమార్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ముదస్సర్ అజీజ్ కామిక్ కేపర్ 'ఖేల్ ఖేల్ మే'లో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్'లోను తన అతిధి పాత్రను పూర్తి చేసాడు. తదుపరిది ఉడాన్ తర్వాత 'బడే మియాన్ చోటే మియాన్'... స్కై ఫోర్స్ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.