హిందీ మార్కెట్లో శేష్- నిఖిల్-తేజ సజ్జా
అదే బాటలో వెళుతూ యువహీరోలు అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జా కూడా హిందీ మార్కెట్లో ఆశించిన విజయాల్ని అందుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
By: Tupaki Desk | 27 Jan 2024 3:34 AM GMTతెలుగు సినిమా పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలుగుతోంది. మన యువహీరోలు హిందీ మార్కెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే హిందీ వసూళ్లలో తమదైన మార్క్ వేసారు. అదే బాటలో వెళుతూ యువహీరోలు అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జా కూడా హిందీ మార్కెట్లో ఆశించిన విజయాల్ని అందుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
అడివి శేష్ కథానాయకుడిగా నటించిన 'మేజర్' పాన్ ఇండియాలో విడుదలై అద్భుత వసూళ్లను సాధించింది. ఈ సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి హిందీ నుంచి సుమారు 12 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. తెలుగు అగ్ర హీరోలకు మాత్రమే హిందీ మార్కెట్ పరిమితం కాదని మేజర్ తో ప్రూవ్ అయింది.
అలాగే నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 హిందీ బెల్ట్ లో అద్బుత విజయం సాధించింది. ఈ సినిమా సుమారు 20 కోట్లు (ఇండియా వైడ్ 26కోట్లు) వసూలు చేయగా, ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన- హనుమాన్ ఆల్మోస్ట్ ఇంతకు డబుల్ వసూలు చేసింది. హనుమాన్ చిత్రం 40 కోట్లు వసూలు చేసి బలమైన కలెక్షన్లతో ముందుకు వెళుతోంది. ఈ సినిమా హిందీ బెల్ట్ లో 50 కోట్లు వసూలు చేయనుందని అంచనా. అంటే మేజర్, కార్తికేయ 2 తరహాలోనే ప్రశాంత్ వర్మ కంటెంట్ కి యూనివర్శల్ అప్పీల్ ఉందని ప్రూవ్ అయింది.
తదుపరి గూఢచారి 2 సహా వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు అడివి శేష్. అతడి సినిమాలకు హిందీ మార్కెట్లో గిరాకీ నమ్మకం పెంచింది. అలాగే నాగచైతన్య - చందు మొండేటి కాంబినేషన్ మూవీ తండేల్ కి హిందీ మార్కెట్ లో హైప్ ఉంటుంది. కార్తికేయ 2 దర్శకుడి నుంచి వస్తున్న సినిమాగా తండేల్ కి గిరాకీ ఉంటుంది. 'లాల్ సింగ్ చడ్డా' ఫెయిలైనా కానీ చైతూ హిందీలో రాణించేందుకు తన ప్రయత్నాల్లో తాను ఉన్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో తేజ సజ్జాకు మరింత ఇమేజ్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ యువహీరో తెలుగు మార్కెట్ తో పాటు ఇరుగు పొరుగు మార్కెట్లలోను రాణించే వీలుంది.