వినాయక చవితికి ఆ ముగ్గురు.. విన్నర్ ఎవరో?
ఈసారి మూడు చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే నెలకొన్నట్లు కనిపిస్తోంది. అవేంటంటే?
By: Tupaki Desk | 7 July 2024 7:58 AM GMTపండుగలకు సినిమాలకు మంచి కనెక్షన్ ఉన్న విషయం తెలిసిందే. ఒకచోట చేరే కుటుంబ సభ్యులంతా.. పండుగను జరుపుకున్న తర్వాత కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. విద్యార్థులు కూడా హాలీడేస్ వస్తాయి కనుక మూవీస్ ను కవర్ చేయాలనుకుంటారు. అయితే బాక్సాఫీస్ వద్ద పండుగల్లో సంక్రాంతిదే తొలి స్థానమన్న విషయం తెలిసిందే. హీరోలతోపాటు దర్శక నిర్మాతలు.. అప్పుడే తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకుంటారు.
ఆ తర్వాత దసరాకు కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దీపావళికి ఒక్కరోజే సెలవు ఉంటుందని కనుక.. సందడి నార్మలే. అయితే కొన్నేళ్లుగా వినాయక చవితికి క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. గత ఏడాది మాత్రం కేవలం అప్డేట్స్ కే పరిమితం కాగా.. ఈసారి మూడు చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే నెలకొన్నట్లు కనిపిస్తోంది. అవేంటంటే?
వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీ కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమాతో 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ వంటి అనేక మంది ప్రమఖులు నటిస్తున్నారు. మూవీపై అన్ని భాషల్లో మంచి హైప్ నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ మూవీ థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్.. సుందరకాండ మూవీతో సెప్టెంబర్ 6వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. వృతి వాఘని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. త్వరలోనే సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ రానుందని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ కూడా వినాయక చవితి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ అయింది. సాంగ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్నాయి. సెప్టెంబర్ 27న తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించినా.. 7వ తేదీనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడింటిలో గణేష్ చతుర్థి విన్నర్ ఎవరో చూడాలి.