Begin typing your search above and press return to search.

టాక్ బాగున్న టికెట్స్ తెగడం లేదా

ఈ ఏడాది టాలీవుడ్ కి ఏ మాత్రం కలిసి రావడం లేదనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:01 AM GMT
టాక్ బాగున్న టికెట్స్ తెగడం లేదా
X

ఈ ఏడాది టాలీవుడ్ కి ఏ మాత్రం కలిసి రావడం లేదనే మాట వినిపిస్తోంది. 2024లో అర్ధ సంవత్సరం పూర్తవుతున్న కూడా కనీసం అరడజను సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ లు కాలేదు. ఈ ఆరు నెలల కాలంలో 100కి పైగా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు బాగున్నాయనే టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు. వీకెండ్ మూడు రోజులు మాత్రమే ఎంతో కొంత స్థాయిలో టికెట్స్ తెగుతున్నాయి.

వీకెండ్ పూర్తయ్యాక మేగ్జిమమ్ థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. గత నెల రిలీజ్ అయిన సినిమాలలో ఏదీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేదు. గత వారం రిలీజ్ అయిన మనమే సినిమా బాగుందనే టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ అండ్ యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ కి రావడం లేదంట. దీంతో ఇప్పటికి మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోలేదు. ఇక సత్యభామ మూవీ మూడు రోజుల్లోనే తేలిపోయింది.

ఈ వారం సుధీర్ బాబు హరోం హర సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి డబ్బింగ్ మూవీ మహారాజాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే థియేటర్స్ మాత్రం నిండలేదు. మౌత్ టాక్ తో మహారాజా సినిమాకి ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. హరోం హర చిత్రాన్ని సుధీర్ బాబు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో చేశారు. కానీ మొదటి రోజు కలెక్షన్స్ పెద్దగా రాలేదు.

జూన్ 27న ప్రభాస్ కల్కి మూవీ గ్రాండ్ స్కేల్ పై రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసమే ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మీడియం, లోబడ్జెట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాక తీరిగ్గా ఇంట్లో కూర్చొని వీక్షిస్తున్నారు. కల్కి 2898ఏడీ లాంటి పెద్ద సినిమాలు వచ్చినపుడు మాత్రమే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి మొగ్గు చూపిస్తున్నారు. లేదంటే కంటెంట్ బాగుందనే మౌత్ టాక్ వస్తే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి.

దీనికి నిదర్శనమే ప్రేమలు లాంటి డబ్బింగ్ మూవీ తెలుగులో హిట్ కావడం. ఒక వేళ మహారాజా క్లిక్ అయితే మాత్రం తెలుగు హీరోలు కూడా భవిష్యత్తులో తమ కథల ఎంపిక మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పటి వరకైతే గడ్డుకాలమే నడిచింది. ఇకపై ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతోంది కాబట్టి థియేటర్స్ లో కొంత సందడి ఉండొచ్చనేది సినీ విశ్లేషకుల మాట.