టైగర్ 3 పరాజయంలో నగ్నసత్యం
చివరికి సల్మాన్ టైగర్ 3 ఆశించిన విజయం అందుకోలేదు. కలెక్షన్లలో చిత్ర పరిశ్రమను, అభిమానులను ఆశ్చర్యపరిచింది
By: Tupaki Desk | 19 Nov 2023 12:30 PM GMTయష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో 'టైగర్ 3' బాక్సాఫీస్ ఫలితం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కింగ్ ఖాన్ బ్యాక్-టు-బ్యాక్ వెయ్యి కోట్ల గ్రాసర్స్ తో సంచలనాలు సృష్టిస్తే, అతడికి ధీటుగా సల్మాన్ భాయ్ కూడా బాక్సాఫీస్ ని ఢీకొంటాడని భావించారు. SRK కి గట్టి పోటీని ఇచ్చే ఇతర స్టార్ ఎవరైనా ఉన్నట్లయితే అది సల్మాన్ ఖాన్ అని భావించారు. దానికి తగ్గట్టే టైగర్ 3కి అవసరమైన అన్న హంగులు ఉన్నాయి. భారీ బడ్జెట్, అతిపెద్ద నిర్మాణ సంస్థ, హైప్ ఉన్న గూఢచారి విశ్వం, అద్భుత తారాగణం, పండుగ సీజన్ విడుదల ఇవన్నీ టైగర్ 3ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయని భావించారు. షారుఖ్ ఖాన్ -హృతిక్ రోషన్ అతిధి పాత్రలు మరింత అదనపు బూస్ట్ ని ఇస్తాయని కూడా అనుకున్నారు. కానీ టైగర్ 3 మంచి ప్రారంభం .. మంచి రెండవ రోజు తర్వాత అనూహ్యంగా కలెక్షన్స్ పడిపోయాయని ట్రేడ్ చెప్పింది. టైగర్ 3 ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కొన ఊపిరితో ఉందన్న టాక్ వినిపిస్తోంది.
చివరికి సల్మాన్ టైగర్ 3 ఆశించిన విజయం అందుకోలేదు. కలెక్షన్లలో చిత్ర పరిశ్రమను, అభిమానులను ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. లక్ష్మీ పూజ, వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వంటి వాటి ప్రభావం కూడా టైగర్ 3 పై పడిందని విశ్లేషిస్తున్నారు. అయితే టైగర్ 3 పరాజయానికి మూల కారణం ఏమిటన్నది ట్రేడ్ మరింత డెప్త్ తో విశ్లేషిస్తోంది. ఇందులో టైగర్ (కథానాయకుడు)ని పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా చిత్రీకరించడం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దేశం కోసం పని చేసే ఒక స్పై ఏజెంట్ పాక్ అనుకూల వ్యక్తి ఎలా అవుతాడు? అన్నది లాజిక్ కి అందలేదని చెబుతున్నారు. ఒక రకంగా ఇది రచయితల వైఫల్యంగా కూడా భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. YRF సంస్థ సరిగా ప్రచారం, మార్కెటింగ్ ప్రయత్నం చేయకపోవడం ఫెయిల్యూర్ లో ఒక కారణం. టైగర్ 3 స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా ఫెయిల్యూర్ అని విశ్లేషిస్తున్నారు.
బాక్సాఫీస్‌పై క్రికెట్ మ్యాచ్‌ల ప్రభావం స్పష్ఠంగా ఉంది. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ మ్యాచ్ కోసం ఆడియెన్ ఆసక్తిగా ఉండడంతో ఈరోజు వసూళ్లు సందేహంగా మారాయి. ప్రారంభ వారాంతంలో స్క్రీనింగ్ కెపాసిటీ ఓవర్‌లోడ్ అయిపోవడం వల్ల వసూళ్లు తగ్గుముఖం పట్టాయని ప్రముఖ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ స్థాయి సినిమా కాదు ఇది. రాబోవు రెండు వారాంతాల్లో ఎటువంటి పోటీ లేకుండా టైగర్ 3 బెంచ్‌మార్క్‌ను చేరుకోగలదా? అన్నది సందిగ్ధంగా ఉందని విశ్లేషిస్తున్నారు.
300 కోట్లు లోపే వసూళ్లు:
ఇండియాలో ఇప్పటి వరకు 200 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన టైగర్ 3 సినిమా 280 కోట్ల లోపే వసూలు చేస్తుంది. టైగర్ 3 రేంజ్ 2017లో విడుదలైన టైగర్ జిందా హై కంటే కూడా 60 కోట్ల తక్కువ వసూల్ చేస్తుంది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం కలెక్షన్స్ దారుణం. ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల డాలర్ల కంటే తక్కువగా వసూలు చేస్తుంది. ప్రపంచ కప్ ఫీవర్ వసూళ్లను దెబ్బతీసింది. సల్మాన్ ఖాన్ గత 6 సంవత్సరాలుగా చేస్తున్న చెత్త సినిమాల కారణంగా కాస్త క్రేజ్ కోల్పోయాడు. టైగర్ 3లో పేలవమైన స్క్రిప్ట్, బోరింగ్ కథనం పెద్ద మైనస్ గా మారింది.
షారుక్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో నంబర్ వన్ అని మరోసారి రుజువైంది. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది మళ్లీ షారుఖ్ ఖాన్‌తో మాత్రమే పోటీ పడబోతున్నాడు. పఠాన్- జవాన్ విజయాల తర్వాత రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన డుంకీ డిసెంబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఖాన్ కలలు గంటున్నాడు.