Begin typing your search above and press return to search.

'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమా చుట్టూ వింత వాద‌న

సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిపోయిన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తీదీ వివాద‌మే అవుతోంది. ప్ర‌తిదీ సున్నిత అంశంగా చిత్రీక‌రించ‌బ‌డుతోంది

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:56 AM GMT
టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా చుట్టూ వింత వాద‌న
X

సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిపోయిన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తీదీ వివాద‌మే అవుతోంది. ప్ర‌తిదీ సున్నిత అంశంగా చిత్రీక‌రించ‌బ‌డుతోంది. దీంతో ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా బూత‌ద్దంలో చూపిస్తూ కోర్టుల వ‌ర‌కు వెళుతున్నారు. ఎదుటి వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. ఇది ఇప్పుడు నిత్య కృత్యంగా మారుతోంది. ఇలాంటి లాజిక్‌లు లేని ఓ అంశం కార‌ణంగానే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ర‌వితేజ హీరోగా స్టువ‌ర్ట్ పురం గ‌జ‌దొంగ‌గా పేరున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు క‌థ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. అప్పుడెప్పుడో జ‌రిగిన కథ‌ని ఇప్ప‌టి జ‌నాల‌కు తెలియ‌జెప్పాల‌నే ఉద్దేశ్యంతో మేక‌ర్స్ ఈ సినిమా చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌లోని డైలాగ్‌లు ఒక ఊరి వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేవిగా ఉన్నాయ‌ని వివాదం మొద‌లైంది. ఎరుక‌ల వ‌ర్గాన్ని కించ‌ప‌రిచే విధంగా ఈ సినిమా ఉంద‌ని ఓ వ్య‌క్తి ఏకంగా హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశాడు. దాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఏపీ హై కోర్టు చిత్ర బృందాన్ని మంద‌లించింది.

ఇలాంటి సినిమాల‌తో స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌నుకుంటున్నార‌ని ఫైర్ అయింది. సెప్టెంబ‌ర్ 27 త‌దుప‌రి విచార‌ణ చేప‌డ‌తామ‌ని, ఆలోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇండ‌స్ట్రీలో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో స్టువ‌ర్టు పురం పేరుతో రెండు సినిమాలొచ్చాయి. ఒక‌టి చిరంజీవి న‌టించి 'స్టువ‌ర్టు పురం పోలీస్టేష‌న్‌'. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ క‌థ అందించ‌డ‌మే కాకుండా దీనికి ద‌ర్శ‌కుడు కూడా ఆయ‌నే. ఈ సినిమా చిరు కెరీర్‌లో డిజాస్ట‌ర్ అనిపించుకుంది.

అదే స‌మ‌యంలో వ‌చ్చిన మ‌రో సినిమా 'స్టువ‌ర్టు పురం దొంగ‌లు'. భాను చంద‌ర్ హీరోగా న‌టించిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. అప్పుడు ఎవ‌రూ ఈ సినిమాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌లేదు. కోర్టుల దాకా వెళ్ల‌లేదు. కానీ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పై మాత్రం వింత వాద‌న‌లు వినిపిస్తూ కోర్టుల‌ని ఆశ్ర‌యించ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీజ‌ర్‌ని యూట్యూబ్ కోసం సెన్సార్ చేయాల‌ని, అలా చేయ‌కుండా ఎలా రిలీజ్ చేస్తార‌ని కోర్టు వివ‌ర‌ణ‌పై నిర్మాత ఎలా స్పందిస్తారో..'టైగ‌ర్‌' ప‌రిస్థితి ఎలా ఉంటుందో.. టీజ‌ర్ వివాదంగా మారితే ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే ప‌రిస్థితి ఇంకేలా ఉంటుందో అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.