మూవీ రివ్యూ : టైగర్ నాగేశ్వరరావు
By: Tupaki Desk | 20 Oct 2023 8:02 AM GMT'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రివ్యూ
నటీనటులు: రవితేజ-నుపుర్ సనన్-గాయత్రి భరద్వాజ్-హరీష్ పేరడి-జిషు సేన్ గుప్తా-నాజర్-రేణు దేశాయ్-అనుపమ్ ఖేర్-మురళీ శర్మ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: మదీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
రచన-దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
70వ దశకంలో ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. టైగర్ నాగేశ్వరరావు. మాస్ రాజా రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దసరా కానుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
దొంగతనాలకు ప్రసిద్ధి చెందిన స్టువర్టుపురంలో ఎనిమిదేళ్ల వయసులోనే ఒక దొంగతనం చేసే క్రమంలో తండ్రినే చంపిన నాగేశ్వరరావు.. యుక్త వయసు వచ్చేసరికి గజదొంగగా మారతాడు. భారీ దొంగతనాలతో తమకు సవాలుగా మారిన నాగేశ్వరరావును పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించవు. చివరికి ఒక భారీ దొంగతనం కేసులో పోలీసులు అతణ్ని మద్రాస్ జైల్లో పెడితే.. అక్కడ్నుంచి కూడా తప్పించుకుంటాడు. టైగర్ నాగేశ్వరరావు గురించి ఒక దశలో ప్రధానమంత్రి భద్రతాధికారి సైతం కంగారు పడే పరిస్థితి వస్తుంది. అతను నాగేశ్వరరావు గురించి తెలుసుకోవడానికి స్టువర్టుపురం వస్తాడు. అక్కడ నాగేశ్వరరావులో తెలియని కోణాలన్నీ బయటపడతాయి. ఆ కోణాలేంటి.. అసలు నాగేశ్వరరావు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు.. దోచుకున్న డబ్బంతా ఏం చేస్తున్నాడు.. చివరికి నాగేశ్వరావు ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
మామూలు చిత్రాలతో పోలిస్తే బయోపిక్స్ తీయడం ఒక సవాల్. ఒక గొప్ప వ్యక్తి కావచ్చు.. ఒక చెడ్డ వ్యక్తి కావచ్చు.. ఏదైనా సంచలనం రేపిన వ్యక్తి కావచ్చు.. వాళ్ల జీవితాలను ఉన్నదున్నట్లుగా తెరపైకి తీసుకొస్తే డ్రామా పండకపోవచ్చు. ఎందుకంటే 2-3 గంటల నిడివితో తీసే సినిమాలకు అవసరమైనంత డ్రామా.. నిజ జీవితాల్లో ఉండదు. అలాంటపుడు వాస్తవంగా జరిగిన ఘటనలకు కొంచెం మసాలా అద్దే ప్రయత్నం చేస్తుంటారు ఫిలిం మేకర్స్. ఇలా కొంతమేర స్వేచ్ఛ తీసుకుంటే ప్రేక్షకులు కూడా సర్దుకుంటారు. కానీ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేందుకు ఎగ్జాజరేషన్లు.. గ్లోరిఫికేషన్లు ఎక్కువైతేనే ప్రమాదం. అప్పుడది బయోపిక్ అంటే నమ్మబుద్ధి కాదు. 'సైరా' లాంటి సినిమాలు అసంతృప్తి మిగల్చడానికి అవి ఏమాత్రం వాస్తవ కథల్లా అనిపించకపోవడమే కారణం. 'టైగర్ నాగేశ్వరరావు' కూడా దాదాపుగా ఆ కోవకు చెందినదే. గజదొంగ నాగేశ్వరరావును.. 'టైగర్'గా ఎలివేట్ చేసే క్రమంలో ఎగ్జాజరేషన్లు హద్దులు దాటిపోయాయి. అలాగే నాగేశ్వరరావు చేసిన ప్రతి పనికీ జస్టిఫికేషన్ ఇవ్వాలని చూసే క్రమంలో దీన్ని వాస్తవ గాథగా ఎంతమాత్రం అంగీకరించే పరిస్థితి కనిపించదు. ఒక దశ వరకు ఎగ్జైటింగ్ గా అనిపించే 'టైగర్ నాగేశ్వరరావు'.. తర్వాత ఈ ఎగ్జాజరేషన్లు.. జస్టిఫికేషన్లు.. హద్దులు దాటిన వయొలెన్స్.. సుదీర్ఘ నిడివి వల్ల ట్రాక్ తప్పి అంతిమంగా ప్రేక్షకులకు మిశ్రమానుభూతిని కలిగిస్తుంది.
'టైగర్ నాగేశ్వరరావు' ద్వితీయార్ధంలో వచ్చే ఒక ఎపిసోడ్లో హీరో వీర విధ్వంసం చేస్తాడు. కత్తి పట్టి.. కాళ్లు.. చేతులు.. తలలు తెంచుకుంటూ వెళ్లిపోతాడు. ఒక రౌడీ మీదికి కత్తితో దూసుకెళ్తే.. శరీర భాగాలు ఎగిరి చెల్లాచెదురుగా పడతాయి. ఈ రోజుల్లో బోయపాటి శ్రీను తీసే ఊర మాస్ సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు పెడితేనే ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అలాంటిది ఒక బయోపిక్ లో ఇలాంటి సీన్ పెట్టి ఎలా జస్టిఫై చేయొచ్చని దర్శకుడు అనుకున్నాడో మరి. విడిగా చూస్తే ఈ సన్నివేశం మాస్ ప్రేక్షకులను అలరించవచ్చు. కానీ 'టైగర్ నాగేశ్వరరావు'లో మాత్రం అది సింక్ కాలేదు. యాక్షన్ సీక్వెన్స్ అనే కాక ఇలాంటి ఓవర్ ద టాప్ సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి. ఒక కల్పిత కథలో ఇలాంటి సీన్లు ఎన్ని పెట్టినా ఓకే కానీ.. వాస్తవ కథలో అవి ఇమడలేదు. అదే 'టైగర్ నాగేశ్వరరావు'కు పెద్ద సమస్యగా మారింది.
'టైగర్ నాగేశ్వరరావు'లో మంచి మూమెంట్స్ లేవని కావు. ఆరంభ సన్నివేశాలు.. ఒక దశ వరకు కథను నడిపించిన తీరు చూస్తే ప్రామిసింగ్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. స్టువర్టుపురం దొంగలకు అడ్డాగా మారడం వెనుక ఉన్న నేపథ్యం.. అలాగే టైగర్ నాగేశ్వరావు ఎలా గజదొంగ అయ్యాడు అనే విషయాలను ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. నాగేశ్వరరావు చేసిన తొలి హత్య తండ్రిదే.. అది కూడా ఎనిమిదేళ్ల వయసులో అంటూ అతనెంత క్రూరుడో చూపించే సన్నివేశం ఆ పాత్రకు బలమైన పునాది వేస్తుంది. ఇక రైలు దోపిడీతో హీరోను పరిచయం చేసే సన్నివేశం కూడా ఆ పాత్రకు మంచి ఎలివేషనే ఇస్తుంది. నాగేశ్వరరావు ఎదుగుదలను కూడా బాగానే చూపించారు. అసాధ్యం అనుకున్న పనులను నాగేశ్వరరావు ఎలా చేశాడా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఒక్కో ఎపిసోడ్ ను ఆసక్తిగా తిలకిస్తారు. హీరో పాత్రలో గ్రే షేడ్స్ ఒక రియలిస్టిక్ మూవీ చూస్తున్న భావన కలిగిస్తాయి. ఇక నాగేశ్వరరావు పేరు వెనుక 'టైగర్' ఎలా చేరిందో చూపిస్తూ తీసిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.
ప్రథమార్ధం అయ్యేసరికి 'టైగర్' మంచి హై ఇస్తాడు. కానీ ఇదే టెంపోలో సెకండాఫ్ కూడా నడిస్తే సినిమా ఒక స్థాయిలో నిలబడేది.
కానీ ద్వితీయార్ధంలో హీరోను ఎలివేట్ చేయడానికి పడ్డ అనవసర ప్రయాస.. ఓవర్ ద టాప్ సీన్లు.. విపరీతమైన సాగతీత 'టైగర్ నాగేశ్వరరావు' గ్రాఫ్ ను తగ్గిస్తూ వెళ్లాయి. పనిగట్టుకుని నాగేశ్వరరావును ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే సినిమాకు అతి పెద్ద మైనస్ గా మారింది. నాగేశ్వరరావు చేసిన హత్యలు.. అతను చేసిన దొంగతనాలు అన్నింటినీ జస్టిఫై చేయడం సహేతుకంగా అనిపించదు. నాగేశ్వరరావులో కొంచెం మంచి కూడా ఉంది అంటూ మరో కోణం చూపిస్తే ఓకే కానీ.. మొత్తంగా అతనో మహాత్ముడు అన్నట్లు చూపించడం విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రధానమంత్రి ఇంట్లోకి జొరబడి తాను అనుకున్నది చేయడమే అతి అంటే.. చివరికి ప్రధాని పాత్రతోనే అతడికి ఎలివేషన్ ఇప్పించడం అన్నది టూమచ్. ఈ సన్నివేశాలు చూశాక 'టైగర్ నాగేశ్వరరావు'ను ఒక వాస్తవ గాథలా అనుకోవడానికి అవకాశమే లేదు. ద్వితీయార్ధంలో మితిమీరిన హింస.. అనవసర సీన్ల కారణంగా సాగతీత కూడా సినిమాకు ప్రతికూలంగా మారాయి. సినిమాకు 'గ్లామర్' జోడించడం కోసం పెట్టిన రెండు హీరోయిన్ క్యారెక్టర్లు.. వాటితో లవ్ స్టోరీలు కూడా 'టైగర్' ఫ్లోను దెబ్బ తీశాయే తప్ప ప్లస్ కాలేకపోయాయి. ఒక మంచి సినిమా అవడానికి బలమైన పునాది వేసుకున్నప్పటికీ.. మధ్య దశ నుంచి కథను సరిగా ముందుకు నడిపించలేక.. సరైన ముగింపు ఇవ్వలేక 'టైగర్'ను చేజేతులా దెబ్బ తీసుకున్నట్లయింది.
నటీనటులు:
రవితేజ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకటనడంలో సందేహం లేదు. ఈ పాత్రలో మాస్ రాజా బలమైన ముద్ర వేశాడు. చాన్నాళ్ల తర్వాత రవితేజ నుంచి ఒక ఇంటెన్స్ పెర్ఫామెన్స్ చూడొచ్చిందులో. నాగేశ్వరరావు రూపంతో రవితేజకు పోలిక లేకపోయినా.. తన పెర్ఫామెన్స్ తో ఆ పాత్రలో తనను చూసి ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చేయగలిగాడు. మాస్ రాజా పెర్ఫామెన్స్ కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. హీరోయిన్లలో నుపుర్ సనన్ తేలిపోయింది. ఆమె పాత్ర.. తన అప్పీయరెన్స్ ఈ సినిమాకు సూట్ కాలేదు. మరో హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ పర్వాలేదు. తన పాత్ర కూడా ఏమంత గొప్పగా లేదు. నాజర్ నటనలో రాణించాడు కానీ.. తన గెటప్ తేలిపోయింది. హరీష్ పేరడి కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. జిషు సేన్ గుప్తా బాగా చేశాడు. హీరో పక్కనే ఉండే 'కేరాఫ్ కంచరపాలెం' నటుడు ఆకట్టుకున్నాడు. అనుపమ్ ఖేర్.. మురళీ శర్మ తమ పాత్రలు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడంటే నమ్మబుద్ధి కాదు. తన పాటలు అంత సాధారణంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. మదీ ఛాయాగ్రహణం బాగుంది. 70వ దశకంలో నడిచే కథకు తగ్గట్లుగా విజువల్స్ అందించాడు. ఆర్ట్ వర్క్ బాగుంది. కానీ నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు. కొన్ని సీన్లు గ్రాండ్ గానే తీశారు కానీ.. సినిమా మొత్తం ఆ క్వాలిటీ కన్సిస్టెన్సీ లేకపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ ముడిపడ్డ సీన్లు తీవ్రంగా నిరాశపరుస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ వంశీ ఎంతో కష్టపడ్డ విషయం తెరపై కనిపిస్తుంది. కాకపోతే బయోపిక్ తీయడంలో నైపుణ్యం ప్రదర్శించలేకపోయాడు. ఈ కథను రియలిస్టిగ్గా తీయాలా.. కమర్షియల్ సినిమాలా మలచాలా అన్న మీమాంసలో సినిమాను ఎటూ కాకుండా తయారు చేశాడు. ఆరంభంలో చూపించిన ఇంటెన్సిటీని అతను చివరి వరకు కొనసాగించి ఉంటే 'టైగర్ నాగేశ్వరరావు' తన కెరీర్ కు గొప్ప మలుపు అయ్యుండేది.
చివరగా: టైగర్ నాగేశ్వరరావు.. పైకి లేచి కింద పడ్డాడు
రేటింగ్- 2.25
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater