ప్రభాస్ 'వర్షం'.. హిందీలో నాలుగోసారి!
ప్రొడక్షన్ హౌస్ సమాచారం ప్రకారం.. బాఘీ 4 ప్లానింగ్ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
By: Tupaki Desk | 30 July 2024 12:30 AM GMTఒకే అమ్మాయిని ప్రేమించే హీరో - విలన్ మధ్య బిగ్ ఫైట్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో దర్శకుడు శోభన్ తెరకెక్కించిన 'వర్షం' ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది తెలుగు సినిమా స్క్రీన్ ప్లే ఫార్మాట్‌లలో అత్యుత్తమ పంథాలో రూపొందిన క్లాసిక్. పరుచూరి బ్రదర్స్, వీరూ కే వంటి పలువురు రచయితలు ఈ సినిమా కోసం పని చేసారు. ప్రభాస్- త్రిష మధ్య లవ్ కెమిస్ట్రీని వర్కవుట్ చేయడంలో దర్శకుడు శోభన్ పెద్ద సక్సెసయ్యారు. దేవీశ్రీ మ్యూజిక్ ప్రధాన అస్సెట్ గా నిలిచింది.
అదంతా అటుంచితే 'వర్షం' స్ఫూర్తితో రూపొందించిన 'భాఘీ' (పాక్షిక రీమేక్) కూడా హిందీ చిత్రసీమలో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాఘీ అంటే రెబల్ అని అర్థం. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ - శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. సుధీర్ బాబు అతని హిందీ అరంగేట్రం చేయగా, సునీల్ గ్రోవర్ సహాయక పాత్రలో నటించారు. దీనికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 2016 లో ఈ హిందీ భాషా యాక్షన్ థ్రిల్లర్ విడుదలైంది. నదియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. బాఘీ 29 ఏప్రిల్ 2016న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.129 కోట్లు వసూలు చేసింది. తరువాత బాఘీ 2 (2018), బాఘీ 3 (2020) పేరుతో రెండు సీక్వెల్‌లను రూపొందించారు. తద్వారా బాఘీ ఫిల్మ్ సిరీస్ ప్రజల హృదయాల్లో నిలిచింది.
తాజా సమాచారం మేరకు టైగర్ ష్రాఫ్ నాలుగు సంవత్సరాల విరామం బాఘీ ఫ్రాంచైజీ నాల్గవ భాగంలో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడని తెలిసింది. హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ టోన్డ్ ఫిజిక్, మార్షల్ ఆర్ట్స్ స్కిల్ మైమరిపిస్తాయని అంచనా వేస్తున్నారు. బాఘీ 4 కూడా ఈ ఫ్రాంఛైజీలో అత్యుత్తమ ఫలితం అందుకుంటుందని భావిస్తున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి, దక్షిణ భారత దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్‌లో కొనసాగుతున్న ధోరణికి ఇది కొనసాగింపు. దక్షిణాది ప్రతిభపై వారి నమ్మకానికి ఇది సూచిక.
ప్రొడక్షన్ హౌస్ సమాచారం ప్రకారం.. బాఘీ 4 ప్లానింగ్ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అయితే సికందర్, హౌస్‌ఫుల్ 5 చిత్రాల సహా నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా ఫ్లెక్సిబిలిటీపై ఈ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది. సికందర్ చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. హౌస్‌ఫుల్ 5 త్వరలో చిత్రీకరణకు వెళుతుంది. ఇంతలోనే బాఘీ 4 అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనేది తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
భాఘి ఫ్రాంఛైజీలో పార్ట్ 1 కి సబ్బీర్ ఖాన్, 2,3 భాగాలకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఒక దక్షిణాది దర్శకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల పాన్ ఇండియాలో అప్పీల్ ఉంటుందని భావిస్తున్నారు. దర్శకుడిని నిర్ధారించిన తర్వాత, కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక గురించి వెల్లడిస్తారు. నటీనటుల ఎంపికల ప్రక్రియ గురించి వెల్లడవుతుంది.