Begin typing your search above and press return to search.

సెకండ్ గ్రేడ్ న‌టి.. స్టార్ హీరోయిన్‌పై నాయ‌కుడి ర‌చ్చ‌

ఇటీవల జరిగిన ఐఫా- 2025 ఉత్స‌వాల‌ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు శూన్య‌మ‌ని కూడా కాంగ్రెస్ నాయకుడు తికారం జుల్లీ విమ‌ర్శించారు.

By:  Tupaki Desk   |   14 March 2025 11:59 AM IST
సెకండ్ గ్రేడ్ న‌టి.. స్టార్ హీరోయిన్‌పై నాయ‌కుడి ర‌చ్చ‌
X

హిందీ చిత్ర‌సీమ చ‌రిత్ర‌లోని అత్యుత్త‌మ న‌టీమ‌ణుల జాబితాలో మాధురి ధీక్షిత్ పేరు జాబితాలో ఎప్పుడూ అగ్ర స్థానంలో ఉంటుంది. దాదాపు 70 పైగా హిందీ సినిమాల్లో న‌టించిన మాధురి మేటి క‌థానాయిక‌గా, అభిన‌య‌నేత్రిగా దేశ‌వ్యాప్తంగా అసాధార‌ణ అభిమానుల‌ను సంపాదించారు. అద్భుత‌మైన న‌ర్త‌కిగాను మాధురికి గొప్ప గౌర‌వం ఉంది.

అలాంటి గొప్ప‌ న‌టి, న‌ర్త‌కిని `సెకండ్ గ్రేడ్ యాక్ట‌ర్!` అంటూ తీసిపారేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. బాలీవుడ్ నటి మాధురి ధీక్షిత్ `సెకండ్ గ్రేడ్ యాక్టర్` అని కామెంట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తికారం జుల్లీ గురువారం వివాదానికి కేంద్రబిందువుగా నిలిచారు. రాజస్థాన్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాధురికి ప్ర‌ధానమైన సినిమాల్లో క‌థానాయిక‌గా ఆఫ‌ర్లు రావడం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన ఐఫా- 2025 ఉత్స‌వాల‌ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు శూన్య‌మ‌ని కూడా కాంగ్రెస్ నాయకుడు తికారం జుల్లీ విమ‌ర్శించారు. ఈ ఉత్స‌వాల వ‌ల్ల‌ ప్రభుత్వం ఖర్చులను న‌ష్ట‌పోయింద‌ని అన్నారు. ఐఫా పేరుతో రూ.100 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. క‌నీసం హోర్డింగ్‌లను చూసినా.. అది రాజస్థాన్‌కు ప్ర‌మోష‌న్ కాదు.. ఐఫా ప్రమోషన్ మాత్రమే. ఐఫాతో రాజస్థాన్‌కు ఏం ల‌భించింది? ఈ కార్యక్రమానికి హాజరైన తారలు రాష్ట్రంలోని ఏ పర్యాటక ప్రదేశాలను సందర్శించలేదు! అని జుల్లీ వ్యాఖ్యానించార‌ని టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

ఐఫా- 2025 ఉత్స‌వాల‌కు పరిశ్రమ నుండి ఏ పెద్ద స్టార్ వ‌చ్చారు? షారుఖ్ ఖాన్ తప్ప మిగతా వారంతా సెకండ్ గ్రేడ్ స్టార్లు. ఇతర ఫస్ట్ గ్రేడ్ నటీన‌టులు ఎవ‌రూ ఉత్స‌వాల‌కు రాలేదు! అని జుల్లీ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

ఆయన వ్యాఖ్యలపై హౌస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయ‌గా.. ఇప్పుడు మాధురి దీక్షిత్ సెకండ్ గ్రేడ్ యాక్ట‌ర్.. ఆమె ఉన్నత స్థితి పోయింది. దిల్, బేటా వంటి సినిమాల్లో నటించిన కాలంలో ఆమె ఒక స్టార్! అని కాంగ్రెస్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజాదరణ పొందుతున్న‌ నటులు ఎవ‌రూ ఐఫా ఉత్స‌వాల‌కు హాజరు కాలేదని అత‌డు అన్నాడు. మాధురి దీక్షిత్ మంచి నటి అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ మాధురి కెరీర్ పీక్ టైమ్ ముగిసిపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అయితే జుల్లీ ఒక మ‌హిళా న‌టిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసార‌ని బిజెపి నాయకురాలు, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ప్ర‌తిస్పందించారు. అవి కేవ‌లం అత‌డి `వ్యక్తిగత అభిప్రాయాలు` అని దియా అన్నారు. ప్ర‌తి న‌టి లేదా న‌టుడు గౌర‌వానికి అర్హులు. క‌ళ‌ల‌ను గౌర‌వించాలి. ఆయ‌న వ్యాఖ్య‌లు ఖండించ‌ద‌గిన‌వి అని దియా వ్యాఖ్యానించారు.