టిల్లుగాడు ఈజీగా సెంచరీ కొట్టేలా ఉన్నాడే!
'టిల్లు స్క్వేర్' సినిమాకి యూత్ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
By: Tupaki Desk | 30 March 2024 5:42 PM GMT2022 ఫిబ్రవరిలో వచ్చిన 'డీజే టిల్లు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు లేటెస్టుగా దానికి సీక్వెల్ గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చి, హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే 23.7 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. రెండో రోజు దాని కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెప్పినట్లు టిల్లుగాడు బాక్సాఫీసు దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేస్తాడేమో అనిపిస్తోంది.
'టిల్లు స్క్వేర్' సినిమాకి యూత్ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బుక్ మై షోలో ప్రతి గంటకు 15 వేల నుంచి 20 వేల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఎ సెంటర్లు, మల్టీప్లెక్స్‌లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. బి, సి సెంటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ టిల్లు గాని ర్యాంపేజ్ కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఎవరూ ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా ఉత్తర అమెరికాలో ఇప్పటికే $1 మిలియన్ దాటినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్ల నుంచి $503,218 రాబట్టగా.. శుక్రవారం $483,497 కలుపుకొని మొత్తం $986,715 వసూళ్లు అందుకుంది. అయితే శనివారం ఎర్లీ మార్నింగ్ షోల గ్రాస్‌తో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లో మొదటి $1 మిలియన్ సినిమాగా 'డీజే టిల్లు 2' నిలిచింది.
'టిల్లు స్క్వేర్' సినిమా రానున్న రోజుల్లో యుఎస్ లో $3 మిలియన్ల వరకూ వెళ్ళొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెకండ్ హయ్యస్ట్ తెలుగు గ్రాసర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు. ఇక తెలుగు స్టేట్స్ లోనూ ఈ సినిమా భారీవసూళ్లను సాధిస్తోంది. ఒక్క నైజాం ఏరియాలోనే 15 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా. చూస్తుంటే టిల్లు పార్ట్-2 వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సిద్ధు స్వయంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా.. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు