బాహుబలి, కేజీఎఫ్... ఇప్పుడు టిల్లు గాడు
అయితే సీక్వెల్స్ మరియు రెండో పార్ట్ ల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
By: Tupaki Desk | 2 April 2024 4:08 AM GMTఈ మధ్య కాలంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్, రెండు పార్ట్ లు, ప్రాంచైజీ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా గడచిన పదేళ్లలో ఈ ట్రెండ్ నడుస్తోంది. అయితే సీక్వెల్స్ మరియు రెండో పార్ట్ ల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ భారీ విజయాలు సాధించిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో బాహుబలి 2 మరియు కేజీఎఫ్ 2 లు ముందు ఉంటాయి. కార్తికేయ 2 ఇంకా బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో టిల్లు స్క్వేర్ నిలిచింది.
డీజే టిల్లు కి కొనసాగింపు అన్నట్లుగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా మొదటి పార్ట్ తో పోల్చితే రెట్టింపు విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి విజయం టాలీవుడ్ కి లేదని చెప్పాలి. మూడు రోజులు కూడా నిండా ముగియకుండానే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాల దిశగా టిల్లు స్క్వేర్ దూసుకు పోతుంది.
సిద్దు జొన్నలగడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమాను సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించాడు. చాలా కాలంగా వరుస సినిమాలతో నిరాశే మిగులుతున్న సితార వారికి ఈ సినిమా భారీగా లాభాల పంట పండించే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ నుంచి వచ్చిన సీక్వెల్స్ లో బాహుబలి మరియు కేజీఎఫ్ సినిమాలు అత్యధిక వసూళ్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ వాటి తర్వాత నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది రాబోతున్న పుష్ప 2, వచ్చే ఏడాది రాబోతున్న సలార్ 2 తో పాటు దేవర 2 ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో చూడాలి.